నందిరంది పటాన్‌చెరు కాంగ్రెస్‌లో కల్లోలం


Tue,September 11, 2018 02:40 AM

- కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్న మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్
- ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న ఐదుగురు నాయకులు...
- ఎవరికి వారు గాంధీభవన్, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు
- గౌడ్ చేరిక వార్తలపై భగ్గుమంటున్న కాంగ్రెస్ నేతలు
- కాంగ్రెస్, టీడీపీ పొత్తులు పెట్టుకుంటే మరింత గందరగోళం

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : గ్రూపు రాజకీయాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి.. మరిన్ని తలనొప్పులు తప్పేలా లేవు..! ఉమ్మడి మెదక్‌జిల్లా పరిధిలోని కీలక నియోజకవర్గమైన పటాన్‌చెరులో ఇప్పటికే శశికళ, గోదావరి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్, శంకర్‌యాదవ్‌లు టికెట్ ఆశిస్తుండగా.. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సైతం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు..! టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నచందంగా టికెట్ కోసం గాంధీభవన్, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశావహులు గౌడ్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టికెట్ ఆశించి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఇదిలాఉండగా టీడీపీతో పొత్తు పెట్టుకోనుండడం మరిన్ని గందరగోళ పరిస్థితులకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో ఏం చేయాలో.. ఎవరికి మద్దతివ్వాలో.. తెలియక పార్టీ నాయకులు, కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు. గ్రూపు రాజకీయాలు, పొత్తుల్లో పడి కొట్టుకోవడం కన్నా టీఆర్‌ఎస్ పార్టీలో చేరడమే మేలని భావిస్తున్నారు..

ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం వల్లే మేము కాంగ్రెస్‌లో చేరాం. ఆయన కాంగ్రెస్‌కు ఒరగబెట్టిందేమి లేదు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను నాశనం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తిరిగి టికెట్ ఆశిస్తూ పార్టీలోకి వస్తే ఊరుకుంటామా..? అధిష్ఠానం ఆ నిర్ణయం ఏలా తీసుకుంటుంది..? టికెట్ ఆశించకుండా కార్యకర్తలా పార్టీలో పనిచేయడానికి వస్తే ఓకే. అంతకు మించి తనకే టికెట్ వచ్చిందని, అధిష్ఠానం ఓకే చేసిందని తప్పుడు ప్రచారం చేసుకుంటున్న పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌పై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో వస్తే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నేతల మధ్య భగ్గుమంటున్న విభేదాలతో పటాన్‌చెరు కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏం జరుగనున్నదనే ఉత్కంఠ నెలకొన్నది. కాగా మరో వైపు కాంగ్రెస్, టీడీపీలు పొత్తులు పెట్టుకోనున్నాయనే ప్రచారంతో ఇరు పార్టీల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

గౌడ్ కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధం...
పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ తిరిగి కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 2014లో గౌడ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆ తర్వాత గజ్వేల్ ఎమ్మెల్యేగా మెదక్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించినా ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి సునీతా లకా్ష్మరెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో నందీశ్వర్‌గౌడ్ తన ఓటమికి కుట్రలు చేశారని అప్పట్లో సునీతారెడ్డి ఆరోపణలు చేశారు. ఈ అంశం పార్టీలో తీవ్ర కలకలం సృష్టించింది.

ఇక అప్పటి నుంచి నందీశ్వర్‌గౌడ్ కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరమయ్యాయి. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం నందీశ్వర్‌గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరగుతున్నది.

గౌడ్ పార్టీ మారడంతోనే...
కాంగ్రెస్‌లోకి పలువురు నేతలు...
అయితే నందీశ్వర్‌గౌడ్ బీజేపీలో చేరడంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. చేరిన వారిలో టీడీపీకి చెందిన అమీన్‌పూర్ మాజీ సర్పంచ్, పాత మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శశికల యాదవరెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారు. అలాగే బీజీపీలో చాలా కాలం పనిచేసిన గోదావరి అంజిరెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో గోదావరి భర్త అంజిరెడ్డి పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అంతకు ముందే పటాన్‌చెరు నియోజకవర్గంలో అమీన్‌పూర్ మాజీ సర్పంచ్ కాటా శ్రీనివాస్‌గౌడ్, జిన్నారం జెడ్పీటీసీ కుంచాల ప్రభాకర్, పటాన్‌చెరు కార్పొరేటర్ శంకర్‌యాదవ్‌లు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వీరికి తోడు కొత్త వారు రావడంతో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. శశికల, గోదావరి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్, శంకర్‌యాదవ్ అందరూ కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్నవారే కావడం విశేషం. ప్రస్తుతం వీరంతా గాంధీభవన్ చుట్టూ, ఢిల్లీ నేతల వద్ద టికెట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.

అధిష్ఠానం ఎలా టికెట్ ఇస్తుంది..?
తను పార్టీలో చేరుతున్నట్లు టికెట్ తనకే ఇస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ చేస్తున్న ప్రచారంపై ప్రస్తుతం టికెట్లు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో అందరూ ఏకమై గౌడ్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గౌడ్ ఓ కార్యకర్తలా వచ్చి పనిచేస్తామంటే ఒప్పుకుంటామని, టికెట్ ఒప్పందంతో పార్టీలోకి వస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. నేరుగా మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ నాయకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

టీఆర్‌ఎస్‌లో చేరడమే ఉత్తమం...
కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న గొడవలతో స్థానికంగా పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగానే మరో వైపు కాంగ్రెస్, టీడీపీలు పొత్తులు పెట్టుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలా పొత్తులు ఉంటే టీడీపీ నుంచి పటాన్‌చెరు జెడ్పీటీసీ శ్రీకాంత్‌రెడ్డి రేసులో ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పొత్తుల వార్తలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నారు. అధికార టీఆర్‌ఎస్ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికే టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. పార్టీ కూడా నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఎదిగింది. 100శాతం గూడెం మహిపాల్‌రెడ్డి తిరిగి విజయం సాధించనున్న నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలో ఉండి ప్రయోజనం లేదని ఆ పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ రెండు పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నాయకులు, కార్యకర్తలు మహిపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారిందని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

230
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...