ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

Thu,March 21, 2019 12:35 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : శాసనమండలి ఎన్నికలను పకడ్భందీగా, సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఎంపీడీఓలు, తహసీల్దార్లు, అటవీశాఖ అధికారులు, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్‌లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఎంఎల్‌సీ ఎన్నికలు, ఒక గ్రామపంచాయతీకీ ఒక నర్సరీ, ఉపాధిహామి పనులు, మండల, జిల్లా పరిషత్ ఓటరు జాబితా ప్రచురణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ నెల 22న జరుగునున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఎన్నికల విధులకు కేటాయించిన పోలింగ్ సిబ్బంది ఈ నెల 21న ఉదయం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో రిపోర్టు చేసి, తమకు కేటాయించిన పోలింగ్ సామాగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, బ్యాలెట్ పేపర్ పద్దతిన పోలింగ్ జరుగుతుందని, ఓటుహక్కును ప్రాధాన్యతాపరంగా వాయిలెట్ రంగు స్కెచ్‌పెన్‌తో మాత్రమే వినియోగించుకోవలసి ఉంటుందని ఓటరుకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. శాసనమండలి ఎన్నికలలో ఓటుహక్కు వినియోగించుకునే ఓటరు కుడిచేతి మధ్య వేలుకు మాత్రమే సిరా గర్తుపెట్టాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ అనంతరం సీల్డ్ చేయబడిన బ్యాలెట్ బాక్స్‌లను తిరిగి రిసెప్షెన్ కేంద్రానికి తరలించాలని, అనంతరం వాటిని నల్గొండకు పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

శాసనసభ ఎన్నికల మాదిరిగానే మోడల్ కోడ్ ఆఫ్ కండర్ట్ పటిష్టంగా అమలు చేయాలని పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల పరిధి నిబంధనను ఖచ్చితంగా పాటించాలని ఓటరు ఫొటో స్లిప్పులతో పాటు ఓటరు ఏదైనా ఒక గుర్తింపు కార్డు కలిగి ఉండాలని వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ ప్రక్రియతో పాటు మైక్రో అబ్జర్వర్లు కూడా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం జిల్లాకు నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యానికనుగుణంగా ప్రతి గ్రామపంచాయతీకి ఒక నర్సరీ పద్దతిన అన్ని గ్రామపంచాయతీలలో నర్సరీలను పెంచేందుకు ఇప్పటికే చేపట్టిన చర్యలతో పాటు, ఇంకనూ పురోగతి సాధించని గ్రామాలలో అటవీశాఖ అధికారుల సహకారంతో లక్ష్యాలను వేగవంతం చేయాలని ఉపాధిహామి పథకం కూలీల సంఖ్యను పెంచి పనులను ముమ్మరం చేయాలని మండల అభివృద్ధి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయిలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో అందిన అభ్యంతరాల ప్రతిపాదనలు జిల్లా పంచాయతి అధికారి కార్యాలయమునకు పంపాలని కలెక్టర్ ఎంపీడీలకు సూచించారు. జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రియాంక, జిల్లా అటవీశాఖాధికారి ప్రవీణ, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, జిల్లా పంచాయతీ అధికారి కే.శ్రీనివాసరెడ్డి, ఎంఎల్‌సీ ఎన్నికల సెక్టోరల్ అధికారులు తదితరులు వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్నారు.

229
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles