పల్లె పల్లెకూ ప్రగతి చక్రం..

Fri,November 1, 2019 12:55 AM

-జిల్లాలో 80శాతం తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు
-తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ప్రజారవాణా సంపూర్ణం
-రోడ్డెక్కిన 397 ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు..
-ఖమ్మం డిపోను సందర్శించిన అడిషనల్ డీసీపీ

ఖమ్మం కమాన్‌బజార్, అక్టోబర్ 31: జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా గాడిలో పడినట్లు కనిపిస్తోంది. మారుమూల ప్రాంతాలకూ ప్రగతి చక్రాలు పరుగులు పెడుతున్నాయి. ప్రయాణికులను సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారంతో 27 రోజులకు చేరుకుంది. అయితే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు పూర్తి స్థాయిలో సఫలం అయ్యాయి. సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రజల ప్రయాణాలకు ఆటంకాలు లేవు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకొని ఆర్టీసీ బస్సులను అధికారులు పుష్కలంగా నడుపుతుండడంతో అసలు ఆర్టీసీలో సమ్మె జరుగుతోందా? అనే సందేహం సాధారణ జనాల్లోనూ, ప్రయాణికుల్లోనూ వ్యక్తమవుతోంది. అయితే ప్రయాణికులు ఏమాత్రమూ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జిల్లాలో ఆర్టీసీ సర్వీసులపై సమీక్షిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ప్రతి పల్లెకూవ వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేస్తున్నారు. అందులో భాగంగానే కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ నేతృత్వంలో ఆర్టీసీ అధికారులు జిల్లా బస్సులను పూర్తిస్థాయిలో నడిపిస్తున్నారు. గురువారం నాడు ఖమ్మం ఆర్టీసీ డిపోను అడిషనల్ డీసీపీ మురళీధర్ సందర్శించారు. డిపో వద్ద బందోబస్తు వివరాలను గురించి అక్కడ విధుల్లో ఉన్న టూటౌన్ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.

షెడ్యూల్ ప్రకారంగా తిరిగిన బస్సులు..
ఆర్టీసీలో షెడ్యూల్ ప్రకారంగా తిరిగే బస్సులలాగానే ప్రత్యామ్నాయ బస్సులు కూడా తిరిగాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ద్వారా ఆర్టీసీ, నోడల్ అధికారులు ఆర్టీసీ బస్సులను సాధారణ షెడ్యూల్ ప్రకారం బయటకు తీసి తిప్పారు. జిల్లా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఆర్టీసీ విధులకు డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులు వివిధ రూట్లల్లో బస్సులను తనిఖీలు చేస్తున్నారు. గురువారం నాడు ఖమ్మం డిపోలో ఆర్టీసీ బస్సులు 76, అద్దె బస్సులు 57, సత్తుపల్లి డిపోలో ఆర్టీసీ బస్సులు 69, అద్దె బస్సులు 35, మధిర డిపోలో ఆర్టీసీ బస్సులు 37, అద్దె బస్సులు 19 నడిచాయి. వాటితోపాటు రవాణా శాఖ ఏర్పాటు చేసిన ప్రైవేట్ బస్సులు 29, మాక్సీక్యాబ్‌లు 75 నడిచాయి. జిల్లాలో మొత్తం 397 వివిధ వాహనాలు తిరిగాయి.

బందోబస్తును పర్యవేక్షించిన సీపీ..
జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా శాంతిభద్రతలకు ఆటంకాలు కలగకుండా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ నేతృత్వంలో అడిషనల్ డీసీపీ మురళీదర్ ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోలు, బస్టాండ్‌ల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి వారికి సూచనలు చేస్తూ నిత్యం సీపీ పర్యవేక్షిస్తున్నారు.

206
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles