కొనుగోళ్లకు ప్రాధాన్యం

Wed,November 6, 2019 01:52 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : ధాన్యం దిగుబడులు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి.. ఇందుకు అనుగుణంగా పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటూ గింజగింజకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతన్నలకు చేదోడుగా నిలుస్తోంది. గతంలో వ్యవసాయం దండుగ అనుకున్న తరుణంలో తెలంగాణ హయాంలో వ్యవసాయం పండుగలా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడంతో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. గత నాలుగేళ్ల నుంచి ఏడాదికేడాది సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు ధాన్యం కొనుగోళ్లు కూడా భారీగానే పెరిగాయి. ఇందుకు అనుగుణంగా పౌరసరఫరాల శాఖ ప్రతీఏటా రైతుల పంట దళారుల పాలు కాకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో కొనుగోలు సొమ్మును బ్యాంకు ఖాతాల్లో వేయడంతో రైతులకు విక్రయాలు సులువయ్యాయి. అదే తరుణంలో రైతులకు మద్దతు ధరను కూడా పెంచడంతో రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయాలు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా గతంలో మాదిరిగానే జిల్లాలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని జాయింట్‌ కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్‌ శాఖ అధికారులతో మద్దతు ధర పోస్టర్‌ను ఆవిష్కరించి రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

ఏటేటా ధాన్యం కొనుగోలులో ముందడుగు
ప్రతీఏటా ధాన్యం కొనుగోలు విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. రైతులకు మద్దతు ధర ప్రకటించడంతో మార్కెటింగ్‌ శాఖ అన్ని సౌకర్యాలు కల్పిస్తుండటంతో కొనుగోలు కేంద్రాలకే ధాన్యం చేరుతోంది. 2016-17 సంవత్సరంలో 52 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా రూ.100 కోట్ల సొమ్మును రైతుల ఖాతాలో జమ చేశారు. 2017-18లో 82 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా రూ.135 కోట్లు, 2018-19లో 1.70 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసి రూ.300 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2019-20 సంవత్సరానికి గాను నిర్దేశించిన లక్ష్యం 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అంచనాలు సిద్ధం చేశారు.

జిల్లాలో పెరిగిన వరిసాగు..
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో వరిసాగు విస్తీర్ణం పెరిగింది. 43,334 హెక్టార్లలో సాధారణ విస్తీర్ణం ఉండగా 52,083 హెక్టార్లలో రైతులు వరి పంటను సాగు చేయగా, ఈ ఏడాది 120 శాతం విస్తీర్ణం పెరిగింది. దీంతో దిగుబడి కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం లక్ష్యానికి మించి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీంతో గత ఏడాది 1.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా రూ.300 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ ఏడాది 2.20 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి రూ.400 కోట్లకు పైగా సొమ్ములు చెల్లించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా పెరిగిందని అధికారులు చెప్తున్నారు. దానికి తోడు ధాన్యం మద్దతు ధర కూడా పెరిగినందున రైతులు ఎక్కువ శాతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే విక్రయాలు జరిపేందుకు రైతులు అసక్తి చూపుతున్నారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.

జిల్లాలో 95 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు..
గత ఏడాది 124 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన అధికారులు ఈ సారి 95 కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ముందస్తుగా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నెల రెండవ వారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. జిల్లాలోని చర్ల, చండ్రుగొండ మండలాల్లో ముందుగా ధాన్యం కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండటంతో ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ముందస్తు కార్యాచరణ చేపట్టింది. జీసీసీ, ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా మొత్తం 95 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు చేయనున్నారు.

ఏడాదికేడాది పెరుగుతున్న గిట్టుబాటు ధర
జిల్లాలో రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఏడాదికేడాది మద్దతు ధరను పెంచుకుంటూ వస్తోంది. 2017-18 సంవత్సరంలో ఏ1 గ్రేడ్‌ రకం రూ.1570 ఉండగా, 2018-19 సంవత్సరంలో ఏ1 గ్రేడ్‌ రకం రూ.1770కు పెంచింది. ఈ ఏడాది 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏగ్రేడ్‌ రకాన్ని క్వింటాకు రూ.1835కు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీంతో రైతన్నలకు ప్రతీ ఏటా దళారుల బెడద నుంచి విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం గిట్టుబాటు ధరను పెంచుతోంది. దీంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే విక్రయాలు చేస్తున్నారు. 24గంటల్లోనే రైతుల ఖాతాల్లో విక్రయించిన ధాన్యం సొమ్మును జయచేయడంతో రైతులు దళారులను ఆశ్రయించడం లేదు. తేమ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కొనుగోళ్లు చేయనున్నారు.

ఈ నెల రెండోవారంలో కేంద్రాలు ప్రారంభం
- టీఎన్‌ఎస్‌ ప్రసాద్‌, సివిల్‌ సైప్లె డీఎం
ఈ నెల రెండవ వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నాం. ముందుగానే చెరువులు, ప్రాజెక్టుల కింద వేసిన రైతుల వరి పంట కోతకొచ్చింది. చర్ల, చండ్రుగొండ మండలాల్లో రైతులు పంట కోతకు రావడంతో కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సరిపడా బస్తాలను కూడా సిద్ధం చేశాం. ఈ ఏడాది లక్ష్యానికి మించి ఎక్కువగా రైతులు వరి సాగు చేయడం, ఆశించిన విధంగా వర్షాలు కురియడంతో సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడి కూడా అధికంగా పెరిగే అవకాశం ఉంది. మొత్తం 95 కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నాం. మద్దతు ధరను కూడా ప్రకటించడంతో రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కేంద్రాలకు వచ్చి విక్రయాలు చేసుకునేలా వెసలుబాటును కల్పించాం. విక్రయించిన రైతులకు వెంటనే వారి ఖాతాల్లో నగదును జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

181
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles