ప్రగతి పథంలో సిరుల మాగాణి

Thu,February 21, 2019 12:15 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో అద్భుత ప్రగతి సాధిస్తూ పురోగమిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో సింగరేణి అగ్రభాగాన నిలుస్తోంది. రాష్ట్రం వస్తే ఏమొస్తుంది..? పరిశ్రమలు ఏమవుతాయి..? అని వ్యక్తమైన అనుమానాలను పటాపంచలు చేస్తూ సింగరేణి గత ఐదేళ్లలో విస్మయపరిచే ప్రగతిని, వృద్ధిరేటునూ సాధించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి 129 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ సాధించని సాధించింది. 2009- 14లో సాధించిన బొగ్గు రవాణా, ఓబీ తొలగింపు అమ్మకాలు, నిఖర లాభాలతో పోలిస్తే తెలంగాణ ఆవిర్భావం తర్వాత గడిచిన ఐదేళ్లకాలంలో సింగరేణి సాధించిన వృద్ధి అత్యద్భుతం.. అనన్య సామాన్యం... దేశంలో ఎనిమిది సబ్సిడరీ కంపెనీలు ఉన్న కోలిండియా సైతం గత ఐదేళ్లలో ఇంత వృద్ధి నమోదు చేయలేదు.

-గణనీయమైన వృద్ధి..
తెలంగాణ రాక పూర్వం ఐదేళ్ల కాలంలో బొగ్గు రవాణాలో కేవలం 90 లక్షల టన్నుల వృద్దిని సాధించిన సంస్థ తెలంగాణ ఆవిర్భావం తర్వాత గడిచిన ఐదేళ్లలో 200 లక్షల టన్నుల వృద్ధిన సాధించింది. అంటే 132 శాతం వృద్ధి. ఓవర్ బర్డెన్ తొలగింపులో తెలంగాణ రాకపూర్వం ఐదేళ్లలో కేవలం 70 మిలియన్ క్యూబిక్ మీటర్ల వృద్ధి మాత్రమే సాధించిన కంపెనీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గడిచిన ఐదేళ్లలో 250 మిలియన్ క్యూబిక్ మీటర్ల వృద్ధి నమోదు చేసింది. అంటే 267 శాతం వృద్ధి. ఇక అమ్మకాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అబ్బురపరిచే విధంగా పెరిగాయి. స్వరాష్ట్రం రాక ముందు ఐదేళ్లలో అమ్మకాల్లో రూ.5600 కోట్ల వృద్ధి నమోదు చేసిన కంపెనీ, తెలంగాణ రాష్ర్టావిర్భావం తర్వాత ఐదేళ్లలో రూ.13 వేల కోట్ల వృద్ధి సాధించడం విశేషం. ఇది 142 శాతం వృద్దిగా నమోదైంది. అలాగే ట్యాక్సులు చెల్లించిన తర్వాత నికరలాభం కూడా భారీగా పెరిగింది. తెలంగాణ రాకపూర్వం ఐదేళ్లలో నిఖర లాభాల్లో రూ.290 కోట్ల వృద్ధిని నమోదు చేసిన కంపెనీ, తెలంగాణ రాష్ట్రంలో ఏటేటా పెరిగిన లాభాలతో గడిచిన ఐదేళ్ల కాలంలో రూ.1200 కోట్ల వృద్ధి నమోదు చేసింది.

-హామీలు.. వరాల వర్షం..
రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనిదే ఇటువంటి అద్భుతాలు సాధించడం అసాధ్యం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్.శ్రీధర్‌ను సింగరేణి సీఎండీగా నియమించారు. గత పాలకులు నిర్లక్ష్యం వల్ల సింగరేణి ఎదుగూ బొదుగూ లేకుండా ప్రయాణం చేస్తోందని, సింగరేణి శక్తి సామర్థ్యాలు పూర్తిగా వెలికితీసి, జాతీయస్థాయిలో నంబర్1గా నిలపాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సీఎం ఇచ్చిన హామీలన్నింటినీ యాజమాన్యం వెనువెంటనే అమలు జరిపి కార్మికుల పూర్తి విశ్వాసాన్ని చూరగొంది. దీంతో కార్మికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ సంస్థ పురోగాభివృద్ధికి త్రికరశుద్దితో సహకరించారు. సీఎం ఇచ్చిన హామీలలో మెడికల్ అన్‌ఫిట్ కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు కల్పించడం, క్యాంటీన్లు, ఆస్పత్రుల ఆధునీకరణ, కార్మికులు తమ గృహ నిర్మాణానికి తీసుకునే రూ.10 లక్షల రుణంపై వడ్డీ ఇప్పించడం, మ్యాచింగ్ గ్రాంట్ పది రెట్లు పెంపుదల, కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం ఇప్పించడం, ఉన్నత చదువులు చదివే కార్మికుల పిల్లలకు ఫీజు చెల్లింపు, దిగిపోయిన కార్మికునికి, భార్యకు రూ.5 లక్షల వరకు కార్పోరేట్ వైద్యం, లాభాల్లో 27 శాతం వాటా చెల్లింపు తదితర వాటిని యాజమాన్యం తక్షణమే అమలు చేసింది.

-ఆధునిక యంత్రాలతో పెరిగిన ఉత్పత్తి..
పాత యంత్రాల స్థానంలో సుమారు రూ.350 కోట్లతో కొత్త యంత్రాలు కొనుగోలు చేసి గనులకు అందించారు. దీంతో పాటు యంత్ర వినియోగం భారీగా పెంచడానికి ఎండీటీ సమావేశాలు ప్రతీ గనిలోనూ ఏర్పాటు చేసి కార్మికుల్ని, అధికారుల్ని కార్యోన్ముఖుల్ని చేశారు. దీంతో సమస్యలు దాదాపుగా కనుమరుగై ఏరియాల్లో ఉత్పత్తి ఉరకలు పెట్టింది. కార్మికులకు ప్రోత్సాహకంగా మంచి ఇన్‌సెంటీవ్ పథకాలు కూడా అమలులోకి తెచ్చారు.

-భారీగా మార్కెట్ విస్తరణ
ఈక్రమంలో సింగరేణి బొగ్గు అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలతో పాటు, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా రాష్ర్టాల్లో విద్యుత్ సంస్థలు కూడా సింగరేణి నుంచి బొగ్గును కొనుగోలు చేస్తున్నాయి. కోలిండియా నుంచి బొగ్గు పొందే కొన్ని సంస్థలు కూడా సింగరేణి సంస్థ నిలకడైన ఉత్పత్తితో, నాణ్యమైన బొగ్గును అందిస్తుందని గుర్తించి ఇక్కడి నుంచే బొగ్గు కొనడానికి ముందుకొస్తున్నారు. దీంతో సింగరేణి బొగ్గుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.

-విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు..
1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ రాష్ర్టానికి ఇప్పటివరకు 19,036 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందించిన సింగరేణి అనతి కాలంలోనే అత్యధిక పీఎల్‌ఎఫ్ సాధించిన ప్లాంట్లుగా జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి సత్తా చాటింది. ముఖ్యమంత్రి ఆదేశంపై మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదే కాక 12 ఏరియాల్లో మరో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి కూడా రంగంలో దిగింది. తొలి దశలో 130 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లను 2018-19లో పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ విధంగా సింగరేణి తెలంగాణ రాష్ర్టా ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని విధంగా వృద్ధిని, ప్రగతిని సాధిస్తూ రాష్ర్టాభివృద్ధికి తనవంతుగా చేయూత అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచే దిశగా ఉన్నత శిఖరాలవైపు శరవేగంతో దూసుకుపోతున్నది.

-ఇతర రాష్ర్టాల్లో విస్తరణకు వ్యూహం..
పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు, ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని సంస్థ తన 48 గనులతో పాటు ఇతర రాష్ర్టాల్లో మరో ఏడు బ్లాకులను చేపట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే ఒడిస్సాలో 500 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న నైనీ బ్లాక్‌ను చేపట్టిన కంపెనీ అదే రాష్ట్రంలో న్యూపాత్రపురా బ్లాకు కూడా చేపట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇవి కాక ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో మరో ఆరు కొత్త బ్లాకులు కావాలంటూ ప్రతిపాదనలు తయారు చేసింది. సింగరేణి విస్తరణపై ప్రత్యేక ఆసక్తి ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలని ప్రధాని మోదీని కలిసినప్పుడు ఈ విషయంపై స్వయంగా లేఖ అందించి విన్నవించారు. ఈ కొత్త బ్లాకులు కూడా లభిస్తే సింగరేణి సంస్థ అనతి కాలంలోనే వంద మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. ఈ దిశగా సింగరేణి వేగంగా అడుగులు వేస్తోంది.

-నెలనెలా సమీక్షలు...
సీఎం కేసీఆర్ ఆదేశంపై సీఎండీ శ్రీధర్ తన నేతృత్వంలో సింగరేణిని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలుపుతూ గత నాలుగేళ్లలో అనూహ్య ప్రగతి సాధిస్తున్నారు. 2015-16లో ఏకంగా 15 శాతం వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోని బొగ్గు పరిశ్రమలకే కాకుండా యావత్ ప్రభుత్వ రంగ సంస్థలకే ఆదర్శంగా నిలిపారు. కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించడం, చక్కని పారిశ్రామిక సంబంధాలు నెలకొల్పడం, ఎన్నడూ లేనన్ని సంక్షేమ పథకాలను అమలు పర్చడం, రక్షణ, రెవెన్యూ విభాగాలకు కావాల్సినవన్నీ సమకూర్చారు.

460
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles