కాంగ్రెస్‌లో గ్రూపుల గోల


Mon,September 10, 2018 02:44 AM

- పేర్ల ప్రకటనకు ముందే ప్రచారం ప్రారంభించిన వైనం
- తమకే టికెట్.. అంటూ ఒక్కో చోట నలుగురి విశ్లేషణలు
-అవకాశం దక్కకుంటే తమ వాళ్లనే ఓడించే ప్రణాళికలు
- ఏమి జరుగుతుందో తెలియని గందరగోళంలో క్యాడర్
- ఉత్సాహంగా ఉన్న టీఆర్‌ఎస్ వైపు పలువురి చూపు..
- ప్రచారంతో దూసుకుపోతున్న అధికార పార్టీ అభ్యర్థులు
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆలూ, చూలూ లేదు.. అన్న చందంగా తయారైంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి. ముందస్తు ఎన్నికల శంఖారావం పూరించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అభ్యర్థులను సైతం ప్రకటించి ప్రచారమూ ప్రారంభించడం తెలిసిందే. 12అసెంబ్లీ స్థానాలకు 10మంది అభ్యర్థులను ఖరారు చేయడంతో... జిల్లాలోనూ ఇప్పటికే భారీ ర్యాలీలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో మాత్రం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అందుబాటులో లేకపోగా... టీపీసీసీ నేతలంతా రాష్ట్ర స్థాయి సమావేశాలతోనే సరిపెడుతున్నారు. మొదటి నుంచి వర్గ పోరుకు పెట్టింది పేరైన హస్తం పార్టీలో.. ప్రస్తుతమూ అదే పరిస్థితి కొనసాగుతున్నది. రాష్ట్ర నాయకత్వంతో పొసగని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి నేతలు సమావేశాలకు సైతం డుమ్మా కొడుతున్నారు.

ఖరారుకు ముందే పోటా పోటీ....
టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తుంటే కాంగ్రెస్‌లో మాత్రం నాకే అవకాశం.. అంటూ అంతర్గతంగా కొందరు, బహిరంగంగా మరికొందరు తగవులాడుతున్నారు. మునుగోడు నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి స్రవంతి టికెట్ రేసులో ఉండగా... ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టికెట్ ఆశిస్తుండడమే గాకుండా ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. బీసీ కోటాలో తనకు అవకాశం దక్కుతుందని ఆశిస్తున్న పీసీసీ అధికార ప్రతినిధి నారబోయిన రవి.. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగేందుకు ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం. ఓయూ జేఏసీ పూర్వ నాయకుడు పున్న కైలాష్ కూడా ఇక్కడ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం యత్నిస్తున్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు పీసీసీచీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అండతో నలగాటి ప్రసన్నరాజు, సీనియర్ నేత జానారెడ్డి ప్రోత్సాహంతో కొండేటి మల్లయ్య కూడా రేసులో ఉన్నామని ప్రచారం చేసుకుంటున్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటు టీడీపీ నుంచి చేరిన పటేల్ రమేష్‌రెడ్డి సైతం తనకే టికెట్ దక్కాలని బహిరంగంగానే ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక్కడ నుంచి తండు శ్రీనివాస్ కూడా అవకాశం ఆశిస్తున్నారు.దేవరకొండలో రేవంత్‌రెడ్డితో పార్టీలో చేరిన బిల్యానాయక్‌తో పాటు ఢిల్లీలో సంబంధాలున్న జగన్‌లాల్ సహా మరికొందరు ప్రయత్నిస్తున్నారు. భువనగిరిలో ప్రస్తుతం పీసీసీ చీఫ్ అనుచరుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిస్తున్నా... టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, గత ఎన్నికల్లో ఓటమి పాలైన పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అందెల లింగయ్యయాదవ్, జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తుంగతుర్తిలో ఇన్‌చార్జిగా అద్దంకి దయాకర్ ఉండగా గుడిపాటి నర్సయ్య, డాక్టర్ జ్ఞానసుందర్ టిక్కెట్ కోసం ప్రయత్నాల్లో ఉంటూనే వర్గాలను నడిపిస్తున్నారు.

మిర్యాలగూడ నుంచి జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి పేరు వినిపిస్తుండగా.. ఎన్నారై పోరెడ్డి శ్రవంత్, స్కైలాబ్ నాయక్ సహా పలువురు ఎవరికి వారుగా తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆలేరులో మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్‌తో పాటు... పల్లె శ్రీనివాస్‌గౌడ్ కూడా అవకాశం అడుగుతున్నారు. ఇలా అన్ని స్థానాల్లోను ప్రతి ఆశావహ అభ్యర్థి కూడా ప్రయత్నాలతో పాటు గ్రూపులను సైతం ప్రోత్సహిస్తుండడం పార్టీలో మిగిలిన కొందరు కార్యకర్తలకు అంతు చిక్కడం లేదు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ టీడీపీ, సీపీఐలతో పొత్తు పెట్టుకుంటుందనే అంశం కూడా ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఉత్సాహంగా ఉన్న టీఆర్‌ఎస్‌వైపు ఆకర్షిస్తోంది.

355
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...