రేపు లేక్‌వ్యూక్లబ్‌లో ‘వెంకీమామ’

Thu,December 5, 2019 11:40 PM

ఖమ్మం కల్చరల్‌ : చిత్ర పరిశ్రమలో ఖమ్మం కీలకమవుతోంది.. ఖమ్మం నగరం, జిల్లా పరిసరాల్లో పలు సినిమాల చిత్రీకరణతో పాటు, ఇక్కడ నుంచి దర్శకులుగా, నిర్మాతలుగా, నటులుగా ఎందరో ఎదుగుతున్నారు. దీనికి తోడు పలు సినిమాల సక్సెస్‌ మీట్‌లు, టీజర్లు ఖమ్మంలో నిర్వహించడం, ఖమ్మంకు చెందిన నిర్మాత, శ్రేయాస్‌ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్‌ అనేక చిత్రాలకు ఆడియో, ప్రీరిలీజ్‌ ఈవెంట్లను నిర్వహించడంతో ఖమ్మం చిత్ర పరిశ్రమకు మరింత చేరువైంది. గతంలో నటుడు బాలకృష్ణ ‘ పైసా వసూల్‌', గోపీచంద్‌ ‘ లౌక్యం’ సినిమాల ఈవెంట్ల ఖమ్మం ఆతిథ్యమియ్యగా, సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వీటితో పాటు అగ్రతారలు తమన్నా, కాజల్‌, శృతిహాసన్‌లు పలు షోరూంల ప్రారంభోత్సవాలకు విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మంకు తొలిసారి మల్టీస్టార్స్‌ ఒకే వేదికపై కనుల విందు చేయనున్నారు. ఈ మేరకు గురువారం లేక్‌వ్యూ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈవెంట్‌ వివరాలను శ్రేయాస్‌ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్‌, లేక్‌వ్యూ క్లబ్‌ అధ్యక్షుడు దొడ్డా రవి తెలిపారు. వెయ్యికి పైగా సినిమా ఈవెంట్స్‌ను విజయవంతంగా నిర్వహించిన దక్షిణ భారతదేశంలోనే నెంబర్‌ వన్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ శ్రేయాస్‌ మీడియా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్‌ నిర్వహించబడుతుందని తెలిపారు. మెట్రోపాలిటన్‌ నగరాలకు దీటుగా పర్యాటక రంగాన్ని తలదన్నేలా ఖమ్మం నగర నడిబొడ్డున్న ఉన్న లేక్‌వ్యూ క్లబ్‌ (పాత సీక్వెల్‌ రిసార్ట్స్‌)కు ‘వెంకీమామ’ చిత్ర యూనిట్‌ రానుందని తెలిపారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న
‘వెంకీమామ’ సాయంత్రం 6 గంటలకు లేక్‌వ్యూ క్లబ్‌లో వెంకీమామ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అట్టహాసంగా నిర్వహించబడుతుందన్నారు.

ఈ చిత్ర హీరోలు విక్టరీ వెంకటేశ్‌, నాగచైతన్య, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత సురేశ్‌బాబు, దర్శకుడు బాబీ, హాస్యనటుడు హైపర్‌ ఆది రానున్నారని తెలిపారు. ‘పవర్‌, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, జై లవకుశ’ వంటి హిట్‌ చిత్రాల దర్శకుడు కే.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఈ సినిమా చిత్రీకరించబడిందన్నారు. బిగ్‌ బాస్‌ రన్నరప్‌ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈవెంట్‌ తిలకించడానికి శ్రేయాస్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పాసులు పొందాలని, ఆఫ్‌లైన్‌ పాసులు కూడా క్లబ్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. సంక్రాంతి పండుగకు నెల ముందే రానుండటంతో అభిమానులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. క్లబ్‌లో సర్వాంగ సుందరంగా వేదికను, అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సైదాబాబు, నల్లి శ్యామ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

303
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles