ఏకగ్రీవ ఎజెండాతో..


Tue,January 8, 2019 02:39 AM

- పంచాయతీ ఎన్నికల్లో ఒక్కటిగా సాగుతున్న పలు పల్లెలు
- పోటీ లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్‌ల ఎన్నికకు ఎత్తులు
- వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌ల విషయంలోనూ అదే తీరు
- ఏకగ్రీవాల విషయంలో ముందున్న గిరిజన తండాలు
- పోటీ లేని ఎంపికతో అభివృద్ధి నిధుల సాధనకు ప్రణాళిక
- రోజురోజుకూ పలు గ్రామాల్లో మారుతున్న పరిణామాలు
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పోటీ వద్దే వద్దు.. ఏకగ్రీవమే ముద్దు.. అభివృద్ధి నిధులను వదులుకోవద్దు.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు పంచాయతీలు ప్రస్తుతం ఈ నినాదాలతోనే ముందుకు సాగుతున్నాయి. చిన్న చిన్న గ్రామాల్లో పోటీ నెలకొనకుండా.. రాజకీయ కక్షలు తలెత్తకుండా.. అందరూ ఒక్కతాటి పై నిలిచి అర్హులైన వారిని సర్పంచ్‌గా ఎన్నుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి అందనున్న రూ. 10 లక్షల ప్రోత్సాహక నిధులతోపాటు ఎమ్మెల్యే, ఎంపీలు సైతం ప్రత్యేకంగా రూ.10 లక్షల వరకు నిధులు ఇస్తామని ప్రకటించడంతో పలు పల్లెటూళ్లు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలోని మూణ్నాలుగు చోట్ల మాత్రమే ఏకగ్రీవ నిర్ణయాలు వెలువడ్డా.. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే నాటికి వీటి సంఖ్య భారీగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తొలి విడుతలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన దేవరకొండ డివిజన్‌లోనే ఇప్పటి వరకు మూడు పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో రెండు గిరిజన తండాలున్నాయి. రెండో దశలో మిర్యాలగూడ డివిజన్‌లో ఈ నెల 25న, చివరి దశలో నల్లగొండ రెవెన్యూ డివిజన్‌లో 30న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

అభివృద్ధికి జై కొడుతున్న పల్లెటూళ్లు.. పంచాయతీ ఎన్నికల్లో ఏకతాటిపై నడుస్తున్నాయి. జిల్లాలో 844 పంచాయతీలుండగా.. ప్రస్తుతం 837 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లో ఈనెల 21న ఎన్నికలు జరుగనుండగా.. రేపటితో నామినేషన్ల దాఖలుకు సమయం ముగిసిపోనుంది. మిర్యాలగూడ డివిజన్‌లో ఈనెల 25న, నల్లగొండలో చివరి దశలో భాగంగా ఈనెల 30న పోలింగ్ జరుగనుంది. గతంతో పోలిస్తే జిల్లాలో 349 పంచాయతీలు నూతనంగా ఏర్పాటైన నేపథ్యంలో.. పలు పంచాయతీల పరిధి తగ్గింది. 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న తండాలే జిల్లాలో 104 ఉండగా.. ఆయా తండాలు పూర్తిగా గిరిజనులకే రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. చిన్న చిన్న పంచాయతీలు, గిరిజన తండాల్లో ఓటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండడంతో.. తామంతా ఒకే తాటి పై నడవాలనే విషయంలో ఆయా గ్రామాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఇప్పటికే పలుచోట్ల ఏకగ్రీవ చర్చలు...
తొలిదశలో భాగంగా దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లో నామినేషన్ల దాఖలుకు రేపటితో ఆఖరు తేదీ కాగా.. ఇప్పటి వరకు మూడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దేవరకొండ మండలంలోని రత్య తండా సర్పంచ్‌గా రమావత్ కన్నీలాల్‌ను సర్పంచ్‌గా ఎన్నుకుంటున్నట్లు ఆ తండావాసులు ప్రకటించారు. కన్నీలాల్ దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్‌కుమార్ తండ్రి కావడం విశేషం. డిండి మండలంలోని కాల్య తండావాసులు రమావత్ జిక్కిని తమ సర్పంచ్‌గా పోటీ లేకుండానే ఎన్నుకున్నారు. చందంపేట మండలంలోని కోరుట్ల సర్పంచ్‌గా దొండేటి మల్లారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ఆ గ్రామస్తులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ మూడు మాత్రమే ఆయా గ్రామాల ప్రజలు అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇంకా పలుచోట్ల ఏకగ్రీవాల కోసం చర్చలు సాగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి వీటి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మిర్యాలగూడ, నల్లగొండ రెవెన్యూ డివిజన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ.. నామినేషన్ల ప్రక్రియ ముగింపు నాటికి ఏకగ్రీవాల స్థానాల విషయంలో స్పష్టత రానుంది. సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ స్థానాల విషయంలోనూ చాలా గ్రామాలు ఒక్కతాటిపైనే నడుస్తున్నాయి. పోటీ లేకుండానే సభ్యుల ఎంపికకు చర్చలు సాగుతున్నాయి. అభివృద్ధి నిధులను సాధించుకోవడంతోపాటు.. తామంతా ఒక్కటిగా ఉన్నామని ఐక్యత చాటడానికి సైతం ఈ దిశగా పలు గ్రామాలు అడుగులు వేస్తున్నాయి.

267
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...