పాడి అభివృద్ధికి పక్కా ప్రణాళిక


Mon,September 10, 2018 02:40 AM

- 3.36లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ
- సంకరజాతి ఉత్పత్తికి పశుసంర్థక శాఖ చర్యలు
- రెండేళ్లుగా ఉమ్మడి జిల్లాకు రాష్ట్రంలో మొదటి స్థానం
నల్లగొండ, నమస్తేతెలంగాణ: జిల్లా రైతాంగం అధికం గా వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నది. మన ప్రాంత పశువుల్లో పాల ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండడంతో రైతులు ఇతర ప్రాంతాలకు చెందిన మేలు రకం పశువులను కొనుగోలు చేసి తీసుకొచ్చుకుంటున్నారు. అయినా అవి ఇక్కడి వాతావరణం తట్టుకుని జీవించే పరిస్థితి లేక రైతులు నష్టపోతున్నారు. దీంతో పునరుత్పత్తిలో భాగం గా కృత్రిమ గర్భధారణ చేపట్టడం ద్వారా మేలురకమైన జాతి పశువులను మన ప్రాంతంలోనే అభివృద్ధి చేసేందుకు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. గోపాలమిత్రలతో ఏటా కృత్రిమ గర్భధారణపై దృష్టి సారిస్తూ నాలుగేళ్లుగా మంచి ప్రగతి సాధిస్తోంది. ఈ విషయంలో రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది 2.19లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయగా ఈసారి 3.36లక్షల పశువులకు చేశారు. ఈనేపథ్యంలో గత సంవత్స రం 1.13లక్షలు, ఈ సంవత్సరం 1.09లక్షల మేలు జాతి దూడలు జన్మించాయి.

జిల్లాకు మొదటి స్థానం...
పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తే మేలు జాతి దూడలు జన్మించి పాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయమై దృష్టిసారించింది. అందుకు అనుగుణంగా జిల్లాలో చేపట్టిన కృత్రిమ గర్భధారణపై నాలుగేళ్లుగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 1320 గోపాలమిత్రలు 8,06, 399 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయగా నల్లగొండలో 228 మంది గోపాలమిత్రలు 2,03,879 పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,71,263 మేలు జాతి దూడలు జన్మించగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 61,018 మేలు జాతి దూడలు జన్మించడంతో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో తొలి స్థానాన్ని పొందింది. ఈ ఏడాది గోపాలమిత్రలతో పాటు ఇతర వనరుల ద్వారా రైతులు 3.36 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ నిర్వహించగా 1.09 లక్షల దూడలు జన్మించాయి. మేలు జాతి పశువుల్లో ముర్రా గేదెలతోపాటు జెర్సీ, హెచ్‌ఎఫ్ ఆవులు, ఒంగోలు గిత్తలు ఉన్నాయి.

పాడి పశువుల జిల్లాగా నల్లగొండ...
రానున్న రోజుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పాడి పశువులకు నెలవుగా నిలిచిపోయేలా జిల్లా యంత్రాంగం రైతాంగాన్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పాడి పశువుల్లో 25 శాతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉండటం గమనార్హం. పైగా ఇటీవల కాలంలో సంకర జాతి పశువులు సైతం పెరగడంతో పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. ఇప్పటికే జిల్లాలో 9 లక్షల పాడి పశువులు ఉండగా అందులో డూడలతో కలిసి 3 లక్షలకు పైగా మేలు జాతి పశువులు ఉన్నాయి. తాజాగా ప్రభు త్వం 50 శాతం సబ్సిడీతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 43 వేల పాడి పశువులను సబ్సిడీ కింద రైతులకు అందజేస్తుండటంతో వీటి సంఖ్య మరింత పెరిగి రానున్న రోజుల్లో పాడి పశువుల జిల్లాగా నల్లగొండ తొలి స్థానం సాధించనున్నట్లు పశుగణాభివృద్ది, పశు సంవర్ధక శాఖ యంత్రాంగం అంచనా వేస్తున్నది.

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే పశువుల అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం వల్లే ఇటీవల కాలంలో పశువుల అభివృద్ధి గణనీయంగా పెరుగుతోంది. మేలు జాతి పాడి పశు అభివృద్ధి కోసం గోపాలమిత్రలు నిరంతరం కృషి చేస్తున్నారు. గడిచిన రెం డేళ్లలో నల్లగొండ రాష్ట్రంలోనే ప్రథమస్థానం సంపాదించడం సంతోషం. రానున్న రోజుల్లో నల్లగొండ పాడి పశువులకు నిలయంగా ఉండటంతోపాటు ఇతర జిల్లాలకు ఇక్కడ నుంచే విక్రయించే రోజులు రానున్నాయి.
-మోతి పిచ్చిరెడ్డి, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్

253
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...