ప్రణయ్‌కి కన్నీటి వీడ్కోలు


Mon,September 17, 2018 02:24 AM

మిర్యాలగూడ నమస్తే తెలంగాణ/మిర్యాలగూడ రూరల్: ప్రేమ వివాహం చేసుకుని దారుణహత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కి(24) దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రణయ్ సోదరుడు అజయ్‌కుమార్ రష్యా నుంచి రావడం తో ఆదివారం సాయంత్రం అంతిమయాత్ర నిర్వహించారు. ప్రణయ్ ఇంటి నుంచి రిజిష్ర్టార్ కార్యాలయం మీదుగా రాజీవ్ చౌక్ నుంచి చర్చి వరకు సాగిన అంతిమ యాత్రలో కులసం ఘాలు, వివిధ పార్టీల నాయకులు, మృతుడి బంధువులు, స్నేహితులు వేలాదిగా తరలివచ్చారు. సాగర్ ప్రధానరహదారికి ఇరువైపుల పెద్దఎత్తున గుమిగూడిన ప్రజలు ప్రణయ్ మృతదేహాన్ని చూసి కంటతడిపెట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ను అతి దారుణంగా హత్య చేయించిన మారుతిరావుతోపాటు సం బంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అంతిమయాత్రకు వచ్చి న కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రణయ్‌ను మృతదేహాన్ని క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఖననం చేశారు.

నివాళులర్పించిన ప్రముఖులు
పట్టణంలోని వినోభానగర్‌లో మృతుడినివాసంలో ప్రణయ్ మృతదేహానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థల చైర్మన్ మందుల సామేల్, ఎమ్మెల్సీ రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ప్రముఖ కవి గోరటి వెంకన్నతోపాటు కులసంఘాల రాష్ట్ర నాయకులు, మానవ హక్కుల వేదిక నాయకులు నివాళులర్పించారు. అదేవిధంగా తాజామాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు, కవి గోరటి వెంకన్నతోపాటు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్, తిరునగర్ నాగలక్ష్మీభార్గవ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

కన్నీరు మున్నీరైన అమృత, కుటుంబసభ్యులు
నిండునూరేళ్లు కలిసి ఉంటామని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ అమృతలు నిండా తొమ్మిది నెలలు కాకుండానే ప్రణయ్ దారుణ హత్యకు గురికావడంతో అమృత కన్నీరుమున్నీరై విలపించింది. కడవరకు తోడుంటాడని అనుకున్న భర్తను కళ్లేదుటే దారుణ హత్య గురికావడంతో అమృత తీవ్ర మనోవేదనకు గురవుతోంది. తన భర్తను చంపిన తండ్రి మారుతిరావు, బాబాయి శ్రవణ్‌లతోపాటు ఇతర నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కుల అహంకార హత్యకు గురైన ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అమృతతోపాటు కుటుంబ సభ్యులు కోరారు. ఇక మీదట ఇటువంటి కులంహకార హత్యలు జరగకుండా ప్రణయ్‌దే చివరి ఘటన కావాలని వేడుకుంది.
పట్టపగలు అందరూ చూస్తుండగానే పట్టణంలో హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ని హతమార్చిన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని తాజామాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, టీఆర్‌ఎస్ సాగర్ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్యలతోపాటు ఎమ్మెల్సీ రాములు అన్నారు. ప్రణయ్ అంతిమయాత్రలో వారు పాల్గొన్నారు.

ప్రణయ్ తమ్ముడు అజయ్‌తో పాటు తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలతల, భార్య అమృతను ఓదార్చి పరామర్శించారు. కుల దురహంకార పూరితమైన హత్యలను నిలువరించాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ్ధ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. ప్రణయ్ అంతిమయాత్రలో ఆయన పాల్గొని ఘనంగా నివాళుల ర్పించి ప్రణయ్ కుటంబ సభ్యులను ఓదార్చారు. నేటి ఆధునిక సమాజంలో ఇలాంటి నీచమైన హత్య లు చేయడం అనైతికమని ప్రముఖ జానపద గాయకు డు, కవి గోరటి వెంకన్న అన్నారు. ప్రణ య్ అంతిమయాత్రలో పాల్గొని మాట్లాడారు. సమాజంలో ఇలాంటి తరహాలో హత్యలు జరుగుతున్నాయని ఇలాంటి పరువు హత్యలు పురారావృతం కాకుం డా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులు కఠినంగా శిక్షించాలన్నారు.

ఏడు ప్రత్యేక బృందాలతో విచారణ
మిర్యాలగూడ రూరల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన సూత్రదారులైన తిరునగర్ మారుతిరావు, శ్రవణ్‌లతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన సూత్రదారులు మారుతిరావు, శ్రవణ్‌లను హైదరాబాద్ సమీపంలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని పలు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. వీరితోపాటు హత్య విషయమై మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. మరి న్ని వివరాలను సేకరించేందుకు స్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఏడు టీములను ఏర్పాటు విచారణను వేగవంతం చేశారు. పూర్తి విచారణ అనంతరం ప్రణయ్‌ను హతమార్చిన నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కోర్టుకు రిమాండ్ చేయనున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
పోలీసుల అదుపులో పలువురు
ప్రణయ్ హత్యకేసు విచారణలో భాగంగా అమృత తండ్రి మారుతిరావుకు అత్యంత సన్నిహితుడు పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుపారీ గ్యాంగ్‌ను కలిసేందుకు మారుతిరావుకు ఖరీం సహకరించినట్లు పోలీస్‌లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖరీంను విచారిస్తున్నట్లు సమాచారం. ఖరీంతోపాటు ఖాసీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కిడ్నాప్ చేసిన వ్యక్తులతోనే హత్యకు స్కెచ్ వేశారా....?
ఇప్పటికే కోట్ల విలువైన ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకోవడంతోపాటు పలు ల్యాండ్ సెటిల్‌మెంట్లకు కేరాఫ్‌గా ఉన్న తిరునగర్ మారుతిరావు తన భూదందాకు అడ్డు వచ్చిన వారిని బెదిరింపులకు దిగేందుకు తరచుగా సుపారీ గ్యాంగ్‌ల సహకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సుమారు ఆరేళ్ల క్రితం ఓ భూ వివాదం విషయమై తనను కిడ్నాప్ చేసిన గ్యాంగ్‌కే సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత మార్చేందుకు స్కెచ్ వేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. ప్రణయ్‌ను హత్య చేసేందుకు సుమారు కోటి రూపాయాల డీల్ కుదుర్చుకున్నారు. అందులో రూ.50లక్షలను సుపారీ గ్యాంగ్‌కు అడ్వాన్స్‌గా ముట్టచెప్పినట్లు సమాచారం. హత్య అనంతరం మిగిలిన డమ్బులను ఇచ్చేవిధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

అన్ని కోణాల్లో విచారణ వేగవంతం
పట్టణ నడిబొడ్డున జరిగిన ప్రణయ్ హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారణ వేగవంతం చేశారు. మారుతిరావు ప్రణయ్‌ను హత్య చేసేందుకు ఎవరి ద్వారా సుపారీ గ్యాంగ్‌ను కలిశారు. ఆ గ్యాంగ్‌కు ఐఎస్‌ఐ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా లేక అత్యంత కిరాతక హత్యకు పాల్పడిన హంతక ముఠా అండగా ఉంటున్న వారెవరూ, ఎక్కడి నుంచి వచ్చారన్న అంశంతో పాటు వారు వినియోగించిన వాహనాలు ఎవరివి, ప్రణయ్ ఇంటి ముందు తరచుగా రెక్కీ నిర్వహించి వారు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారు. ఇలా ప్రణయ్ హత్య కేసు మిస్టరీని చేధించేందుకు అన్ని కోణాల్లో విచారణ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

భారీ పోలీసు బందోబస్తు
మిర్యాలగూడ టౌన్: హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ అంతిమయాత్రను ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో భారీ బం దోబస్తు ఏర్పాటు చేశారు. 500మంది సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులతో పట్టణం లో ఆదివారం ఉదయం నుంచే పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈనెల 14న మధ్యాహ్నం స్థానిక జ్యోతి హాస్పిటల్ ఎదుట దారుణహత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ప్రణ య్ తమ్ముడు అజయ్ ఉక్రేయిన్‌లో విద్యభ్యాసం కొనసాగిస్తుడడంతో ఆయ న వచ్చేంత వరకు ప్రణయ్ భౌతికకాయాన్ని ఉంచారు. అజయ్ వచ్చిన తర్వాత ప్రణయ్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. మిర్యాలగూడ నల్లగొండ డీఎస్పీలు శ్రీనివాస్, సుధాకర్ ఆధ్వర్యంలో చేపట్టిన బందోబస్తులో భారీసంఖ్యలో మోహరించారు.

300
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...