చెరువు శిఖానికి రెక్కలు..!

Thu,February 14, 2019 01:20 AM

-మార్చి అడ్డదారిన రిజిస్ట్రేషన్
-వేసి రూ.కోట్ల ఆస్తిని ఆక్రమించే ప్రయత్నం
-కోల్పోతున్న ఖానాపురం ఊరచెరువు
-ఆక్రమణను అడ్డుకుని హెచ్చరిక బోర్డు పెట్టిన ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు
-ఆక్రమణకు గురౌతున్న చెరువు శిఖం
రఘునాథపాలెం : ఖమ్మంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నగరానికి చుట్టుపక్కల ఏ మూలన కూసింత ప్రభుత్వ భూమి కన్పించిన కబ్జాదారులు కర్చిఫ్ పర్చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు గుడి, బడి, చెరువు, చెరువు, కుంట దేన్నీ వదలకుండా కాజేస్తున్నారు.
ఖమ్మంనగరం ఖానాపురం రెవిన్యూ సర్వే నెంబర్ 13లో గల ఊర చెరువు శిఖం ఒకప్పుడు విశాల ప్రాంగణంలో వందల ఎకరాల విస్తీర్ణాన్ని కలిగి నగర ప్రజలకు ఆహ్లాదవాతావరణాన్ని పంచుతూ ఉండేది. నగరానికి చుట్టు పక్కల ఇంత పెద్దచెరువు మరెక్కడా లేదని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సంబర పడిపోయేవారు. ప్రతి ఏటా వర్షాకాలంలో చెరువు నిండిపోయి అలలుపోస్తూ నీళ్లు ఇల్లెందు ప్రధాన రహదారిని తాకుతూ ఉండేవి. అటుగా వెళ్లే వాహనదారులు కాసేపు ఆగిమరీ చెరువు నీటి అలలను ఆస్వాదించేవారు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్సైంది.

ప్రస్తుతం ఖానాపురం చెరువును చూస్తే ఒకప్పుడు ఇల్లెందు ప్రధాన రహదానికి ఆనుకొని చెరువు ఉండేది అని చెప్పుకునే దుస్థితికి వచ్చింది. చెరువుకే నోరుంటే నన్ను ఆక్రమణదారుల భారి నుండి కాపండండీ.. మహాప్రభో..అని మొత్తుకునేదేమో...! వనరుల పరిరక్షణలో అధికారులు చూపిన నిర్లక్ష్య వైఖరి ఖానాపురం చెరువు దురాక్రమణ గురవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఖానాపురం చెరువు ఏడాదికేడాది కుసించుకుపోతున్నా అటుగా కన్నెత్తి చూసే అధికారి లేకుండా పోయాడంటే ఆశ్యర్యం. ఇప్పటికే చెరువు ఉత్తరభాగంలో ఎక్కువ మొత్తంగా శిఖం ఆక్రమణకు గురై గృహ నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడు ఇల్లెందు ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న రూ.కోట్ల విలువైన చెరువు శిఖంపై కన్నేసిన ఆక్రమణదారులు తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలతో పాగావేశారు. ఈ విషయంపై స్థానిక ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకవడం వల్ల క్రమేపీ ఖానాపురం చెరువు ఆనవాళ్లు లేకుండా పోయింది. ఫలితంగా చెరువు శిఖంపై కన్నేసిన భూ ఆక్రమణదారులు తప్పుడు పత్రాలతో వచ్చి కబ్జా చేసేస్తున్నారు.

దొడ్డి దారిన ప్లాట్లుగా మారుతున్న వైనం..
ఇల్లెందు ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఖానాపురం ఊర చెరువు శిఖం ప్లాట్లుగా మారిపోతోంది. శిఖం ఆక్రమణలో కబ్జాదారులు వ్యవరిస్తున్న తీరు అమ్మో..అనిపించేలా ఉంది. అయితే చెరువు ఖమ్మం నగరంలో ఉండటంతో ఆక్రమణను అడ్డుకునే ప్రయత్నాన్ని ఏ ఒక్కరూ చేయలేకపోతున్నట్లుగా తెలియవస్తోంది. ఆక్రమణతో మనకెందుకులే అని ఎవరికివారు బాధ్యతారాహిత్యంగా వ్యవరిస్తున్నట్లుగా ఉంది. ఫలితంగా చెరువే కదా అని ఆక్రమణదారులు శిఖంపై కన్నేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు గత కొద్ది నెలలుగా అక్రమించేందుకు అవసరమైన కార్యాచరణను సాగిస్తున్నారు. గతంలో చెరువును గ్రానైట్ మట్టితో పూడ్చేసి ఫెన్షింగ్ పనులను చేపట్టారు. నాడు చెరువు శిఖం ఆక్రమణకు గురౌతున్న విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు అడ్డుకొని హెచ్చరిక బోర్డును సైతం పెట్టారు. అయితే అధికారులు పెట్టిన బోర్డు ఒకటిరెండు రోజులే ధర్శనమిచ్చింది. ఆ తరువాత ఆక్రమణ దారులే హెచ్చరిక బోర్డును తొలించినట్లు స్థానికులు ఆరోపించారు.

హెచ్చరిక బోర్డు పెట్టినప్పటికీ..
అయితే గతంలో చెరువు ఆక్రమణ విషయం తెలుసుకున్న నాటి ఖమ్మం అర్బన్ తహసీల్దార్ మూడేళ్ల క్రితం స్థలంలో చెరువు శిఖాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలకు బాద్యులౌతారని తెలుపుతూ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఇక్కడ పని చేసి అర్భన్ తహసీల్దార్ బదిలీకావడం శిఖం కబ్జాదారులకు అందివచ్చిన అవకాశమైంది. దీంతో వారి అక్రమణను అడ్డుకునేవారు లేకపోవడంతో శిఖం తటాకం శిఖం కబ్జా సులువైంది. స్థలంలో రెవిన్యూ అధికారులు పెట్టిన హెచ్చరిక బోర్డు అక్కడ లేకుండా మాయం చేశారు. ఆక్రమణకు అడ్డులేదనుకుని భావించిన కబ్జాదారులు తమ కబ్జాపర్వాన్ని పునఃప్రారంబిచారు. అయితే శిఖం కబ్జా అంతటితోనే ఆగక పక్కనే మరికొంత స్థలాన్ని సైతం వేరొకరు పాగా వేసి తాజాగా జేసీబీ సహాయంతో ఆక్రమణకు పనులు ప్రారంభించారు. అంతేకాక అప్పుడప్పుడు ఆక్రమణదారుడు డోజర్ మిషన్‌ను తీసుకవచ్చి ప్లాటులో మట్టి లెవల్ పనులను చేపడుతున్నాడని స్థానికులు పేర్కొన్నారు. దీంతో పాటు వర్షం నీరు వచ్చేందుకు నిర్మించిన మోరీకి ఎదురుగా ఉన్న ప్లాటును మరో ఆక్రమణదారుడు ప్లాటు చదును పనులు చేపట్టినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఈ తంతు ఇలానే కొనసాగితే వందల ఎకరాల విస్తీర్ణాన్ని కలిగి ఖానాపురం చెరువు ఆనావాళ్లు లేకుండా కబ్జాకు గురౌతుందని చెరువు నీటిపై ఆధారపడిన బల్లేపల్లి, బాలప్పేట, పాండురంగాపురం, కైకొండాయిగూడెం, ఇండస్ట్రీయల్ ఏరియా, ప్రశాంతినగర్, బాలాజీనగర్ ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

368
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles