ఓటరుగా చేరండి..


Sat,September 15, 2018 02:51 AM

-01.01.2018 నాటికి 18ఏండ్లు వయస్సుంటే అర్హులు
-ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, మీసేవ ద్వారా దరఖాస్తుకు అవకాశం
-ఈనెల 25వరకు గడువు.. వచ్చే నెల 8న తుది జాబితా
-ఓటు ఉన్న వాళ్లూ తమ పేరు సరి చూసుకోవాలని సూచన
-నేడు, రేపు అన్ని పోలింగ్ బూత్‌ల పరిధిలో జాబితా వెల్లడి
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటరుగా పేరు నమోదు చేసుకునే చివరి అవకాశం ఈ నెల 25తో ముగియనుంది. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, రామన్నపేట మండలాలను సైతం మన జిల్లా పరిధిలోకి తీసుకొని.. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ స్థానాల పరిధిలో మొత్తం జిల్లాలో 12,23,554 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితా వివరాలను జిల్లాలో మొత్తం 1200 ప్రాంతాల్లో ఉన్న 1628 పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురించారు.

ఈనెల 25వరకు కొత్త ఓటర్లకు అవకాశం..
కేంద్ర ఎన్నికలసంఘం ఆదేశం ప్రకారం ఈ నెల 10నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ 25తో ముగుస్తుంది. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం నేరుగా బూత్ స్థాయి పోలింగ్ అధికారికి, తహసీల్దార్ కార్యాలయంలో, డివిజన్, జిల్లా ఎన్నికల అధికారులకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఓటు నమోదు కోసం ఫామ్-6, తొలగింపు కోసం ఫామ్-7, తప్పు ఒప్పుల సవరణకు ఫామ్ 8, పోలింగ్ స్టేషన్ మార్చుకోవడానికి ఫామ్-8ఏ సమర్పించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎన్‌వీఎస్‌పీ.ఐఎన్ (నేషనల్ వోటర్స్ సర్వీస్ పోర్టల్) ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే అవకాశం ఉంది. మీ సేవ ద్వారా కూడా దీనిని పొందవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా జిల్లాలో నేడు, రేపు అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోనూ ఓటరు జాబితాను చదివి వినిపించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాలేజీల్లో చదువుకునే విద్యార్థుల్లో ఎక్కువ మంది నూతనంగా ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటున్నందున వారి కోసం ప్రత్యేక క్యాంపులు సైతం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్లు కూడా తప్పనిసరిగా తమ ఓటు సరిగ్గా ఉందో లేదో.. జాబితాలను పరిశీలించడం ద్వారా కానీ, ఆన్‌లైన్‌లో కానీ సరి చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి నిమిషంలో వచ్చి తమకు ఓటు లేదని, ఉన్న ఓటు హక్కు పోయిందని, పోలింగ్ స్టేషన్ మారిందని అభ్యంతరాలు వ్యక్తం చేసినా సరిచేసే అవకాశం లేనందున ఇప్పుడే వాటిని సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 25తో గడువు ముగిసిన తర్వాత ఆయా దరఖాస్తులను అక్టోబర్ 4 వరకు పరిశీలించి, 7 వరకు ఆన్‌లైన్‌లో పొందు పరిచి, 8న తుది జాబితా ప్రచురించనున్నారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...