వడ్డీతోసహా ఆస్పత్రి ఖర్చులు చెల్లించండి..

Mon,March 18, 2019 11:44 PM

-జిల్లా కన్స్యూమర్ ఫోరం తీర్పు
ఖమ్మం లీగల్, మార్చి 18 : ఆస్పత్రి ఖర్చులు చెల్లించకుండా పాలసీదారును ఇబ్బందులకు గురిచేసిన అపోలో మునిచ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి జిల్లా వినియోగదారుల ఫోరం అక్షింతలు వేసింది. వడ్డీతో సహా ఆస్పత్రి ఖర్చులు మొత్తం రూ.1,04,652/- చెల్లించాలని సోమవారం తీర్పు వెలువరించింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం పట్టణానికి చెందిన గుర్రం నరేందర్ కుమార్ అపోలో మునిచ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ దగ్గర సెప్టెంబర్ 12, 2015న హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నారు. దురదృష్టవశాత్తూ మే 23, 2016న ఇంట్లో కాలుజారి పడిపోవడంతో ఎడమ భుజానికి తీవ్రగాయమైంది. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్న అనంతరం అవసరమైన పత్రాలు సమర్పించి ఆస్పత్రి ఖర్చులు చెల్లించాలని ఇన్స్యూరెన్స్ కంపెనీని కోరాడు. కానీ ఆస్పత్రి బిల్లు చెల్లించడంలో ఇన్స్యూరెన్స్ కంపెనీ జాప్యం చేస్తుండడంతో పాలసీదారే సదరు మొత్తాన్ని చెల్లించి డిశ్చార్జీ అయ్యారు. కొద్దిరోజుల తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించనందున క్లెయిమ్ రద్దు చేస్తున్నట్లు పాలసీదారుకు మెయిల్‌కు కంపెనీ ప్రతినిధులు లెటర్ పంపారు. దీంతో నరేందర్‌కుమార్ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫోరం చైర్మన్ పురం మాధవ్‌రాజా, సభ్యుడు రాయల కిరణ్‌కుమార్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సేవాలోపాన్ని నిర్ధారించారు. పాలసీదారుకు ఆస్పత్రి ఖర్చులు మొత్తం రూ.1,04,652/- సంవత్సరానికి 9శాతం వడ్డీతోసహా చెల్లించాలని అపోలో మునిచ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీని ఆదేశించారు.

215
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles