మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

Thu,February 21, 2019 12:14 AM

-2030 నాటికి 330 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం
కూసుమంచి, ఫిబ్రవరి20: మత్స్యకారులు సంక్షే మం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకుడు బీ బుచ్చిబాబు అన్నారు. పాలేరులోని మత్స్యపరిశోధన కేంద్రంలో డాక్టర్ జీ విద్యాసాగర్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్‌నగర్, నిర్మల్ జిల్లాలకు చెందిన 50మంది మత్స్యకారులకు పంజర వలల్లో చేపల పెంపకంపై మూడు రోజుల శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మత్స్యకారులు తప్పనిసరిగా ఈత నేర్చుకోవాలని, లేదంటే ప్రమాదాలకు గురవుతారని సూచించారు. వలలు, శుభ్రంగా ఉంచుకోకపోతే చేపలకు వ్యాధులు సంక్రమించి, నష్టపోతారని చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టి అభివృద్ధి చెందాలన్నారు. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త లవన్‌కుమార్ పంజర వలల ద్వారా చేపల పెంపకం విధానాన్ని వివరించారు. పంజర వలల్లో రెండు రకాలు ఉంటాయని తేలియాడే, మునిగే పంజరాలతో చేపల పెంపకంలో మెళకువలు పాటిస్తే అధిక దిగుబడి సాధంచవచ్చని చెప్పారు.

నీటి ప్రవాహం అధికంగా ఉన్న చోట పంజరాలు ఏర్పాటు చేస్తే నష్టపోతారని హెచ్చరించారు. అలాగే చేపల మేత, రవాణ, తదితర అంశాల్లో పాటించాల్సిన పద్దతులు వివరించారు. అశ్వారావుపేట ఆత్మ టెక్నికల్ మేనేజర్ శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ.. రవాణా సమయంలో చేపపిల్లలకు మేత ఇస్తే విషవాయువులు ఏర్పడి, చనిపోతాయని చెప్పారు. ఈకార్యక్రమంలో మత్స్య శాస్త్రవేత్త శాంతన్న మాట్లాడుతూ.. పంజరాల్లో పెంపకానికి అనుకూలమైన చేప రకాలను వివరించారు. రాష్ట్రంలో 6 లక్షల హెక్టార్లలో గల నీటి వనరులను ఉపయోగించుకుని 2030 నాటికి ప్రపంచ జనాభాకు అవసరమైన 330 మిలియన్ మెట్రిక్ టన్నుల చేపలను ఉత్పత్రి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమమని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మత్స్యకారులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

271
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles