2025 నాటికి టీబీ నిర్మూలనే లక్ష్యం

Fri,March 22, 2019 01:36 AM

కూసుమంచి,మార్చి 21: దేశంలో 2025 నాటికి టీబీ వ్యాధిని నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని జిల్లా క్షయ నివారణాధికారి (డీటీసీవో) జీ.సుబ్బారావు అన్నారు. మండల పరిధిలోని జీళ్లచెరువు ఉన్నత పాఠశాలలో గురువారం క్షయ వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రపంచంలో ప్రతి 100మంది వ్యాధిగ్రస్తుల్లో 30మంది భారత్‌లోనే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించిందని చెప్పారు. దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చిలో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు. క్షయ రోగులను గుర్తించి, వారిని ఆధునిక వైద్యం అందించడానికి అవసరమైన అన్ని మందులతో పాటు, బలవర్ధకమైన ఆహారం తీసుకోవడానికి రోగులకు ఆర్ధిక సహాయం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈప్రణాళిక ప్రకారం ఒక్కో రోగికి సుమారు రూ.లక్ష విలువైన మందులతో పాటు, నెలకు రూ.1000 అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. తమ సిబ్బంది గ్రామాల్లో తిరిగి క్షయ రోగులను గుర్తించి, వైద్య సహాయం అందించడానికి కృషిచేస్తున్నారని, ఇతర స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కూడా తమకు సహకరించాలని ఆయన కోరారు. గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాల్లో రోగులను గుర్తించి, ఆధునిక వైద్యం అందిస్తామన్నారు. ప్రైవేట్ వైద్యుల వద్ద చికిత్సపొందిన వారికి కూడా ఆర్థిక సహాయం అందుతుందని, వైద్యునికి కూడా పారితోషికం అందిస్తామని తెలిపారు. ఈ శిబిరంలో హైదరాబాద్ నుంచి వచ్చిన మొబైల్ వాహనంలో వచ్చిన ప్రత్యేక పరికరంతో రోగులను పరిక్షించి, వ్యాధి నిర్దారణ చేశారు. శిబిరంలో 130మంది రోగులను పరీక్షించి, మందులు పంపిణీ చేసినట్లు కూసుమంచి మండల వైద్యాధికారి ఇవాంజిలిన్ తెలిపారు. ఈ శిబిరంలో సీహెచ్‌ఓ వలియుద్దీన్, హెచ్‌ఎస్ శ్రీనివాసరావు, దేవా, మహేష్, రజిత, అనసూర్య, భార్గవి, మేనకాదేవి, కీర్తి తదితరులు పాల్గొన్నారు.

209
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles