సమన్వయంతో గొర్రెల పంపిణీ చేపట్టాలి


Sun,January 20, 2019 02:16 AM

-తొలుత దేవరకొండ నుంచి ప్రారంభించాలి
-కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఈనెల నుంచి ప్రారంభమయ్యే రెండో దశ గొర్రెల పంపిణీని ఆయా శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జీఎమ్ ఫెడరేషన్ ఎండీ లక్ష్మారెడ్డితో కలిసి ఆయా శాఖల అధికారులతో గొర్రెల పంపిణీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అక్రమాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్సు బృందాలు అప్రమత్తంగా ఉండాలని చెక్ వద్ద నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రెండో దశ పంపిణీలో జాప్యం జరిగిందన్నారు. ఈ నెలలోనే తొలుతగా దేవరకొండ నుంచి గొర్రెల పంపిణీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జీవాలను రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ అమలు పరచాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా తొలి దశలో గొర్రెలు తీసుకున్న రైతుల సక్సెస్ స్టోరీలను మలిదశలో తీసుకునే రైతులకు చూపించి వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా తొలి దశ గొర్రెల పంపిణీ వివరాలను పశుసంవర్ధక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ పథకంలో గొర్రెల షెడ్లు, నీటి తొట్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. షెడ్లకు రూ.88 వేలు ఇస్తుండగా నీటి తొట్లకు రూ.22వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సారి గుంటూరు నుంచి కాకుండా ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో పెంచిన ైస్టెలో గడ్డి జీవాలకు ఉపయోగించుకునేలా చూడాలని, ఈ విషయంలో అటవీ అధికారులు అభ్యంతరం చెప్పొద్దన్నారు. అనంతరం గొర్రెల మేకల సహకార అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ డా.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గొర్రెలకు పశుగ్రాసం కొరత లేకుండా ముందస్తుగా 75 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలను సరఫరా చేశామని, త్వరలో మరో 200 మెట్రిక్ టన్నుల విత్తనాలను పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో అటవీ శాఖ అధికారి శాంతారామ్, ఎంవీఐ వెంకట్ ఇన్ పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, ఏఎస్పీ పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...