రెండోదశ గొర్రెల పంపిణీకి రంగం సిద్ధం


Mon,January 21, 2019 12:37 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: యాదవ కుటుంబాల జీవనవిధానం మెరుగుపర్చాలనే ఉద్దేశంతో రూ. 1.25 లక్షల యూనిట్ కాస్టును నిర్ణయించి 75శాతం సబ్సిడీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసేటువంటి గొర్రెల పంపిణీ పథకం రెండోదశకు శ్రీకారం చుట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేస్తున్న అధికారులు 2017 జూన్‌లో తొలివిడుతలో భాగంగా 25,848 మంది లబ్ధిదారులకు యూనిట్లను అందజేసింది. అయితే టీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని జాప్యం చేయకుండా వెంటనే ప్రారంబించేలా చర్యలు చేపట్టింది. తొలి విడతలో 33,196 మంది లబ్ధిదారులుండగా 25,848 మందికి ఇచ్చిన అధికారులు డీడీలు కట్టిన వారితోపా టు మిగిలిన వారికి త్వరలో అందించి రెండో విడుతలో మరో 31,298 మందికి అందజేయనున్నారు.

ఈ వారంలోనే రెండో దశ
రాష్ట్ర ప్రభుత్వం 75శాతం సబ్సిడీతో 20 గొర్రెలు ఒక పొట్టేలును యాదవ సోదరులకు అందజేస్తున్న గొర్రెల పంపిణీ పథకం రెండోదశ కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సర్కార్ ఆదేశాల మేరకు ఈ వారంలోనే ప్రారంభించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు రెండోదశ ప్రారంభించాల్సి ఉండగా కాస్త బ్రేక్ పడింది. అయితే ఈ నెల 21న దేవరకొండ రెవె న్యూ డివిజన్‌లో ఎన్నికలు పూర్తి కానుండగా 25న మిర్యాలగూడ, 30న నల్లగొండలో జరగనున్నాయి. మొదటగా ఈ వారంలోనే దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తర్వాత మిర్యాలగూడ, నల్లగొండలో అమలు చేయనున్నారు. ఏదేమైనా పక్షం రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా అన్ని మం డలాల్లో గుర్తించినటువంటి యాదవులకు జాబితా ఆధారంగా గొర్రెల యూనిట్లను అందజేసే విధంగా ప్రారంభ కార్యక్రమం జరుగనుంది.

తొలిదశలో రాష్ట్రంలోనే మొదటి స్థానం
జిల్లాలోని 31 మండలాల్లో గ్రామాల వారీగా యాదవ కుటుంబాలను గుర్తించినటువంటి అధికారులు జిల్లా లో ఎక్కువమంది యాదవులు ఉండటంతో రెండు విడతలుగా జాబితాను రూపొందించారు. తొలివిడతలో 33,196 మందికి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని 2017 జూన్‌లో ఈ పథకాన్ని ప్రారంభించిన అధికార యం త్రాంగం ఇప్పటి వరకు 25,848 మందికి గొర్రెల యూనిట్లను అందజేసింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్ నుంచే ఈ కార్యక్రమానికి పుల్‌స్టాప్ పడగా తొలిదశలో మరో 7500 మందికి ఇవ్వాల్సి ఉంది. అందులో ఇప్పటికే 2వేల మంది డీడీ లు తీయగా వారితోపాటు మిగిలిన వారికి సైతం ఈ ప క్షం రోజుల్లోనే ఇవ్వనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాల్లో గొర్రెల పంపిణీ జరగ్గా అత్యధికంగా 25,848 యూనిట్లు అందజేసిన ఘనత జిల్లా పశు సంవర్థక శాఖ యంత్రాంగానికే దక్కింది.

పక్కా నిఘాతో రెండో దశ ప్రణాళిక
గొర్రెల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరుగకుం డా లబ్ధిదారులకే యూనిట్లు అందజేయాలనే ఉద్దేశంతో సర్కార్ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఈసారి పక్కా నిఘతో రెండోదశ ప్రణాళిక చేపట్టింది. ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను పటిష్టం చేయడంతోపాటు రవాణ, పోలీస్ యం త్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అక్రమాలు జరుగకుండా రీసైక్లింగ్‌కు స్వస్తి చెప్పాలని అధికారులు యోచిస్తున్నారు. అందులోభాగంగానే ఈసారి గుం టూరు నుంచి గొర్రెలను కొనుగోలు చేయకుండా ప్రకా శం, నెల్లూరు నుంచే మాత్రమే కొనుగోలు చేసే లా చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా తొలిదశలో 5.50 లక్షల గొర్రెలను అందజేయగా అందులో 3 లక్షల గొర్రె పిల్లలు జన్మించడంతో మంచి ఫలితాలు అందినట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ యంత్రాంగం చెబుతోంది.

284
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...