23న ఖమ్మంలో సాహితీ సౌరభం..

Wed,March 20, 2019 12:55 AM

ఖమ్మం కల్చరల్ మార్చి19: లబ్ధప్రతిష్ఠులైన కవులు, రచయితలతో ఖమ్మం సాహితీ సౌరభాలను వెదజల్లనుంది.. రాష్ట్రస్థాయి సాహితీవేత్తలతో సందడి చేయనుంది.. ప్రముఖ రచయిత, కవి, విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావు ఐదు సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రుల పేరుతో మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఆట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం జీవన సాఫల్య సాహితీ అవార్డులను అందజేస్తున్నారు. ఈ సాహితీ పండుగలో భాగంగా ఈ నెల 23న నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు సాహితీ పురస్కారాల సంబురాలను నిర్వహించనున్నారు. మంగళవారం నగరంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మువ్వా శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో ప్రముఖ కవులు శివారెడ్డి, గోరటి వెంకన్న, నగ్నముని ఈ పురస్కారాలను అందుకున్నారని, 2017కు ప్రజా కవి సుద్దాల అశోక్‌తేజ, 2018కి సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత దేవీప్రియలు ఈ పురస్కారాలను అందుకోనున్నారని తెలిపారు. ఒక్కొక్కరికి 25 వేల రూపాయల నగదు బహుమతి, అవార్డులతో పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా యువ కవులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా వారి తొలి సంకలనాలకు గౌరవంగా తొమ్మిది మంది కవులను సత్కరించనున్నట్లు తెలిపారు. గతంలో తాను సమాంతర ఛాయలు, సిక్త్స్ ఎలిమెంట్ సంకలనాలను అందించానని, ఆ స్ఫూర్తితో రచించిన 174 కవితలతో కూడిన వాక్యాంతం సంకలనాన్ని ఈ సభలో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. సాహితీ పురస్కారాల జ్యూరి కమిటీకి చైర్మన్‌గా కవులు ఖాదర్‌మొహినుద్దీన్, రవిమారుత్, ప్రసేన్, సీతారాం, ఆనందాచారి వ్యవహరించారని తెలిపారు. ఈ సాహితీ సంబురానికి నెల నెలా.. వెన్నెల, అక్షరాల త్రోవ, రవళి, తెలంగాణ సాహితి, ఇతర సాహితీ సంస్థలు సహకరిస్తున్నాయని తెలిపారు. ఈ సాహితీ పండుగకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, కవులు గంగిశెట్టి లక్ష్మీనారాయణ, జూలూరి గౌరీశంకర్, ఖాదర్‌మొహినుద్దీన్, శిఖామణి, సుబ్బాచారి, లక్ష్మీనర్సయ్య, ఇతర ప్రముఖ కవులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో కవులు రవిమారుత్, అట్లూరి వెంకటరమణ పాల్గొన్నారు.

259
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles