విషజ్వరాలను నియంత్రించండి

Sun,September 15, 2019 12:40 AM

-ప్రతీ గ్రామంలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించాలి
-సర్వేలో ఆయూష్ డాక్టర్ల సేవలు వినియోగించుకోవాలి
-కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్

ఖమ్మం, నమస్తే తెలంగాణ : సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక దృష్టిసారించి, విషజ్వరాల నియంత్రణకు ర్యాపిడ్ ఫివర్ సర్వే ప్రతి గ్రామంలో నిర్వహించాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో నమోదైన విషజ్వరాల కేసులపై కలెక్టర్ సమీక్షించారు. ప్రధానంగా డెంగ్యూ, టైపాయిడ్, మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్ల సహాయంతో ర్యాపిడ్ ఫివర్ సర్వే నిర్వహించి జ్వర పీడితుల రక్త నమూనాలను సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు.

రోగ లక్షణాల స్థితిగతులను నిర్ధారణ చేసుకొని రక్తనమూనాలను సేకరించాలని కలెక్టర్ అన్నారు. ర్యాపిడ్ ఫివర్ సర్వేలో ఆయూష్ డాక్టర్ల సేవలు కూడా వినియోగించుకోవాలన్నారు. పీహెచ్‌సీ పరిధిలో అవసరమైన పారిశుధ్య పనులకు సంబంధించిన అవసరాలను తెలియజేసి పంచాయతీ సహాకారంతో గ్రామాల్లో పారిశుధ్య పనులకు ముమ్మరం చేయాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన నిధులను వినియోగించుకొని యాంటీ లార్వా పనులను చేపట్టాలన్నారు. అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో యాంటీ లార్వా స్ప్రేయింగ్, ఫాగింగ్ పనులు చేపట్టడంతో పాటు మలేరియా అధికారులు విషజ్వరాల నియంత్రణపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో ప్రతీ ఇంటికి తిరిగి నీటి నిల్వలు లేకుండా మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చడం ద్వారా పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని వైద్యాధికారులను సూచించారు.

శిశు మరణాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కొణిజర్ల మండలం విక్రంనగర్‌ను అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిని సందర్శించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, శిక్షణ కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ కళావతీబాయి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి సైదులు, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ జే శ్రీనివాసరావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అలివేలు, డాక్టర్ కోటిరత్నం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమావేశంలో పాల్గొన్నారు.

173
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles