గులాబీ జోష్


Sun,September 9, 2018 12:31 AM

దుబ్బాక టౌన్ : నాలుగేండ్లలో నియోజకవర్గంలో ప్రజల మధ్య ఎమ్మెల్యేగా ఉంటూ చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని దుబ్బాక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక పట్టణంలో వేలాది మంది టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలో ఎన్నికల వాహనంపై ప్రచారం నిర్వహిస్తూ తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నాలుగేండ్లలో మీరు ఆశించినా స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం ఇస్తే దుబ్బాక నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల సహకారంతో చేసుకుంటున్నామని పేర్కొన్నారు. దుబ్బాక ప్రాంతానికి సీఎం కేసీఆర్ ఇంటి మనిషిలాంటి వారని కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపారన్నారు.

ఉద్యమంలో లేనివారు ఓట్లు అడుగడం సిగ్గు చేటు..
తెలంగాణ ఉద్యమంలో లేని కొందరు నేడు ఓట్లు అడుగడం సిగ్గుచేటని సోలిపేట రామలింగారెడ్డి అన్నారు.
జీతగాడిలా పని చేస్తా...
నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి తాను పెద్ద జీతగాడిలా పని చేస్తానని సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు తనను మరోసారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నియమించడం జరిగిందన్నారు. దుబ్బాక నియోజకవర్గ కార్యకర్తల అభ్యర్థనలకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ గౌరవంతో తనకు టికెట్ కేటాయించారని అందుకు తగ్గట్టుగానే గౌరవ మర్యాదలు కాపాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని సోలిపేట హామీనిచ్చారు. కార్యక్రమంలో దుబ్బాక, మిరుదొడ్డి ఎంపీపీలు ర్యాకం పద్మాశ్రీరాములు, పంజాల కవితాశ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రొట్టె రాజమౌళి, స్థానిక నాయకులు ఎల్లారెడ్డి, శ్రీరాం రవీందర్, కోమటిరెడ్డి సంజీవరెడ్డి, అమ్మన రవీందర్‌రెడ్డి, వంగబాల్‌రెడ్డి, ఆసస్వామి, తౌడ శ్రీనివాస్, కొట్టె ఇందిర, భాగ్యలక్ష్మి, రొట్టె రమేశ్, పర్స కృష్ణలతో పాటు నియోజకవర్గంలోని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

3 వేల బైక్‌లతో భారీ బైక్ ర్యాలీ
మిరుదొడ్డి : ఆశీర్వదించండి.. దుబ్బాక నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అక్బర్‌పేట గ్రామానికి సోలిపేట రామలింగారెడ్డి రావడంతో టీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కూడవెళ్లిలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్బర్‌పేట చౌరస్తాలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అక్బర్‌పేట మీదుగా నియోజకవర్గం కేంద్రం దుబ్బాక వరకు మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక మండలాల ఆయా గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలతో 3 వేల బైక్‌లతో భారీ ర్యాలీని పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు అమవీరుల స్తూపం వద్ద సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నుంచి మళ్లీ టికెట్ రావడం నియోజకవవర్గ ప్రజల కృషి ఫలితమేనన్నారు. ప్రజల అశీస్సులతో గెలుపొందిన తర్వాత ఆయా గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మిరుదొడ్డి, దుబ్బాక ఎంపీపీలు పంజాల శ్రీనివాస్‌గౌడ్, ర్యాకం పద్మా శ్రీరాములు, మిరుదొడ్డి వైస్ ఎంపీపీ తుమ్మల బాల్‌రాజ్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

217
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...