రామయ్య పెళ్లి కొడుకాయెనే..

Fri,March 22, 2019 01:39 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: దాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఏప్రిల్14న శ్రీసీతారాముల కల్యాణం, ఏప్రిల్15న శ్రీరామ పట్టాభిషేకం వేడుక జరగనుంది. ఈ తిరుకల్యాణ మహోత్సవానికి సంబంధించి బుధవారమే పెళ్లి పనులకు అంకురారోపణ జరగగా, గురువారం స్వామివారు పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యారు. పాల్గుణ శుద్ధపౌర్ణమి రోజున తొలుత ఉత్సవమూర్తులను ఊరేగింపుగా బేడా మండపం వద్దకు తీసుకొచ్చారు. ఉత్సవ పెరుమాళ్లకు 25 వెండి కలశాలతో అభిషేకం నిర్వహించారు. అంతరాలయంలో మూలమూర్తులకు మహా కుంభప్రోక్షణ జరిపారు. చిత్రకూట మండపంలో వైష్ణవ ముత్తైదువులు 9మందిచే పసుపు కొమ్ములు దంచారు. 1008 మంది భక్తురాళ్లచే స్వామివారి కల్యాణ తలంబ్రాలు కలిపే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గుక్కా గులాలు, అత్తర్ పన్నీర్, సెంట్, సుగంధ ద్రవ్యాలను తలంబ్రాలపై కలిపారు.

కోటి తలంబ్రాలు అందించేందుకు పాదయాత్రగా భక్తులు భద్రాచలం చేరుకున్నారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించి తలంబ్రాలను దేవస్థానం అధికారులకు అందజేశారు. ఇదిలా ఉండగా బేడా మండపంలో బంగారు పూజల్లో భాగంగా స్వామివారికి లాలలు, జోలలు గావించారు. ఆస్థాన హరిదాసులు కీర్తనలను వేదస్వస్థి పఠించారు. బంగారు కలశాలలో వసంతాన్ని ఆవాహనం చేసి 9 పసుపు ముద్దలు తయారు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ విధంగా స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవాన్ని అర్చక స్వాములు సంప్రదాయబద్ధంగా జరిపించారు. తానీషా హయాం నుంచి ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు తెచ్చే సంప్రదాయాన్ని నిర్వహించడం జరిగింది. సాయంత్రం వేళ బేడా మండపంలో స్వర్ణలక్ష్మీ అమ్మవారికి 508మంది ఐటీసీ బీపీఎల్ భక్తురాళ్లచే సామూహిక లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన పూజలు చేశారు. స్వామివారి డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు భద్రాచలం తరలివచ్చి స్వామివారి డోలోత్సవం వేడుకలో పాల్గొన్నారు.

దీంతో రామాలయం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. గురువారం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు, ఏఈవో శ్రావణ్‌కుమార్, డీఈ రవిందర్, దేవస్థానం ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు, రాఘవేంద్రచార్యులు, వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలసాయి, ముఖ్య అర్చకులు మురళీ ఆచార్యులు, అర్చకులు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

195
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles