భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్‌ త్వరితగతిన పూర్తి చేయండి...

Thu,December 12, 2019 12:56 AM

మామిళ్లగూడెం, డిసెంబర్‌ 11: భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైన్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ నివాసంలో కలిసి వినతిపత్రం అదించారు. 2011లో సింగరేణి, రైల్వే శాఖ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలై 90:10 నిష్పత్తిలో సింగరేణి-రైల్వే శాఖ వారితో పనులు ప్రారంభమైయ్యాని తెలిపారు. ఈ రైల్వే లైన్‌ నిర్మాణ వ్యవయం రూ.704.31 కోట్లు ఉండగా భూ సేకరణ నిమిత్తం సింగరేణి సంస్థ రూ.618.55 కోట్లు, నిర్మాణం కోసం రైల్వే వారు రూ.85.76 కోట్లు భరిస్తున్నాయని తెలిపారు. ముందుగా ఈ రైల్వే మార్గాన్ని కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 53 కిలో మీటర్ల మార్గాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తయితే సత్తుపల్లి గనుల నుంచి బొగ్గు రవాణా సురక్షితంగా పర్యావరణ హితంగా జరుగుతుందని వివరించారు. ఈ రైల్వే లైన్‌ నిర్మాణ క్రమంలో అవసరమైన బ్రిడ్జిలు, రహదారుల మల్లింపు, విద్యుత్తులైన్‌, పైపులైన్‌ తరలింపు వంటి పనులకు రూ.1000 కోట్లు అవసరం ఉందని దీనిలో సింగరేణి సంస్థ రూ.865 కోట్లు, రైల్వే రూ.135 కోట్లు భరించాల్సి ఉండగా ప్రస్తుతం ఉన్న బొగ్గు ధర కారణంగా పెరిగిన ఈ ప్రాజెక్టు ఖర్చు పెంచడానికి సింగరేణి అంగీకరించడం లేదని తెలిసిందన్నారు. దీంతో రైల్వే శాఖ పనులు నిలిపివేశారని వివరించారు.

ఇప్పటికే రైల్వే శాఖ వారు పూర్తి భూమిని స్వాధీనం చేసుకున్నారని దీనికి అవసరమైన ఒప్పందాలు ఖరారు చేయడంతో పాటు రూ.300 కోట్లు ఖర్చు చేసి ఈఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారని గుర్తు చేశారు. త్వరలో యాదాద్రి ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ 4000 మెగావాట్లు రానున్న రెండు సంవత్సరాలలో అందుబాటులోకి రానున్నదని దీనికి బొగ్గు రవాణాకు ప్రధాన ఆధారం కాబట్టి దీని ద్వారా రైల్వేకు అదనంగా ఆదాయం చేకూరుతుందని నామా రైల్వే బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖలో వివరించారు. కొవ్వూరు రైల్వే లైన్‌ విస్తరిస్తే విజయవాడ, విశాఖపట్టణంకు తక్కువ మార్గం కావడంతో పాటు హైదారాబాద్‌కు 50కిలో మీటర్లు దూరం తగ్గుతుందన్నారు. కొండపల్లి నుంచి భద్రాచలం వరకు రైల్వే లైను విస్తరించడం వల్ల రామాలయంకు వస్తున్న భక్తులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. రైల్వే వారి ప్రయోజనాలు, ప్రజల అవసరాలు, సౌలభ్యం పరిగణలోకి తీసుకుని అవసరమై చర్యలు తీసుకోని భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్‌ పనులు పూర్తి చేయాలని బోర్డు చైర్మన్‌కు నామా లేఖను అందించి పరిస్థితిని వివరించారు.

227
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles