నూరు శాతంఫలితాలే లక్ష్యం..

Sat,February 16, 2019 01:45 AM

-వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
-డిసెంబర్ 1 నుంచే ప్రత్యేక టైమ్ టేబుల్ అమలు
-భారత్ దర్శన్‌కు రీజియన్ నుంచి 43 మంది విద్యార్థులు ఎంపిక
-తల్లిదండ్రుల హల్‌చల్ కార్యక్రమంలో ఖమ్మానికి ప్రత్యేక గుర్తింపు
-ప్రతీ బాలికల పాఠశాలకు 10 సైకిళ్లు
- రెండు పాఠశాలల్లో ప్రీ స్కూల్ కన్సెప్ట్ అమలు
- సీఓఈలలో ఐఐటీ, నీట్‌లకు ప్రత్యేక శిక్షణలు
- కేసీఆర్ కేజీ టూ పీజీ విద్యలో భాగమే గురుకులాల బలోపేతం
- మూడు జిల్లాల రీజనల్ కోఆర్టినేటర్ ప్రత్యూష

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ఆలోచనలకనుగుణంగా గురుకుల విద్యాలయాలను బలోపేతం చేసే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. కేసీఆర్ మానసపుత్రికైన కేజీ టూ పీజీ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతోనే గురుకుల విద్యాలయాలను నెలకొల్పుతున్నారు. నాణ్యమైన విద్యతోపాటు మంచి భోజనం, మన్నిక కలిగిన దుస్తులు, ఆధునాతనమైన వసతులను కల్పిస్తూ తెలంగాణ సర్కారు ముందుకెళ్తున్నది. ఒకనాడు పురుగుల అన్నం, నీళ్లచారు, చిరిగిన దుప్పట్లు, దుస్తులు, కురుస్తున్న గదులు, తిరగని ఫ్యాన్లు, వెలగని లైట్లు, పనిచేయని మరుగుదొడ్లతో సహవాసం చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నేడు కార్పొరేటు విద్యను అభ్యసిస్తున్నారు. గతంలో జిల్లాకు ఒకటి, రెండు చొప్పున మాత్రమే ఉన్న గురుకుల విద్యాలయాలు నేడు పదుల సంఖ్యలో నడుస్తున్నాయి. ఆర్థిక, సామాజిక, సాంఘికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించే లక్ష్యంతో వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులకు పారదర్శకతతో కూడిన వ్యవస్థను రూపొందిస్తున్నది. ఈక్రమంలోనే విద్య బోధనలో, మౌలిక సదుపాయాల విషయాల్లోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. గతంలో ఎస్సీలకు మాత్రమే ఉన్న గురుకుల విద్యాలయాలను బీసీ మైనార్టీలకు కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈనేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల గురుకుల విద్యాలయాల సంస్థకు రీజనల్ కో ఆర్డినేటర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రత్యూషతో నమస్తే తెలంగాణ ముఖాముఖి..

నమస్తే: ఖమ్మం రీజనల్ పరిధిలో ఎన్ని విద్యాలయాలు, విద్యార్థుల సంఖ్య ఎంత?
ఆర్‌సీఓ: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిధిలో 26 పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఖమ్మంలో 8, భద్రాచలంలో 5, మహబూబాబాద్‌లో 4 పాఠశాలల్లో 10వ తరగతి వరకు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం పాఠశాలలో మాత్రమే 10వ తరగతి లేదు. ఇంటర్ కళాశాలలు ఖమ్మంలో 9, కొత్తగూడెంలో 5, మహబూబాబాద్‌లో 4 మొత్తం 18 ఉన్నాయి. మరో 8 పాఠశాలలు 8వ తరగతి వరకే ఉన్నాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో మహిళా డిగ్రీ కళాశాలలు నిర్వహిస్తున్నాం. ఖమ్మం రీజనల్ పరిధిలో 943 మంది 10వ తరగతి విద్యార్థులు, 1157 మంది ఇంటర్ ప్రథమ సంవత్సరం, 899 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.

నమస్తే: పది, ఇంటర్, డిగ్రీ ఫలితాలు
ఎలా ఉండబోతున్నాయి?
ఆర్‌సీఓ: టెన్త్, ఇంటర్, డిగ్రీలో నూరుశాతం ఫలితాలు సాధించే దిశగా ప్రణాళికను రూపొందించాం. గతేడాది డిసెంబర్ ఒకటి నుంచి ప్రత్యేక టైమ్ టేబుల్‌ను అందజేస్తున్నాం. ప్రతిరోజు రివిజన్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. రాత్రి 10.30 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. వారికి ప్రత్యేక ఆహారం, రాత్రి వేళలో టీ, స్నాక్స్ అందిస్తున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఉపాధ్యాయులకు వారిని దత్త ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రెండు రివిజన్ టెస్ట్‌లు కలిపి ఒక గ్రాండ్ టెస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మెరుగైన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. నూరుశాతం ఫలితాల దిశగా కృషి చేస్తున్నాం.

నమస్తే: విద్యార్థులకు అందించే
ఆహారం ఎలా ఉంటుంది..?
ఆర్‌సీఓ: ప్రతీ గురుకుల పాఠశాలలో ఎల్‌సీడీ టీవీలు అమర్చి డిజిటల్ బోధన అందస్తున్నాం. సృజనాత్మకతను పెంచడానికి ప్రయోగాలు చేస్తున్నాం. ఆరోగ్య శిబిరాలు నిర్వహించి పిల్లలను పరీక్షిస్తున్నాం. ప్రతి రోజు ఉదయం 100 మిల్లీ లీటర్ల పాలను బూస్ట్‌తో కల్పిస్తున్నాం. అల్పాహారంగా ఇడ్లీ, పులిహోరా, ఉప్మా, పొంగల్, కిచిడి, ఉడకబెట్టిన గుడ్డు, అరటిపండు ఇస్తాం. మధ్యాహ్నం రాత్రి కూరగాయలు, సన్నబియ్యంతో భోజనం, సాయంత్రం రకరకాల స్నాక్స్ అందింస్తున్నాం. ప్రతీ ఆదివారం చికెన్‌తో భోజనం పెడుతున్నాం. ప్రతీ గురుకుల పాఠశాలలో పరిశుభ్రమైన తాగునీరు అందించడానికి వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశాం.

నమస్తే: భారత్ దర్శన్
గురించి వివరిస్తారా..!
ఆర్‌సీఓ: రాష్ట్రస్థాయిలో అత్యంత ప్రతిభా పాఠవాలు ప్రదర్శించిన విద్యార్థులను ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ, జైపూర్, పుషకర్, ఆగ్రా, అజ్మీర్ యాత్రకు తీసుకువెళ్తున్నాం. ఈ నెల 20న రాత్రి బయలుదేరి 27వ తేదీ ఉదయం ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మం రీజనల్ నుంచి కే అలివేలు (ప్రిన్సిపాల్, డీసీవో, భద్రాచలం), కే స్వరూపరాణి (ప్రిన్సిపాల్, ఖమ్మం అబేంద్కర్ కాలేజ్), ఎం రాజ్యలక్ష్మి (ప్రిన్సిపాల్ టేకులపల్లి), వాసుకి శుభమంగళ (జేఎల్ మ్యాథ్స్ టేకులపల్లి ), ఎస్‌కే గౌస్లా (పీజీటీ వైరా), నీలిమ (సీఆర్‌ఆర్ హిందీ భద్రాచలం), దేవకి (సీఆర్‌టీ హిందీ, కల్లూరు) వీరితో పాటు ఖమ్మం రీజనల్ పరిధిలోని 5 నుంచి ఇంటర్ వరకు 43 మంది విద్యార్థులు ఈ యాత్రకు బయల్దేరుతున్నారన్నారు.

నమస్తే: తల్లిదండ్రుల హల్‌చల్
కార్యక్రమం ఎలా నడిచింది. ?
ఆర్‌సీఓ: గురుకుల విద్యాలయాల్లో జరుగుతున్న కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన, భాగస్వామ్యం కల్పించే లక్ష్యంతో గురుకులాల సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా, రీజనల్, రాష్ట్రస్థాయిలో క్రీడలు, వ్యాసరచన, వక్తృత్వ, టిబెట్, క్వీజ్ పోటీలు నిర్వహించాం. రీజనల్ స్థాయిలో 600 మంది తల్లిదండ్రు లు పాల్గొన్నారు. వీరిలో 66మంది తల్లిదండ్రులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరి నుంచి 13 మంది తల్లిదండ్రులు కూడా భారత్ దర్శన్‌కు తీసుకెళ్తాం.

నమస్తే: ప్రీ స్కూల్ కాన్సెప్ట్ అంటే ఏమిటీ ?
ఆర్‌సీఓ: హైస్కూల్ పిల్లలు చిన్నపిల్లల క్లాస్ రూమ్‌లకు వెళ్లి పాఠాలు చెప్పడమే ప్రీ స్కూల్ కాన్సెప్ట్. దీని ద్వారా విద్యార్థులకు చిన్నతనం నుంచే భయాన్ని పోగొట్టడం జరుగుతుంది. ఖమ్మం రీజనల్ పరిధిలో ముదిగొండ, తిరుమలయపాలెం పాఠశాలలో ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. పిల్లలలో సాంస్కృతిక, సాహిత్యపరమైన జిజ్ఞాసనం పెంచడానికి పాఠశాల, రీజనల్ స్థాయిల్లో ఆల్‌గోరిథమ్ పోటీలు నిర్వహించాం. మన రీజయన్ నుంచి 37 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు హాజరయ్యారు.

నమస్తే: వేసవిలో సమ్మర్ క్యాంపులు
నిర్వహిస్తున్నారా?
ఆర్‌సీఓ: ప్రతీ వేసవిలో సమ్మర్ సమురాయ్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. రాష్ట్రస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిపై త్వరలోనే స్పష్టత ఏర్పడుతుంది. ప్రతి ఆడపిల్లల పాఠశాలలో 10 సైకిళ్లు ఇస్తాం. ప్రతి ఒక్కరికీ సైకిల్ తొక్కడమే లక్ష్యం. 8వ తరగతి నుంచే కంప్యూటర్ శిక్షణ ఇస్తాం. ఎంపిక చేసిన సీవోఈలలో ఐఐటీ, ఎన్‌ఐటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం. ఖమ్మంలోని దానవాయిగూడెం అంబేద్కర్, పాల్వంచ పాఠశాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం.

నమస్తే : స్వేరోస్ నెట్‌వర్క్
పనితీరు ఎలా ఉంది?
ఆర్‌సీఓ: ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో స్వేరోస్ పనితీరు అద్భుతంగా ఉంది. సమర్థవంతమైన విలువలు కలిగిన నాయకత్వం ఉంది. ఫలితంగా నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే గురుకుల సదుపాయాలు, వసతుల గురించి చైతన్యం పెరిగింది. దీంతో 5 నుంచి డిగ్రీ వరకు ప్రవేశాలకు గతం కంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్థాపించిన స్వేరోస్ సంస్థ లక్ష్య సాధన దిశగా పనిచేస్తున్నది.

నమస్తే: గురుకులాల వైపు
ఎందుకు ఆకర్షితులవుతున్నారు?
ఆర్‌సీఓ: ప్రతీ విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా విద్య అందిస్తున్నాం. మెరికల్లాంటి విద్యార్థులను మరింత ప్రొత్సహిస్తాం. ఆధునిక వసతులు, నాణ్యమైన భోజనం, కార్పొరేట్ విద్యకు దీటుగా ఇక్కడ విద్యనందిస్తున్నాం. బాలికల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఇష్టమున్న రంగాల్లో ప్రోత్సహించి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నాం. వేసవిలో ప్రత్యేక క్యాంపులుంటాయి. ఉన్నత వర్గాల కంటే ఎక్కువ నాణ్యమైన భోజనం ఇక్కడ అందిస్తున్నాం. తల్లిదండ్రులను మరిపించేలా అధ్యాపకులు, ఉపాధ్యాయులు వ్యవహరిస్తారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి లక్ష రూపాయలు ఖర్చు పెడుతోంది. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ గురుకులాలకు బాధ్యతలు తీసుకున్న తర్వాత సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.

232
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles