టీచర్ల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా పని చేస్తా..

Thu,February 21, 2019 12:14 AM

-ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్
ఖమ్మం ఎడ్యుకేషన్ : శాసన మండలి అభ్యర్థిగా రెండోసారి గెలిపిస్తే ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా పని చేస్తానని ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పీఆర్‌టీయూ అధికార పార్టీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన ఖమ్మం నగరంలోని పలు పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను నిత్యం ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా పని చేశానన్నారు. మొదటి సారి ఎమ్మెల్సీగా తెలంగాణ ఇంక్రిమెంట్, సకలజనుల సమ్మెకాలానికి నగదు రహిత ఆర్జిత సెలవులు, చైల్డ్‌కేర్ లీవ్‌లను సాధించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 10,479 భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను ఆప్‌గ్రేడ్ చేయడం జరిగిందన్నారు. అతి త్వరలో ప్రత్యేకోపాధ్యాయుల నేషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పించే ఉత్తర్వులను సాధిస్తామన్నారు.

కొంత జాప్యమైనప్పటికీ సీపీఎస్ రద్దు చేయించటమే ప్రధాన లక్ష్యమన్నారు. మంచి ఐఆర్‌తో కూడిన ఫిట్‌మెంట్‌ను ఇప్పిస్తామన్నారు. సీసీఈ విధానం వల్ల విద్యా ప్రమాణాలు పడిపోతున్నందున వచ్చేవిద్యా సంవత్సరం నుంచి దాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ సంఘానికి జెండాలు లేవని టీచర్ల సమస్యలు పరిష్కరించాలనే ఏకైక లక్ష్యం, ఎజెండా మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మోతుకూరి మధు, భాషా పండిత సంఘం బాధ్యులు రవీందర్, ఉమారాణి, కమలకుమారి, రాష్ట్ర సంఘం బాధ్యులు వై వెంకటేశ్వరరావు, రెబ్బా శ్రీనివాస్, కట్టా శేఖర్, వై రవీందర్, దామోదర్‌రెడ్డి, సైదయ్య, నాగేశ్వరరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

301
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles