చదువు మానేసి విద్యార్థినుల భిక్షాటన


Tue,September 11, 2018 11:16 PM

శివ్వంపేట : కొందరు తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్‌ను బుగ్గిపాలు చేస్తూ భిక్షాటన చేయిస్తున్న సంఘటన మంగళవారం డీపీవో హనోక్ కంటపడింది. వివరాలు ఇలా ఉన్నాయి... డీపీవో శివ్వంపేట ఎంపీడీవో కాసం నవీన్‌కుమార్‌తో కలిసి శభాష్‌పల్లిలో జరిగే పారిశుధ్య కార్యక్రమానికి వెళ్తున్నారు. తూప్రాన్ హైవే దాబా వద్ద ఇద్దరు చిన్నారులు భిక్షాటన చేస్తూ డీపీవో వద్దకు వచ్చి భిక్షం అడిగారు. ఎందుకు భిక్షాటన చేస్తున్నారు.. బడికి వెళ్లాలి కదా అని ఆరా తీశారు. దీంతో సద్దుల భూలక్ష్మి 8వ తరగతి, సాధన 6వ తరగతి చదువుతున్నట్లుగా తెలిసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులే భిక్షాటన చేయిస్తున్నారని చిన్నారులు తెలిపారు. వెంటనే వారిని కారులో కూర్చోబెట్టుకుని శభాష్‌పల్లి ప్రాథమిక పాఠశాలకు తీసుకెళ్లారు. విద్యార్థినుల తల్లిదండ్రులు తిరుపతమ్మ, శివరాములను పిలిపించి అవగాహన కల్పించారు. పిల్లలను చదువుమాన్పించి, భిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తర్వాత జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి (డీపీ) జ్యోతిపద్మతో డీపీవో ఫోన్‌లో మాట్లాడారు. భిక్షాటన చేస్తున్న విద్యార్థినులను జిల్లా చైల్డ్ హోంకు తరలించాలని సూచించారు. స్పందించిన అధికారి పద్మ వెంటనే మెదక్‌కు తీసుకురావాల్సిందిగా నర్సాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. డీపీవో వెంట ఎంఈవో బుచ్చానాయక్, హెచ్‌ఎం జ్యోతి, అంగన్‌వాడీ కార్యకర్త అనురాధ, పంచాయతీ కార్యదర్శి సాయిప్రసాద్ ఉన్నారు.

223
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...