ప్రయాణికుల సేవలో..

Fri,November 1, 2019 11:46 PM

-పూర్తిస్థాయిలో రోడ్డెక్కుతున్న ఆర్టీసీ బస్సులు
-సాఫీగా, క్షేమంగా సాగుతున్న ప్రయాణాలు
-బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు
-జిల్లాలో శాంతి భద్రతలను పర్యవేక్షించిన సీపీ తఫ్సీర్ ఇక్బాల్

(ఖమ్మం కమాన్‌బజార్)జిల్లాలో ప్రజల ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. ప్రయాణికులకు ఆర్టీసీ విస్తృత సేవలు అందిస్తోంది. బస్టాండ్లలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా అధికారులు కూడా బస్సులను పెంచుతున్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో రోడ్లపై రథచక్రాలు తిరుగుతూ ప్రజలకు భరోసాన్ని కల్పించాయి. గ్రామాల్లో ప్రజలకు, ప్రయాణికులకు ఆత్మవిశ్వాసం కల్పిస్తూ వారివారి గమ్యస్థానాలకు చేరవేస్తూ వారి ఆదరాభిమానాలు పొందుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె శక్రవారం నాటిలో 28వ రోజుకు చేరుకుంది. అయినా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలు సఫలం అయ్యాయి. ఖమ్మం ఆర్టీసీ డివిజన్ పరిధి అయిన ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోల్లో ఆర్టీసీ బస్సులను, అద్దె బస్సులను, ప్రైవేట్ బస్సులను విరివిగా తిప్పారు. ఆర్టీసీలో రాత్రి 12 గంటల నుంచి మొదలయ్యే షెడ్యూల్ ప్రకారంగానే తాత్కాలిక సిబ్బంది సహాయంతో జిల్లాలో బస్సులు నడిపారు. ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆయా డిపోల పరిధిలో ఉన్న గ్రామాలకు బస్సులను నడిపించారు. వివిధ డిపోల నుంచి హైదరాబాద్, రాజమండ్రి, భద్రాచలం, వరంగల్, శ్రీశైలం వంటి దూర ప్రాంతాలకు కూడా సర్వీసులను నడిపించారు. అర్హత కలిగిన డ్రైవర్లను దూర ప్రాంతాలకు పంపారు. జిల్లాలో ఉన్న ప్రైవేట్ బస్సులకు ప్రత్యేక పర్మిట్‌లను జారీ చేసి ప్రయాణికులు రద్దీ ఎక్కడ ఉంటే అక్క తిప్పే విధంగా రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులు, అద్దె బస్సులు, ప్రైవేట్ బస్సుల పర్యవేక్షణను డీవీఎం పరిశీలిస్తున్నారు. డిపోల్లోంచి బస్సులను ఏసీపీల సహకారంతో బయటికి పంపిస్తున్నారు. శుక్రవారం కూడా జిల్లాలో పూర్తిస్థాయిలో బస్సులు విజయవంతంగా నడిచాయి.

సాఫీగా సాగుతున్న ప్రయాణాలు
ఆర్టీసీ డివిజన్ పరిధిలో ప్రజల ప్రయాణాలు సాఫీగానే కొనసాగుతున్నాయి. ఖమ్మం డిపోలో ఆర్టీసీ బస్సులు 71, అద్దె బస్సులు 57, మధిర డిపోలో ఆర్టీసీ బస్సులు 05, అద్దె బస్సులు 02, సత్తుపల్లి డిపోలో ఆర్టీసీ బస్సులు 72, అద్దె బస్సులు 35 నడిచాయి. ప్రైవేట్ బస్సులు 29, మ్యాక్సీక్యాబ్‌లు 75 తిరిగాయి. వీటిని వివిధ బస్టాండ్‌ల నుంచి వివిధ రూట్లల్లో తిప్పారు. మొత్తం 346 వాహనాలను శుక్రవారం నడిపించారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోల నుంచి రాత్రి సమయంలో బస్సులను నడిపిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు రాత్రి వేళ్ళలో బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. దాంతో బస్టాండ్‌లో పైవేట్ బస్సులను కూడా తిప్పతున్నారు.

ఏసీపీల ఆధ్వర్యంలో పర్యవేక్షణ
ఆర్టీసీలో సమ్మె కారణంగా సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు. ఖమ్మం డిపోలో ఏసీపీల నేతృత్వంలో దఫాల వారీగా బందోబస్తును నిర్వహించారు. డీఎం, ఏసీపీల సూచనల ప్రకారం ప్రతి బస్సునూ పోలీసు ఎస్కార్ట్ వాహనం ద్వారా బస్టాండ్ వరకు పంపిస్తున్నారు. సత్తుపల్లి, మధిర డిపోల్లో కూడా డీఎస్‌పీలు బందోబస్తును నిర్వహించారు. డిపోల వద్ద 144 సెక్షన్ విధించారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఆటంకాలు కలగకుండా ఖమ్మం పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ నేతృత్వంలో అడిషన్ డీసీపీ మురళీధర్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

206
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles