ఖమ్మం లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామా..

Fri,March 22, 2019 01:41 AM

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఖమ్మం లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావును సీఎం కేసీఆర్ ప్రకటించారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలంగాణలోని 16 లోక్‌సభ స్థానాలకు టీఆర్‌ఎస్ తరుపున పోటీచేసే అభ్యర్థుల జాబితాను సీఎం ప్రకటించారు. కొన్ని రోజులుగా ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పలానా వ్యక్తి పోటీ చేస్తారని కొందరు పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ సీఎం కేసీఆర్ అన్నిరకాల రాజకీయ, సామాజిక సమీకరణాలను పరిశీలించి నామాకు ఖరారు చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఓటమికి గల కారణాలను కూడా విశ్లేషించారు.

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటీ వెంకటేశ్వర్లులతో పాటు గత ఎన్నికల్లో ఓటమి చెందిన పిడమర్తి రవి, లింగాల కమల్‌రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలతో పాటు ఇతర నాయకులతో కేటీఆర్, కేసీఆర్‌లు సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా నాయకులతో విడివిడిగా మాట్లాడినట్లు విశ్వనీయ సమాచారం. పార్టీ తరుపున ప్రకటించిన అభ్యర్థి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి వర్గ విభేదాలకు తావివ్వకుండా ఐక్యమత్యంతో పార్టీని బలోపేతం చేసే దిశగా పని చేయాలని కేసీఆర్ సూచించారు. పార్టీకి నష్టం చేసే చర్యలకు ఎవరు పాల్పడినా తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు.

నామా నాగేశ్వరరావు బాల్యం.. కుటుంబ నేపథ్యం..
నామా నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సరిహద్దు వరంగల్ జిల్లాలోని బలపాల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. నామ ముత్తయ్య, వరలక్ష్మీ దంపతుల ప్రథమ కుమారుడు నామ నాగేశ్వరరావు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు సీతయ్య, రామారావు, క్రిష్ణయ్య, ముగ్గురు అక్కా చెళ్లెళ్లు మారెడ్డి రాధమ్మ, కమ్మ ధరలక్ష్మీ, మాలెంపాటి తులిశమ్మ, వారిలో ఆయన పెద్ద అక్క రాధమ్మ కొన్నేళ్లు క్రితం మరణించారు. 1987 సంవత్సరంలో నామ నాగేశ్వరరావు చిన్నమ్మను వివాహమాడారు, వారికి ముగ్గురు సంతానం, ఇద్దరు కుమారులు పృధీ తేజ, భవ్యతేజ, కుమార్తె రాగిణి. నామ నాగేశ్వరరావు తన స్వగ్రామం బలపాలలో ఏడో తరగతి, ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలో పదో తరగతి వరకు చదువు కొనసాగించి, కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను ఉత్తమశ్రేణిలో పూర్తిచేశారు. ఉత్తమ శ్రేణిలో ఇంటర్మీడియట్ పూర్తి చేసినప్పటికీ అర్థిక పరిస్థితులు అనుకూలించకపోవటంతో మెడిసిన్ చదవాలన్న నామా కోరిక ఆచరణలో నెరవేరలేదు.

సామాన్య రైతు కుటుంబం నుంచి కార్మికునిగా, పారిశ్రామికవేత్తగా..
సామాన్య కార్మికునిగా జీవితాన్ని ప్రారంభించి పరిశ్రమలకు అధినేతగా, రాజకీయవేత్తగా నామా నాగేశ్వరరావు ఉన్నత స్థానాన్ని అంచెలంచలుగా అధిరోహించారు. పాల్వంచలోని కేటీపీఎస్‌లో రోజువారి కార్మికుడిగా ఉద్యోగం నిర్వర్తించి అనంతరం పారిశ్రామిక రంగంవైపు అడుగులు వేశారు. తాను వేలాది మంది కార్మికులకు జీవనోపాధిని కల్పిస్తూ వారి జీవితాలలో వెలుగులను నింపుతున్నారు. 1982లో మధుకాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌ను స్థాపించి దేశంలోని నలుమూల వ్యాపారరంగాన్ని విస్తృత పరిచారు. ఆయా ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ చేయూతనిస్తున్నారు. ఒక సామాన్య మానవుడు ఉన్నత శిఖరాలను ఆధిరోహించడానికి ఆవసరమైన స్ఫూర్తి ఆయన నుంచి లభిస్తున్నది. జిల్లాను పారిశ్రామిక రంగం వైపు నడిపించడమే ధ్యేయంగా ఆయన అవసరమైన చర్యలను చేపట్టడానికి ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని నిరుద్యోగులకు అవసరమైన ఉపాధిని కల్పించడానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు.

సామాన్యునిగా ప్రస్థానం..
ఆర్థిక ఇబ్బందులు వల్ల నామా నాగేశ్వరరావు తన చదువులకు అర్ధాతరంగా స్వస్తి పలికి, తన మేనమామ సహకారంతో పాల్వంచ థర్మల్ స్టేషన్ దినసరి కూలీగా ఉద్యోగంలో చేరారు. రోజుకు మూడున్నర రూపాయల వేతనంతో దినసరి కూలీగా చేరిన నామ కష్టించి పనిచేసి అనతి కాలంలోనే థర్మల్ పవర్ స్టేషన్ ఉద్యోగులతో శభాష్ అనిపించుకున్నారు. దీంతో పవర్‌స్టేషన్ అధికారులు నామాకు ప్లాంట్ అసిస్టెంట్‌గా ఉద్యోగ అవకాశం కల్పించారు. ఉద్యోగానికి తగ్గట్టు జీతం బాగానే ఉన్నప్పటికీ నలుగురికి సహాయ పడాలన్న సంకల్పంతో ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి తన కలల్ని సాకారం చేసుకునేందుకు తొలుత మధుకాన్ కన్‌స్ట్రక్షన్స్ పేరిట కాంట్రాక్ట్ పనులు చేపట్టారు. ఆ తరువాత ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలనే తలంపుతో ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచించి మధుకాన్ గ్రానైట్ సంస్థను నెలకొలిపారు. అనతికాలంలోనే గ్రానైట్ వ్యాపారంలో అనూహ్యమైన విజయాలను సాధించడంతో పాటు అనేక మందికి మార్గదర్శులుగా నిలిచి ఎంతో మంది ఎదుగుదలకు దోహదపడ్డారు.

నిరంతర కృషి, పట్టుదల, కఠోర శ్రమ ఫలితంగా అనేక సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటుగా మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు అనతికాలంలో అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో నామ నాగేశ్వరరావు తిరుగులేని విజయాలను సాధించారు. నామ నేతృత్వంలో అంతర్జాతీయంగా మంచి పేరు గడించిన మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు నిరుద్యోగుల పాలిట ఉపాధి కల్పతరువుగా ప్రపంచ చరిత్ర పుటల్లో కెక్కటం గమనార్హం. తన సంస్థలో సుమారు 12వేల మందికి పైగా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. వారి జీవితాల్లో వెలుగులు నింపారు.

బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు..
- బయ్యారం గనుల అక్రమ లీజుల వ్యవహారంలో పార్లమెంటు లోపల, బయట నాటి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడి అక్రమ లీజులు అనుమతులను రద్దు చేయించడంలో ఆయన పోరాటం అనిర్వచనీయం.
-బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నాడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నామా నాటి కేంద్ర ఉక్కుశాఖ మంత్రులు వీరభద్రసింగ్, సాయిప్రతాప్, బెన్ని ప్రసాద్ వర్మ అనేకమార్లు లేఖలు రాయటంతో పాటుగా వారిని స్వయంగా కలిసి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు.
- నాడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా 17అగష్టు 2010న లోక్‌సభలో అక్రమ ఖనిజ తవ్వకాలపై నామా మాట్లాడటం జరిగింది. బయ్యారం అక్రమ లీజుల వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్లమెంటు లోపల, బయట పెద్దఎత్తున పోరాడి రక్షణ స్టీల్ ప్లాంట్‌కు కట్టబెట్టిన అక్రమ లీజు అనుమతులను రద్దు చేయించి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటే చేయాలని డిమాండ్ చేశారు.
- గతంలో బయ్యారం, కారేపల్లి, ఇల్లెందు ప్రాంతాల్లో ప్రైవేటు మైన్స్‌లో పనిచేసి ఉద్యోగాలు కోల్పోయిన సుమారు 1500 మంది నిరుపేద కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఏర్పడుతుందని నామా పేర్కొన్నారు.

పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ప్రధాన సమస్యలపై నామా పోరాటం..
పార్లమెంటరీ పార్టీ నేతగా పార్లమెంట్‌లో రైతుల ఆత్మహత్యలు, బాబ్లీ ప్రాజెక్టుపై అక్రమ నిర్మాణాలు, బయ్యారం గనుల అక్రమ లీజులు, ప్రత్యేక తెలంగాణ తదితర ప్రధాన సమస్యలపై తన వాణిని బలంగా విన్పించి అనతికాలంలోనే భారత పార్లమెంటరీ రాజకీయ చరిత్రలలో నామా ప్రముఖ నేతగా నిలిచారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని పార్లమెంట్‌లో, బయట ధర్నాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు, నూతన రైల్వేలైన్ ఏర్పాటుకు, నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి, జాతీయ రహదారుల అభివృద్ధికి, తెలంగాణ యువతకు స్వయం ఉపాధికి, గ్రామీణ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, మహిళా సాధికారతకు, తెలంగాణ టూరిజం అభివృద్ధికి, నక్సలైట్ల ప్రభావిత గ్రామాలకు వందల కోట్లు నిధులు మంజూరుకు కృషి చేయడం జరిగింది. బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడని కుట్రలు పన్ని 2 సార్లు ఐటీ దాడులు చేయించి ఇబ్బందులకు గురిచేసిన వెరవక ప్రజల సమస్యల పైన నామా రాజీలేని పోరాటం చేశారు.

నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు..
నామా నాగేశ్వరరావుది నిండైన హృదయం.. విశాల దృక్పథం.. నిరుపేదలు.. అన్నర్తులకు ఆయన ఓ అపన్నహస్తం. తన తపనంత పేదల కోసమే. పేదలకు సేవ చేయాలన్న దృక్పథంతో తన తండ్రి నామా ముత్తయ్య జ్ఞాపకార్థం 1996లో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. తాను సంపాదించిన సంపాదనలో కుటుంబ సభ్యులకు పెట్టుకునే మాదిరిగా అందులో కొంత భాగం నిరుపేదలు, అన్నర్తులకు సహాయం చేయాలన్న సంకల్పంతో నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్‌ను నెలకొల్పారు. తన దగ్గరకు వచ్చే నిరుపేదలకు ట్రస్ట్ ద్వారా అవసరమైన సహాయం అందించి వేల మంది జీవితాల్లో నామ సరికొత్త వెలుగులు నింపారు.

15వ లోక్‌సభ ఎన్నికల్లో నామా ఘన విజయం..
నామా కృషి ఫలితంగా ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో సైతం తెలుగుదేశం పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుంది. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి సీపీఎం, సీపీఐ పార్టీల మద్దతుతో పోటీ చేసిన తన ప్రత్యర్థి ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు రేణుకచౌదరిపై సుమారు 1 లక్షా 25 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి 15వ లోక్‌సభలో తొలిసారిగా పార్లమెంటు సభ్యుడిగా అడుగుపెట్టారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై తన వాదనలు గట్టిగా విన్పించడంతో నామా అనతికాలంలోనే భారత పార్లమెంటరీ చరిత్రలో ప్రముఖ రాజకీయవేత్తగా పేరుగడించారు. లోక్‌సభ సభ్యుడిగా తొలిసారి పార్లమెంటులో అడుగిడిన నామా నాగేశ్వరరావు పలు ప్రధాన సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో వ్యవహరించడంతో నాటి యూపీఏ చైర్‌పర్సన్, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భాజపా సీనియర్ నాయకులు ఎల్‌కే అద్వాని, సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, జనతాదళ్ నేత శరత్ యాదవ్, సమాజ్‌వాది పార్టీ నేత మూలాయం సింగ్ యాదవ్, ఎన్‌సీపీ నాయకులు శరద్ పవర్ తదితర జాతీయ అగ్రశ్రేణి నాయకుల ద్వారా పలు సందర్భాల్లో ప్రశంసలందుకున్నారు.

ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు..
ఐదేళ్ల పార్లమెంటు సభ్యుల పనితీరుపై ఏడీఆర్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు 10 మార్కులకు గాను7.62 శాతం సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. ఏడీఆర్ సంస్థ చేపట్టిన సర్వేలో భాగంగా రాష్ట్రంలో 42 సభ్యుల పనితీరుపై నిర్వహించిన సర్వేలో నామా నాగేశ్వరరావు 7.62 శాతం మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచి ఖమ్మం జిల్లా కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుమడింపజేశారు.

మలిదశ తెంగాణ ఉద్యమంలో పార్లమెంట్‌లో నామా కీలక పాత్ర..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ పోరాటం నేపథ్యంలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర పునర్విభజన బిల్లుకు తొలి ఓటు వేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నామా నాగేశ్వరరావు తనవంతు సంపూర్ణ సహకారం అందించి యావత్ తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ని కలిసి విజ్ఞప్తి చేయడంతో పాటుగా చంద్రబాబు ద్వారా లేఖ ఇప్పించటంలో నామా సఫలీకృతులయ్యారు. ఆంధ్ర ప్రాంత టీడీపీ ఎంపీలు తన పైన ఎంత ఒత్తిడి తెచ్చిన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు తన పదవిని తృణపాయంగా భావించి తెలంగాణ సాధన కొరకు తన పదవి కూడా రాజీనామా లేఖ ఇవ్వటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా అనేక వందలాది మంది విద్యార్థులు, ఉద్యమకారులు ఆత్మబలిదానాలు చేసుకుని అమరులయ్యారని నామా పార్లమెంటులో పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తి ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా త్వరితగతిన నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని నామా డిమాండ్ చేశారు.

298
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles