పిడుగుపాటుతో దంపతులు మృతి..

Sun,November 3, 2019 03:21 AM

-కిష్టాపురంలో ఘటన..
-అల్పపీడన ప్రభావంతో పలు మండలాల్లో భారీ వర్షం..
-నేలవాలిన వరి, మిరప పంటలు..

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురంలో శనివారం సాయంత్రం పొలం వద్ద పిడుగు పడి దంపతులు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి రైతు దంపతులు గుండెల ఉపేందర్ (38), ఈశ్వరమ్మ (32)లు సమీపంలోని తమ పొలం వద్దకు వెళ్లారు. పొలంలో పనిపూర్తి చేసుకుని ఇంటికి బయల్దేరుతుండగా, ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు వచ్చాయి. వర్షం ప్రారంభం కావడంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. వర్షం ఉధృతంగా కురుస్తుండగానే పిడుగు పడి, ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. సుమారు గంటపాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురువడంతో ఆ పరిసరాలకు ఎవ్వరూ వెళ్లలేదు. సాయంత్రం ఆరుగంటల తర్వాత పరిసర ప్రాంతాల రైతులు మృతదేహాలను గుర్తించి, గ్రామస్తులకు సమాచారం అందించారు.

అలుముకున్న విషాదఛాయలు
గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే గుండెల ఉపేందర్ దంపతుల మృతితో కిష్టాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తనకున్న నాలుగు ఎకరాల భూమి ని సాగుచేసుకుంటూ జీవిస్తున్న దంపతుల మృతిని గ్రామస్తులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారికి కల్యాణి, శ్రావణి అనే కూతుర్లు ఉన్నారు. దంపతులు మృతితో వారి ఇద్దరు కూతుర్లు అనాథలయ్యారు. గత జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉపేందర్ వార్డు మెంబర్‌గా ఎన్నికయ్యాడు.

ఎమ్మెల్యే సంతాపం...
కిష్టాపురంలో పిడుగుపడి రైతు దంపతులు మృతిచెందడంపై పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులను అన్నివిధాల ఆదుకుంటానని హామీనిచ్చారు. వర్షాలు కురిసేటపుడు ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

214
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles