నేడే లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్..

Mon,March 18, 2019 01:55 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఖమ్మం పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌ను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ సోమవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం కలెక్టరేట్‌లో విడుదల చేస్తారు. ఆ తరువాత 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ మధ్యలో ప్రభుత్వ సెలవుదినాలైన 21,23,24 తేదీలలో నామినేషన్ల స్వీకరణ ఉండదు. ఇక మిగిలింది 18,19,20,25 తేదీలలో మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారు. కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో వివిధ రాజకీయ పక్షాల నాయకులు వేగవంతంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలోనే నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది కనుక ఆ పరిసరప్రాంతాలలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.

నామినేషన్లను అందించేందుకు గాను కేవలం ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇంకా ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు ఎవరో నిర్ణయం కానందున తొలిరోజు నామినేషన్లు దాఖలు కాకపోవచ్చు అనే అభిప్రాయం నెలకొంది. 26న నామినేషన్ల స్క్రూట్నీ, 28న ఉపసంహరణ, ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్, మే 23న కౌటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 15 లక్షల 4వేల 878 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7లక్షల 36వేల 222 మంది పురుషులు, 7లక్షల 68వేల 626 మంది స్త్రీలు కాగా ఇతరులు 30 మంది ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకుగాను జిల్లాలో 1798 పోలింగ్ కేంద్రాలను, 948 పోలింగ్ లోకేషన్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పటిష్టంగా అమలు పర్చేందుకుగాను వివిధ తనిఖీ బృందాలను నియమించారు.

దీనిలో భాగంగా జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు 33 బృందాలను, 21ఫ్లయింగ్ స్క్యాడ్, 22 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ బృందాలు, 31 వీడియో సర్వేలెన్స్ బృందాలతో పాటు 162 మంది సెక్టార్ అధికారులను కేటాయించారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి 7 నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. 7 నియోజకవర్గాలకు ఏడుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. పార్లమెంట్ ఎన్నికలు పురస్కరించుకుని ఇప్పటికే ఈవీఎంల మొదటి విడత పరిశీలన పూర్తి చేశారు. 2227 బ్యాలెట్ యూనిట్లు, 1676 కంట్రోల్ యూనిట్లు, 1768 వీవీప్యాట్‌లను సిద్ధంగా ఉంచారు.

ఓటు నమోదుకు 14,879 దరఖాస్తులు..
ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏండ్లు నించినవారు ఈ నెల 15వ తేదీ వరకు ఓటు నమోదు చేసుకున్నారు. గత నెల 22వ తేదీన ఎన్నికల అధికారులు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల ముసాయిదాను విడుదల చేశారు. అయితే 15 వరకు ఓటు నమోదుకు వచ్చిన దరఖాస్తు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని అశ్వారావుపేట, కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గాలు మినహా ఫారం-6 దరఖాస్తులు ఖమ్మం, మధిర, పాలేరు, వైరా, సత్తుపల్లిలో కలిపి మొత్తం ఫారం-6 దరఖాస్తులు 14,879, ఫారం-7 దరఖాస్తులు 9,055, ఫారం-8 దరఖాస్తులు 4,731, ఫారం-8ఏ దరఖాస్తులు 1,186 వచ్చాయి. వీటిలో ఖమ్మం నియోజకవర్గంలోనే అధికంగా 6,327 దరఖాస్తులు ఓటు నమోదుకు వచ్చాయి.

11 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి ఉండాలి..
ఓటరు తన పోలింగ్ కేంద్రాల వివరాలను తెలుసుకునేందుకుగాను శాసనసభ ఎన్నికలలో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఫొటో ఓటరు స్లిప్ పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల కనుగుణంగా ఓటరు స్లిప్పులతో పాటు నిర్దేశించిన 11 రకాల గుర్తింపు ధ్రువీకరణ పత్రాలతో ఏదేనీ ఒక గుర్తింపు పత్రాన్ని ఓటరు తనతోపాటు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డు, బ్యాంక్, పోస్టాఫీస్ పాస్‌పుస్తకం, పాన్‌కార్డు, కార్మిక శాఖ వారిచే జారీ చేయబడిన స్మార్ట్ కార్డు ఆరోగ్య భీమాకార్డు ఉపాధిహామీ జాబ్‌కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీల అధికారిక గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు వీటిలో ఏదేని ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా ఓటరు చూపించాల్సి ఉంటుంది.

పోటీచేసే అభ్యర్థులు నేర చరిత్ర వివరాలను తెలపాలి..
లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌తో పాటు ఫారం-26 అఫిడవిట్‌లో అభ్యర్థి పెండింగ్ నేర చరిత్ర వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పత్యేకంగా బ్యాంకు ఖాతాను ప్రారంభించి ఖాతా నెంబరును నామినేషన్ ఫారంలో తెలియపర్చాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ ఫారం నెం.26లో సమర్పించిన అభ్యర్థి నేరచరిత్ర పెండింగ్ వివరాలను నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థి, రాష్ట్రస్థాయిలో అభ్యర్థికి సంబంధించిన రాజకీయ పార్టీ పోలింగ్ కంటే రెండు రోజుల ముందు వరకు కనీసం ముడుసార్లు సర్యులేషన్ కలిగిన పేపర్లో అదేవిధంగా స్థానిక కేబుల్ టెలీవిజన్‌లో ప్రచారం, ప్రసారం చేయలసి ఉంటుంది. నామినేషన్ పత్రంతోపాటు అభ్యర్థి ఫొటోలను కూడా తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. మొదటి ర్యాండమైజేషన్ పూర్తి అయిన ఈవీఎంలను నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రవాణా చేయడం జరుగుతుంది. నామినేషన్ల విత్‌డ్రాయల్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత రిటర్నింగ్ అధికారి స్థాయిలో రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ ఉంటుంది. అట్టి ప్రక్రియను కూడా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే చేపడతారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు మోడల్ కోడ్‌ఆఫ్ కండక్ట్‌ను పాటించాల్సి ఉంటుంది.

ఖరారుకాని అభ్యర్థులు..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పార్లమెంటు నుంచి ఏ రాజకీయపార్టీ నుంచి ఎవరు భరిలో ఉండనున్నారో తెలియక ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్షాల తరుపున ఏ నాయకుడు పోటీ చేస్తారో ఇంత వరకు ఆయా రాజకీయపార్టీల నాయకులు ప్రకటించలేదు. పలానా పార్టీ నుంచి పలానా అభ్యర్థి రంగంలో ఉంటారనే కచ్చితంగాం చెప్పలేని స్థితి ఏర్పడింది. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ తరుపున క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ నియోజకవర్గంలోని కార్యకర్తలతో రెండు పర్యాయాలు సమావేశాలను నిర్వహించారు. పార్టీ అధినేత ఏ వ్యక్తిని నియమించినా పార్టీ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేసేలా పువ్వాడ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మరోవైపు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కూడా నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం టీఆర్‌ఎస్ గెలవడం నల్లేరు మీద నడకల మారిపోయింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు కరువు అయ్యారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ తెలంగాణలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన జాబితాలో ఖమ్మం లేదు. ఆ పార్టీలో వర్గాల కుమ్ములాటతో ముందుకుపోని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయింది. ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెంకటవీరయ్య కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో ఆ పార్టీ తరుపున లోక్‌సభకు పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదు. సీపీఎం, సీపీఐ పార్టీల మధ్య పొత్తు కుదిరిందనే ప్రచారం మాత్రం జరుగుతుంది తప్ప ఖమ్మం లోక్‌సభ నుంచి ఏ పార్టీ పోటీచేస్తుందో తెలియని స్థితి ఏర్పడింది. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు మిగిలిన రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు ఖమ్మం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్ కర్ణన్
పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్లను నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజులు అనగా ఈ నెల 21 (గురువారం), 23 (శనివారం), 24 (ఆదివారం) మినహాయించి మిగిలిన తేదీలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం (జిల్లా కలెక్టర్, ఖమ్మం) కార్యాలయం నందు రిటర్నింగ్ అధికారి ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం వారికి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కమిషనర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఖమ్మం వారికిగాని నామినేషన్ పత్రములను అందజేయవచ్చని కలెక్టర్ తెలిపారు.

పైన పేర్కొన్న స్థలము, సమయంలో నామినేషన్ పత్రములు పొందవచ్చని, నామినేషన్ పత్రములు ఈ నెల 26 ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిశీలనకు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థిత్వము ఉపసంహరించుకొను నోటీసును అభ్యర్థిచేగాని లేదా అతని ప్రతిపాదికునిచేగాని లేదా వారి ఎన్నికల ఏజెంట్ చేగాని (అభ్యర్థిచే రాత పూర్వకముగా ఆమోదించపబడిన) పైన తెలుపబడిన అధికారులలో ఎవరికైనా రిటర్నింగ్ అధికారి ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గము కార్యాలయములో ఈ నెల 28వ తేదీ సాయంత్రం 3 గంటలలోగా అందజేయవచ్చని వివరించారు. ఏప్రిల్ 11 గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి అసెంబ్లీ భాగములలో అదేవిధంగా కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ విభాగములలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోలింగ్ జరుగుతుందని తెలిపారు.

265
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles