పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు


Fri,January 11, 2019 01:22 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 3 రెవెన్యూ డివిజన్లలో మూడు విడతలుగా పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ రంగనాథ్‌తో కలిసి పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో ఈ నెల 21,25,30 తేదీలలో 837 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 21న దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు జరుగనుండగా 25న మిర్యాలగూడ డివిజన్‌లో, 30న నల్లగొండ డివిజన్‌లో నిర్వహిస్తామన్నారు. మొత్తంగా 837 సర్పంచ్ స్థానాలకు గాను 173 ఎస్టీ, 136 ఎస్సీ, 165 బీసీలకు రిజర్వు కాగా మరో 370 అన్‌రిజర్వుడు స్థానాలుగా రిజర్వు అయ్యాయని వీటితో పాటు 7270 వార్డు స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రజలంతా ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలకు పాల్పడకుండా మంచి వాతావరణంలో పోలింగ్ జరిగేలా సహకరించాలనికోరారు.

మూడు విడుతలుగా ఎన్నికలు....
జిల్లాలో ఈ నెల 21న దేవకొండ రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు జరుగనుండగా 25న మిర్యాలగూడ, 30న నల్లగొండ రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరుగనున్నట్లు తెలిపారు. ఇప్పటికే దేవరకొండ డివిజన్ పరిధిలో ఈ నెల 7 నుంచి నామినేషన్లు స్వీకరించామని నేటి నుంచి మిర్యాలగూడ డివిజన్‌లో నామినేషన్ స్వీకరణ చేపట్టనుండగా ఈ నెల 16న నల్లగొండ డివిజన్‌లో నామినేషన్లు తీసుకోనున్నట్లు తెలిపారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 9,37,284 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందులో 4,70,515 మంది పురుషులు, 4,66,738 మంది స్త్రీలు ఉండగా 31 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందుకు గాను 4219 బ్యాలెట్ బాక్సులతో పాటు సర్పంచ్ అభ్యర్థులకు 11.20 లక్షల బ్యాలెట్ పేపర్లు వార్డు సభ్యులకు 11.19 లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించినట్లు వెల్లడించారు. పోలింగ్ నిర్వహణ కోసం 7270 పోలింగ్ స్టేషన్లు అవసరం ఉండగా 192 మినహా మిగిలిన స్టేషన్లన్నీ ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పోలింగ్ రోజే ఫలితాలు...ఉప సర్పంచ్ ఎన్నిక..
రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు జరుగనుండగా పోలింగ్ జరిగిన రోజే ఫలితాలు ప్రకటించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎలక్షన్ నిర్వహించనుండగా తర్వాత కౌంటింగ్ చేపట్టి సాయంత్రానికి తుది ఫలితం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే రోజు వార్డు సభ్యుల మధ్యలో ఉప సర్పంచ్ ఎన్నిక సైతం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

8,200 మంది యంత్రాంగం... 2300మంది పోలీస్ సిబ్బంది
జిల్లా వ్యాప్తంగా 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుండగా ఇందుకు గాను పోలింగ్ నిర్వహణ కోసం 8200 మంది యంత్రాంగం అందుబాటులో ఉండగా 2300 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తొలి విడతలో పాల్గొన్న యంత్రాంగమే మలి విడతలో, తుది విడతలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. అయితే 7270 పోలింగ్ స్టేషన్లలో 7997 మంది ప్రీసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రీసైడింగ్ అధికారులు విధుల్లో పాల్గొననుండగా 8699 మంది ఇతర పోలింగ్ అధికారులు , 277 మంది స్టేజీ-1 రిటర్నింగ్ అధికారులు, 289 మంది స్టేజీ-1 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 935 మంది స్టేజీ-2 రిటర్నింగ్ అధికారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇందులో కొంత మందికి శిక్షణ ఇవ్వగా మరికొంత మందికి ఎన్నికల ముందు నాటికే శిక్షణ పూర్తి చేస్తామన్నారు. 3 రెవెన్యూ డివిజన్లలో 185 రూట్లు గుర్తించామని, అక్కడ నుంచి ఎన్నికల సామగ్రిని రవాణా చేస్తామన్నారు.

మద్యం, డబ్బు పంపిణీపైనా నిఘా...
ఎన్నికలను పురస్కరించుకొని అభ్యర్థులు చేసేటువంటి ఖర్చును పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రత్యేక బృందాలు పర్యటిస్తాయన్నారు. జిల్లాలో 31 మంది అసిస్టెంట్ వ్యయ పరిశీలకులతో పాటు 31 ప్లయింగ్ స్క్యాడ్ బృందాలు, ఎంసీసీ టీమ్స్, వీడియో వివింగ్ టీమ్, వీఎస్‌టీ టీమ్, అకౌంటింగ్ టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేగాక నాగార్జునసాగర్‌లోని విజయపురి సౌత్, దామరచర్ల మండలంలోని వాడపల్లి వద్ద ఉన్న రాష్ట్ర సరిహద్దులతో పాటు అంతర్‌జిల్లా సరిహద్దులు చింతపల్లి మండలంలోని మాల్, చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి, కేతేపల్లి మండలంలోని కొర్లపాడ్, మిర్యాలగూడ మండలంలోని ఆలగడప వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మద్యం, నగదు, రవాణా జరిగితే పట్టుకుని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.

పటిష్ట బందోబస్తు : ఎస్పీ
ఈనెల 21,25,30తేదీలలో జిల్లాలో 3 విడతలుగా నిర్వహించే పంచాయతీ ఎన్నికలు, పోలీస్ బందోబస్తు మధ్యలో నిర్వహించనున్నట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఇందుకు గాను 2300 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలను పురస్కరించుకుని ఇప్పటికే బైండోవర్లు ప్రారంభించామని, పూర్తి స్థాయిలో బైండోవర్లు చేపట్టి ఘర్షణ వాతావరణం సృష్టించే వారిని గుర్తించి కౌన్సిలింగ్ చేస్తామన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు ఎక్సైజ్ వాళ్లతో సమన్వయం చేసుకుని మూసివేస్తామన్నారు. ఎవరూ ఘర్షణలకు పాల్పడొద్దని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో డీఆర్‌వో రవీంద్రనాథ్, డీపీఓ అడ్డాల శ్రీకాంత్, డీపీఆర్‌ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.

235
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...