యాదాద్రిలో శివుడికి రుద్రాభిషేకం


Tue,September 18, 2018 02:04 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనర సింహస్వామి వారి సన్నిధిలోని శ్రీపర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరస్వామికి సోమవారం రుద్రాభిషేకం నిర్వహించారు. యాదాద్రీశుడి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. పరమశివుడికి భక్త జనులు రుద్రాభిషేకం జరిపించారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివుడ్ని కొలుస్తూ రుద్రాభిషేకంలో సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన పరమశివున్ని విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుభ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు. శివాలయం ఉప ప్రధాన పురోహితుడు గౌరీభట్ల నర్సింహరాములుశర్మ ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. శ్రీలక్ష్మీనరసింహుని బాలాలయంలో శ్రీ సుదర్శన నారసింహ మహాయాగంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు నిత్య కల్యాణోత్సవం జరిపించారు. శ్రీవారి ఖజానాకు రూ. 7, 04, 067 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీవారికి వెండి కలశాల బహూకరణ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి కలశాభిషేకం కోసం హైదరాబాద్‌కు చెందిన జే. సీతారాం అనే భక్తుడు ఒక్కటి 460 గ్రాముల బరువు గల 3 వెండి కలశాలను ఆలయాధికారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దోర్బల భాస్కరశర్మ, ప్రధానార్చకులు కారంపూడి నర్సింహాచార్యులు పాల్గొన్నారు.

దూరదర్శన్ డైరెక్టర్ ప్రత్యేక పూజలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి దూరదర్శన్ డైరెక్టర్ శైలజా దంపతులు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం శ్రీవారికి జరిగిన అష్టోత్తర పూజల్లో కిషన్‌రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ గీత పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...