నీలివిప్లవ లక్ష్యాలు సాధించాలి

Fri,December 13, 2019 11:33 PM

కూసుమంచి: దేశంలో నీలివిప్లవ లక్ష్యాలు సాధించడానికి మత్స్యరంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు జాతీయ మత్స్య అభివృద్ధి మండలి కన్సల్టెంట్‌ నందన్‌కుమార్‌ అన్నారు. పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో ఎనిమిది రాష్ర్టాలకు చెందిన 35 మంది ప్రతినిధులకు జరుగుతున్న నెలరోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. దేశంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా చేపలు, రొయ్యలను ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వాలు మత్స్యకారులకు అనేక ప్రోత్సహాకాలు, సాంకేతిక నైపుణ్యం అందిస్తున్నాయని గుర్తు చేశారు.

ఆక్వావన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తిగల వారు పూర్తి ప్రాజెక్టు నివేదికను తమ సంస్థకు సమర్పిస్తే 40 శాతం సబ్సిడీతో రూ.25 లక్షల వరకు రుణాలు అందిస్తామని వివరించారు. ఔత్సాహికులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మత్స్యరైతులకు సేవలందించడంతో పాటు, ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. మరో కన్సల్టెంట్‌ కిరణ్‌ మాట్లాడుతూ... చేపలకంటే రొయ్యల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుందన్నారు. దీని కోసం చెరువుల్లో బయోప్లాక్‌ విధానంతో ఉపయోగకరమని సూక్ష్మజీవులు, చేపల మేత ఉత్పత్తి చేయడం ద్వారా నీటిశుద్ధితో పాటు, మేత ఖర్చు తగ్గుతందని వివరించారు. ఏపీలోని నియోస్పార్క్‌ టెక్నికల్‌ మేనేజర్‌ సీహెచ్‌. దినేశ్‌ మాట్లాడుతూ... చేపలు, రొయ్యల సాగులో మెళకువలను వివరించారు. రొయ్యల చెరువుల్లో ఉదజని 8.2 మించితే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఎకరం నీటిలో 15 నుంచి 20 కిలోల జిప్పం వాడితే ఫలితం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలేరు ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌, ఆర్‌.ప్రవీణ్‌, శాస్త్రవేత్తలు జీ.విద్యాసాగర్‌రెడ్డి, పీ.శాంతన్న తదితరులు ప్రసంగించారు.

204
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles