- పురాతన ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకం అమలు
-ఉమ్మడి జిల్లాలో మరో 225 ఆలయాలు ఎంపిక
- నల్లగొండలో 103, సూర్యాపటలో 53, యాదాద్రిభువనగిరిలో 69
- జీఓ 193 విడుదలతో సర్వత్రా హర్షం
నల్లగొండకల్చరల్: దేవాదాయ, ధర్మాదాయశాఖలో రిజిస్ట్రేషన్ అయిన పురాతన ఆలయాలను పరిరక్షించి వాటిలో నిత్య పూజలు జరిగే విధంగా ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు ఆయా ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకం అమలుచేసేందుకు చర్యలు తీసుకుంది. దీంతో ఆలయాలకు నిత్య పూజలతో పూర్వవైభవం సంతరించుకోనుంది.
ఉమ్మడి జిల్లాలో 225 ఆలయాలకు...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధూప, దీప, నైవేద్యం పథకాన్ని మరో 225 ఆలయాలకు దీన్ని వర్తింప చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శివశంకర్ ఈనెల 5న జీఓ జారీ చేశారు. వీటిలో నల్లగొండ జిల్లాలో 103, సూర్యాపేటలో 53, యాదాద్రిభువనగిరిలో 69 దేవాలయాలు ఉన్నాయి.
ఈజీఓ ఉత్తర్వులు జిల్లా దేవాదాయ, ధర్మాదాయశాఖకు అందాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 202 ఆలయాల్లో ఈ పథకం అమల్లో ఉంది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధీనంలో పని చేస్తున్న అర్చకుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా వేతనాలు అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించన విషయం విధితమే. అంతేకాకుండా అర్చకుల వయోపరిమితిని (ఉద్యోగ విరమణ)58 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచిన సర్కార్ అసెంబ్లీ రద్దుకు ఒక్కరోజు ముందుగానే మరో అడుగు ముందుకేసి ధూప, దీప, నైవేథ్య పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,840 దేవాలయాలకు వర్తింపు చేస్తూ జీవో జారీచేయడం విశేషం. దీంతో ఆయా ఆలయాల్లో పని చేస్తున్న వారంతా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అర్చకులకు ప్రతి నెలా రూ.6వేలు
ధూప,దీప,నైవేథ్య పథకం కింద ఎంపికైన ఆలయాల్లో పనిచేసే అర్చకులకు ప్రతినెలా ఖర్చులతోపాటు వేతనంగా రూ.6వేలను అందించనుంది. గత సమైక్యపాలనలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న దేవాలయాల్లో దూప, దీప, నైవేథ్య పథకం కింద అర్చకులకు రూ. 2500 ఇచ్చేవారు. అయితే దీన్ని స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ.6వేలకు పెంచారు. ఈ విధానం అమల్లోకి రావడంతో దేవాలయాల్లో నిత్యపూజలు చేస్తుండటంతో భక్తులకు అర్చకులు అందుబాటులో ఉంటారు.