సమన్వయంతో ముందుకెళ్తా..

Fri,December 13, 2019 12:27 AM

-ప్రజా పోలీసింగే నా కర్తవ్యం..
-ప్రజల భద్రత, రక్షణే ధ్యేయంగా పోలీసుల పనితీరు
-పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా
-‘నమస్తే తెలంగాణ’తో నగర ఏసీపీ ప్రతాపనేని వెంకటగణేష్‌

(ఖమ్మం క్రైం)ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ, సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులను సమన్వయం చేసుకుంటూ, పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకు సాగడుతానని అన్నారు నగర ఏసీపీ ప్రతాపనేని వెంకట గణేశ్‌. ప్రజా పోలీసొంగే తన కర్తవ్యమని స్పష్టం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారికి స్నేహపూరిత వాతావరణాన్ని కల్పిస్తామని, అసాంఘిక శక్తుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉంటామని అన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై అనుక్షణం నిఘా పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా యువతకు అవగాహన కల్పిస్తామని అన్నారు. వారికి గ్రామీణ క్రీడలు నిర్వహించి వారి బంగారు భవిష్యత్తును నిర్మించుకునే వాతావరణం కలిస్తామని అన్నారు. నగరంలో ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపైనా, నకిలీ వ్యాపారం చేసే వారిపైనా ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. గుట్కా, గంజాయి లాంటి మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఖమ్మం నగర అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన.. 1989 ఎస్సై బ్యాచ్‌కు చెందిన వారు. ఇంతకుమునుపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్సైగా, సీఐగా విధులు నిర్వర్తించారు. ఇక్కడ పనిచేసిన కాలంలో తనదైన శైలిలో శాంతి భద్రతలను పర్యవేక్షించి ఉన్నతాధికారుల మన్ననలను పొందారు. ఖమ్మం నగరంపై పూర్తి పట్టున్న సమర్థవంతమైన అధికారిగా గణేశ్‌ గతంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. నగర ఏసీపీగా మరోసారి బాధ్యతలు చేపట్టిన గణేష్‌తో ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేక ఇంటర్వ్యూ.

నమస్తే తెలంగాణ: మీ కుటుంబ నేపథ్యం?
ఏసీపీ గణేశ్‌: మాది వరంగల్‌ జిల్లా. వరంగల్‌ నగరంలో చదువు కొనసాగింది. అమ్మ రిటైర్ట్‌ టీచర్‌, నాన్న ప్రొఫెసర్‌. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికాలో జాబ్‌ హోల్డర్‌. చిన్న కుమారుడు ఏలూరులో సివిల్‌ సర్జన్‌.

నమస్తే: మీ ప్రాధాన్య అంశాలేమిటి?
ఏసీపీ: రోజుకు 24 గంటలూ, వారానికి ఏడు రోజులూ ప్రజలకు అందుబాటులో ఉంటాను. పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌గా ముందుకు సాగుతా. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వారి పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకుంటా. ఫిర్యాదుదారుడు స్టేషన్‌కు వచ్చినప్పుడు అతని సమస్యను సిబ్బంది నేరుగా తెలుసుకుని ఫిర్యాదుపత్రం వారితో రాయించాలి. అంతేతప్ప ‘ఫిర్యాదు ఇవ్వండి’ అని సిబ్బంది చేతులు దులుపుకోకూడదు. ఫిర్యాదును తీసుకున్న అనంతరం అలసత్వం లేకుండా ఆ ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి నిజాయితీతో సమస్యను పరిష్కరించే విధంగా పోలీసులను సమాయత్తం చేస్తా. తొలుత పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తా.

నమస్తే: శాంతిభద్రతల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటారు?
ఏసీపీ: సబ్‌ డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపడుతా. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకుంటా. పగలు, రాత్రి బీట్‌ డ్యూటీలు వేస్తూ సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించేలా చూస్తా. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతాం. నేరాలు, ఘర్షణలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటాం. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచుతా. భూ సంబంధ వివాదాలలో రెవెన్యూ రికార్డులు, కోర్టు ఉత్తర్వుల మేరకు ముందుకెళ్తాం. రౌడీషీటర్లు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే సెక్యూరిటీ సెక్షన్ల ప్రకారం తక్షణ చర్యలు తీసుకుంటా.

నమస్తే: నకిలీలు, కల్తీ వ్యాపారాలపై ఎలాంటి చర్యలుంటాయి?
ఏసీపీ: ఆహార పదార్థాలు, విత్తనాలు కల్తీ చేసే వారిపైనా, నకిలీలు పదార్థాలు తయారు చేసే వారిపైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. వీటిపై ఇప్పటికే సీపీ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తోంది. నగరంలో గుట్కా, గంజాయి, పేకాట తదితరాలపై ఉక్కుపాదం మోపుతాం. ఇక నిరంతరంగా పోలీసుల నాకాబందీ ఉంటుంది. ఖమ్మానికి వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం.

నమస్తే: యువతకు మీరితచ్చే సందేశం?
ఏసీపీ: యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రభుత్వం విడుదల చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లను యువత సద్వినియోగం చేసుకొని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. యువకులు నిత్యం క్రీడలు ఆడుతూ, వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉండాలి. దాంతో శారీరక ధృఢత్వంతోపాటు మానసిక పరిపక్వత కూడా పెరుగుతుంది. సరైన మార్గంలో నడిచే ఆలోచనలు వస్తాయి. షటిల్‌ తదితర క్రీడలను గ్రామాల్లో, నగర శివారుల్లో నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందిస్తా.

224
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles