మొదటి ప్రాధాన్య ఓటే కీలకం

Thu,March 21, 2019 12:35 AM

(సారపాక) శాసన మండలి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటే కీలకమైనది. ఈ ఎన్నికల్లో గెలుపు ఎక్కువ శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఓటర్లు వేసే మొదటి ప్రాధాన్యత ఓటుపైనే అభ్యర్థుల ఆశలుంటాయి. గెలుపోటములు నిర్ణయించేది కూడా మొదటి ప్రాధాన్య ఓట్లే. అలాంటి ప్రాధాన్యత ఉన్న ఓటును ఇద్దరు.. ముగ్గురు అభ్యర్థులకు వేస్తే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులకు వచ్చిన మొదటి ప్రాధాన్య ఓట్లనే ముందుగా లెక్కిస్తారు. ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓట్లు సమానంగా వస్తే...అప్పుడు రెండవ ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.

ఓటు వేసేది ఇలా..
2019 ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిన జరుగనున్నాయి. ఆయా స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులందరి పేర్లు బ్యాలెట్ పేపరులో వరుస క్రమంలో ఉంటాయి. ఓటరు తన మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థి పేరుకు నిదానంగా ఉన్నా ఖాళీ స్థలంలో (1) అని రాయాల్సి ఉంటుంది. అనంతరం రెండవ ప్రాధాన్య ఓటు, మూడో ప్రాధాన్యత ఓటు కూడా ఏయే అభ్యర్థులకు వేస్తారో వారి పేర్లకు నిదానంగా ఉన్న స్థలంలో రెండు, మూడు నంబర్లు రాయాల్సి ఉంటుంది. ఇద్దరు అభ్యర్ధులకు మొదటి ప్రాధాన్యత ఓటు (అంటే ఇద్దరు అభ్యర్థుల పేర్ల పక్కన ఒకటి అని రాయడం) వేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదు. రెండో లేదా మూడో ప్రాధాన్యం గల ఓటును ఇద్దరు అభ్యర్థ్ధులకు వేసినా లెక్కింపు సమయంలో ఆ బ్యాలెట్‌ను పక్కన పెట్టే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. ఉపాధ్యాయులు, పట్టభద్రుల స్థానాలకు వినియోగించే బ్యాలెట్ పేపర్లు రెండు రంగుల్లో ఉండనున్నాయి.

లెక్కింపులోనూ ప్రాధాన్యతే కీలకం..
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులోనూ మొదటి ప్రాధాన్యం ఓటునే ముందుగా లెక్కిస్తారు. పట్టభద్రుల స్థానానికి 17 మంది పోటీ చేస్తున్నారనుకుందాం.. 17 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి మొదటి ప్రాధాన్య ఓట్లు ఎన్ని వచ్చాయనేది లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరికి ఎక్కువగా వస్తాయో ఆ అభ్యర్ధి గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్య ఓట్లు ఇద్దరు అభ్యర్ధులకు సమానంగా వస్తే అప్పుడు ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుకుంటారు. రెండో ప్రాధాన్య ఓట్లు ఎవరికి ఎక్కువగా వస్తే వారే విజయం సాధించినట్లుగా ప్రకటిస్తారు. రెండో ప్రాధాన్యలోనూ సమానంగా వస్తే.. మూడో ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దాదాపు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది మొదటి ప్రాధాన్యత ఓట్లేనని...కొన్ని సందర్భాల్లో మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లు కీలకంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

256
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles