విహారయాత్రలో అపశ్రుతి

Mon,September 16, 2019 12:27 AM

-పాపికొండల టూర్‌లో పెను ప్రమాదం
-నీట మునిగిన పర్యాటక లాంచీ
-పలువురు మృతి, 50మందికి పైగా గల్లంతు
-ఆ తరువాత రెండో అతి పెద్ద ప్రమాదం ఇదే

భద్రాచలం, నమస్తే తెలంగాణ : పాపికొండల విహార యాత్ర విషాదభరితంగా.. అంతిమ యాత్రగా మారింది. దేవీపట్నం లాంచీ ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. 50మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో వరంగల్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. 1957లో జరిగిన పడవ ప్రమాదంలో 478మంది యాత్రికులు అప్పుడు మృతిచెందారు. ఆ తరువాత ఇదే అది పెద్ద ప్రమాదం. ఈ పెను ప్రమాదంతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కుచ్చులూరు వద్ద గండిపోచమ్మ ఆలయం నుంచి 62 మంది పర్యాటకులతో బయలుదేరిన పర్యాటక లాంచీ, నదిలో ఇదే మండలం మటూరు-కచ్చులూరు సమీపంలో నీట మునిగింది. లైఫ్ జాకెట్లు ఉండటంతో 16మంది యాత్రికులు, బోట్ సిబ్బంది ఈదూకుంటూ సమీప గ్రామ సరిహద్దుకు చేరినట్లు తెలిసింది. ముగ్గురి మృతదేహాలను వెలికితీసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. పర్యాటకులంతా ఒకేసారి బోటు ఎడమవైపు రావడం ఒరిగిపోయి మునిగిందని సమాచారం. ప్రమాద వార్త తెలియగానే ఏపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన గాలింపు చేపట్టింది.ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హెలీకాప్టర్ ద్వారా కూడా గాలింపు సాగుతోంది.

ఈ విహార యాత్రలో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామస్తులు 14మంది ఉన్నట్లు తెలిసింది. వీరి లో బసికే దశరథం (54), బసికే వెంకటస్వామి (58), దర్శనాల సురేష్ (24), గొర్రె ప్రభాకర్ (54), ఆరేపల్లి యాదగిరి (35) ఆచూకీ దొరికింది. సీవీ వెంకటస్వామి, బస్‌కే రాజేంద్రప్రసాద్, కొండేరు రాజ్‌కుమార్, బస్‌కే ధర్మరాజు, గడ్డమీది సునిల్, కొమ్ముల రవి, బస్‌కే రాజేందర్, బస్‌కే అవినాష్, గొర్రె రాజేంద్రప్రసాద్ ఆచూకీ తెలియాల్సి ఉంది. మొత్తం ఎంతమంది మృతిచెందారనేది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. రాయల్ వశిష్ట పేరుతో ఉన్న లాంచీ ఈ ప్రమాదానికి గురైందని సమాచారం. ఇటీవలి కాలం వరకు గోదావరి వరదలు వచ్చిన నేపథ్యంలో లాంచీలు తిరిగేందుకు అనుమతి లేదని తెలిసింది. ఈ లాంచీ ప్రమాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. తక్షణమే అన్ని బోట్ సర్వీస్‌లను రద్దు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించినట్లు సమాచారం.

1957లో కూడా ఇలాగే...
1957లో భారీ అతి పెద్ద ప్రమాదం జరిగింది. బూర్గంపహాడ్ నుంచి భద్రాచలానికి వెళుతున్న పడవ నీట మునిగింది. 478 మంది నీట మునిగి మృతిచెందారు. ఈ ప్రమాదం తరువాతనే... భద్రాచలం వద్ద గోదావరిపై భారీ బ్రిడ్జిని ఆనాటి నాటి జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం నిర్మించింది. 1970లో పాపికొండల విహార యాత్రలో జరిగిన మరో ప్రమాదంలో 30 మం ది మృతిచెందారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఒక్కరో ఇద్దరో యాత్రికులు పాపికొండల విహార యాత్రలో నీట మునిగి చనిపోతూనే ఉన్నారు. 2001 సంవత్సరంలో చర్ల తాలిపేరు వా గును దాటుతున్న పడవ మునగడంతో 23మంది చనిపోయారు. దేవీపట్నం వద్ద ఆదివారం జరిగిన పాపికొండల పర్యాటక బోటు ప్రమాదం రెండవ అతిపెద్ద నీటి ప్ర మాదంగా చెప్పవచ్చు. ఈ ప్రమాదం తో తో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాపికొండల విహార యాత్రలో నిబంధనలు పాటించని కారణంగానే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి పువ్వాడ సంతాపం...
ఖమ్మం, నమస్తే తెలంగాణ: రాజమండ్రిలో జరిగిన పడవ మునిగిన ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా వాసులు మృతి చెందారు. వారి మృతికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో జరిగిన పడవ మునిగిన ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా వాసులు మృతి బాధాకరమన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు హుటాహుటిన ఆదివారం బయలుదేరి వెళ్లారు. వెళ్లిన వారిలో నాయకులు బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్ పగడాల నాగరాజు, కమర్తపు మురళీ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ తదితరులున్నారు.

217
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles