తొలి ఆశీర్వాద సభ సూపర్ సక్సెస్


Sat,September 8, 2018 12:13 AM

-నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రజలు
-ఫలించిన మంత్రి హరీశ్‌రావు వ్యూహం
-అంచనాలకు మించి తరలివచ్చిన జనం
-సభా ప్రాంగణం నిండటంతో రోడ్లపైనే సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని విన్న ప్రజలు
సిద్దిపేట, కరీంనగర్ ప్రతినిధులు, నమస్తే తెలంగాణ: కొత్తకొండ ఈరన్న కొలువు దీరిన నేల హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్ నిర్వహించిన సభ సూపర్ సక్సెస్ అయింది. శాసనసభ రద్దు చేసిన తర్వాత మొట్టమొదటి సభ పవిత్రమైన శ్రావణ శుక్రవారం హుస్నాబాద్‌లో నిర్వహించారు. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మీ అందరి ఆశీర్వచనం కోరుతూ మీ ముందు మరొకసారి అభ్యర్థిగా ఉన్న నా తమ్ముడు, యువనాయకుడు సతీశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ నిర్వహించిన మొదటి ఎన్నికల సభ సక్సెస్ కావడంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తున్నది. సభను సక్సెస్ చేయడం కోసం రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రత్యేక చొరవ తీసుకొని మూడు రోజుల్లోనే సభను గ్రాండ్ సక్సెస్ చేశారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక వ్యూహంపన్ని మూడురోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహింపజేశారు. ఆయా మండలాల్లో ప్రత్యేక ఇన్‌చార్జిలను నియమించారు. మండలానికొక ఎమ్మెల్యేను ఇన్‌చార్జిగా వేసి ఆయా గ్రామాల నుంచి జనసమీకరణ చేయించడంలో సక్సెస్ అయ్యారు. ఆశీర్వాద సభ విజయవంతానికి అన్నీ తానై చూసుకున్న మంత్రి హరీశ్‌రావుతో పాటు మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి,

నారదాసు లక్ష్మణ్, కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ మూడు రోజుల పాటు ఆయా గ్రామాల్లో విసృత్తంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల తొలి సభ కావడంతో ప్రత్యేక దృష్టి సారించి సభను విజయవంతం చేశారు. గత సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ప్రచారాన్ని నిర్వహించి టీఆర్‌ఎస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ మూడురోజుల పాటు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. మండలాలు, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలు, ప్రజలను సమీకరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిపొందిన వివిధ కుల సంఘాలు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చారు. పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ఆ వర్గం వారు వారి సంప్రదాయ వేషధారణలో సభకు తరలివచ్చారు. గొల్ల, కురుమలు, గౌడ కులస్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సభకు తరలివచ్చి నిండు మనసుతో సీఎం కేసీఆర్‌ను దీవించారు. ఇక్కడి ప్రాంతానికి లక్షా65వేల ఎకరాల సాగునీరును గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ ద్వారా అందించి ఈ ప్రాంతాన్ని పచ్చగా చేస్తాననడంతో ప్రజలు హర్షధ్వానాలు చేశారు.

అన్నీ తానై చూసుకున్న మంత్రి హరీశ్‌రావు...
హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయడం కోసం రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండి సభను సక్సెస్ చేయించారు. హుస్నాబాద్ పట్టణంలో ఎటు చూసినా గులాబీ జెండాలతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి మరోసారి సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం కేసీఆర్ సభాస్థలికి వచ్చే సరికి సభాప్రాంగణం నిండిపోవడంతో చాలా మంది రోడ్లపైనే నిల్చొని సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. సభ విజయవంతం కావడంతో మంత్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సభ విజయవంతం చేయడంలో చురుకుగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు స్వచ్ఛందంగా తరలివచ్చిన వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

204
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...