రాగి చెంబుతో మాయాజాలం

Thu,February 14, 2019 01:21 AM

లక్ష్మీదేవిపల్లి, ఫిబ్రవరి 13 : ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన రైస్‌పుల్లింగ్ వ్యవహారం మండల కేంద్రంలో బుధవారం వెలుగుచూసింది. రాగిచెంబుతో లక్షల రూపాయలు సంపాదించాలనే దురాశతో కొత్తగూడెం, విజయవాడ, బోడు, రేగళ్ల ప్రాంతాలకు చెందిన కొందరు రైస్‌పుల్లింగ్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారిని విచారణ నిర్వహించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ ఎస్‌ఎం ఆలీ ఆ వివరాలను వెల్లడించారు. కొత్తగూడానికి చెందిన భీమరాజు, కృష్ణ ప్రధాన సూత్రధారులని, వీరికి సహాయకులుగా శ్రీను, సుందర్‌లు ఉన్నారన్నారు. విజయవాడకు చెందిన గోవిందరాజు, టేకులపల్లి మండలం బోడు ప్రాంతానికి చెందిన వెంకటరావులు రాగిచెంబును కొనుగోలు చేయడానికి వచ్చారన్నారు. రేగళ్ల పరిసర ప్రాంతంలో రాగిచెంబు కొనుగోలుపై సమావేశం నిర్వహించారని, ఈ సమావేశం గురించి చుంచుపల్లి సీఐ కరుణాకర్‌కు సమాచారం అందగా, సుజాతనగర్ ఎస్సై వరుణ్, లక్ష్మీదేవిపల్లి సిబ్బంది రవి, కన్నయ్య, చందు, సుధీర్‌లు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారన్నారు. విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

రాగిచెంబు అడుగు భాగంలో అయస్కాంతం పొడిని చల్లి దానిపై ఎంసీల్‌తో సీల్ చేస్తారు. దీని వల్ల రాగి చెంబుకు అయస్కాంత తత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా కొన్ని వరి ధాన్యం గింజల్లో స్టాపిలర్ పిన్స్ చిన్న చిన్న ముక్కలు చేసి వాటిలో అమర్చడం వల్ల అవి ఈ రాగి చెంబులో ఉన్న అయస్కాంతానికి ఆకర్షించబడతాయి. ఇది చూపించి ఈ రాగి చెంబుకు మహిమలు ఉన్నాయని చెప్తూ ప్రజలను సులువుగా మోసం చేస్తున్నారు. ఇది చాలా పురాతనమైనదని, పంచలోహాలతో తయారుచేయబడిందని, అంతర్జాతీయంగా అమ్మితే కొన్ని వందల కోట్ల రూపాయలు వస్తాయని ఆశ చూపించి విక్రయిస్తున్నారు. భీమరాజు, కృష్ణ అనే వారు దీనిని తయారు చేస్తున్నారన్నారు. వీరంతా కలిసి పరిసర ప్రాంతాల్లో అమాయక ప్రజలకు చూపించి రాగిచెంబును విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు నమ్మవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇలాంటి వ్యసనాలకు బానిసలు కావొద్దని, రాగిచెంబులో ఎలాంటి మహిమలు ఉండవని, అదంతా మోసమన్నారు. సదరు ఆరుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని, వారి వద్ద నుంచి రూ.లక్షా 95వేలతో పాటు రాగిచెంబు, రైస్‌పుల్లింగ్‌కు వినియోగిస్తున్న వడ్ల గింజలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రైస్‌పుల్లింగ్ ఎలా చేస్తారనే విషయాన్ని విలేకరుల సమావేశంలో ఆయన అందరీ ఎదుట ప్రయోగాత్మకంగా చూపించారు.

284
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles