పోటెత్తిన పత్తి..

Thu,December 5, 2019 11:43 PM

-మార్కెట్‌కు ఒకేరోజు 17వేల బస్తాలు రాక
-నిండిన మార్కెట్‌ యార్డులు
-క్వింటాకు గరిష్ఠ ధర రూ. 4950

ఖమ్మం వ్యవసాయం: ఉష్ణోగ్రతలలో మార్పు రావడం, పంట చేతికి వచ్చే సమయం కావడంతో మార్కెట్‌కు పంటల తాకిడి పెరుగుతున్నది. ప్రస్తుతం పత్తి పంట సీజన్‌ నెల రోజుల నుంచి ప్రారంభమైంది. దీంతో పాటు మిర్చి పంట సైతం రావడం ప్రారంభమైంది. గురువారం ఒక్కరోజే పత్తియార్డుకు 17వేల బస్తాలు, మిర్చి యార్డుకు మరో 2వేల బస్తాలు వచ్చాయి. దీంతో రెండు యార్డులలో సందడి నెలకొన్నది. కొద్దిరోజులుగా స్తబ్ధతగా ఉన్న మిర్చియార్డులో సైతం క్రయవిక్రయాలు జరుగడంతో అటు అన్నదాతలు, అడ్తీ వ్యాపారులు, ఖరీదుదారులతో యార్డు కిటకిటలాడింది. ఉదయం యార్డులో జరిగిన జెండాపాటలో కొత్త రకం పంటకు క్వింటా ఒక్కంటికి రూ 17,200 ధర పలికింది. అదేవిధంగా ఏసీ రకం పంటకు క్వింటాకు ఒక్కంటికి గరిష్ట ధర రూ.18,300 పలుకడం విశేషం. పత్తి పంటకు ఆన్‌లైన్‌ బిడ్డిండ్‌లో ఖరీదుదారులు గరిష్ట ధర రూ4,950 నిర్ణయించి కొనుగోళ్లు చేశారు. మార్కెట్‌ భారీగా పంట వచ్చిన విషయం తెలుసుకున్న మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ వైస్‌చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, డీఎంవో సంతోశ్‌కుమార్‌తో కలిసి పర్యవేక్షణ చేశారు.

యార్డుకు వచ్చిన పంట ఉత్పత్తులను పరిశీలన చేసి బిడ్డింగ్‌ సరళిపై ఆరా తీశారు. అనంతరం పంటను తీసుకువచ్చిన రైతులతో మాట్లాడారు. కొందరు రైతులు తమకు గిట్టుబాటు ధర రాలేదని తిరిగి పంటను తీసుకువేళ్లేందుకు అనుమతి కావాలని కోరడంతో స్వయంగా పర్యవేక్షకులతో వివరాలు తెలుసుకొని పత్తి ఖరీదుదారులతో మాట్లాడారు. తిరిగి సదరు రైతులకు మరింత ధర పెట్టి కొనుగోలు చేసే విధంగా చొరవ తీసుకోవడంతో సదరు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌కు నాణ్యమైన పంట వస్తున్నందున ఖరీదుదారులు రైతులకు మంచి ధర అందించాలని చైర్మన్‌ సూచించారు. గేట్‌ ఎంట్రీలు, కాంటాలు, తోలకాల ప్రక్రియ సకాలంలో ముగియడంతో పంటను తీసుకువచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్‌-టూ అధికారి బజార్‌, అసిస్టెంట్‌ కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డితో పాటు పలువురు సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

308
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles