అంతర్ రాష్ట్ర చైన్‌స్నాచింగ్ ముఠా అరెస్టు

Wed,February 13, 2019 12:43 AM

ఖమ్మం క్రైం, ఫిబ్రవరి 12: వారిద్దరూ సొంత అన్నదమ్ములు. జల్సాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అప్పులు అయ్యాయి. చేసిన అప్పులు తీర్చలేక చోరీల పంథాను ఎంచుకున్నారు. వేరొకరితో కలిసి చోరీలకు పాల్పడితే వాటాల సందర్భంలో పొరపొచ్చాలు వచ్చి చోరీలు చేసిన విషయం బయటపడుతుదనుకున్నారో ఏమో.. కేవలం వారిద్దరే ఒక ముఠాగా ఏర్పడి పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతూ వరుస చోరీలకు తెగబడ్డారు. కేవలం 8 నెలల కాలంలోనే ఏకంగా 44 వరుస చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ చెలరేగిపోతూ జిల్లా పోలీసులకు సవాల్‌గా మారారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్.. చైన్‌స్నాచింగ్‌లపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ కొందరు సిబ్బందిని నియమించి చైన్‌స్నాచర్లను పట్టుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీసీఎస్, రూరల్ పోలీసులు మంగళవారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టగా ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.

వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలలోని అనేక జిల్లాలో 44 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డామని నిందితులు అంగీకరించినట్లు సీపీ తఫ్సీర్ ఇక్బాల్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన మొండితోక వీరయ్య, మొండితోక ఏసోబు సొంత అన్నదమ్ములు. వీరు ముఠాగా ఏర్పడి వివిధ మారుమూల గ్రామాలలో, పట్టణాలలో ద్విచక్రవాహనాలపై తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకొని వారి మెడలలో ఉన్న బంగారు పుస్తెల తాడులను బలవంతంగా తెంపుకొని వెళ్ళేవారు బాధితుల ఫిర్యాదు మేరకు వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేసుకొని నిందితులకు కోసం గాలించగా మంగళవారం అనూహ్యంగా వారు పట్టుబడ్డారు.

వీరి వద్ద నుంచి సుమారు రూ.32 లక్షల విలువ చేసే ఒక కేజీ 65 గ్రాముల బంగారు ఆభరణాలను, చైన్‌స్నాచింగ్‌లకు ఉపయోగించే రెండు మోటార్‌సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. వీరు ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చోరీలు, ఖమ్మం టూటౌన్ పరిధిలో ఆరు చోరీలు, ఖమ్మం రూరల్ పరిధిలో ఏడు చోరీలు, ఖమ్మం అర్భన్ పరిధిలో ఒక చోరీ, ముదిగొండలో రెండు చోరీలు, తిరుమలాయపాలెంలో ఒక చోరీ, నేలకొండపల్లిలో ఒక చోరీ, చింతకానిలో 3 చోరీలు, వైరాలో రెండు చోరీలు, రఘునాథపాలెంలో ఒక చోరీ, కొణిజర్లలో 3 చోరీలు, మధిరలో ఒక చోరీ, ఏపీలోని కృష్ణా జిల్లా వత్సవాయిలో మూడు చోరీలు, చిల్లకల్లులో మూడు చోరీలు, కోదాడ రూరల్ పరిధిలో మూడు చోరీలు కలిపి మొత్తం 44 చోరీలకు పాల్పడ్డారని సీపీ వివరించారు.

ఇద్దరిపైనా పీడీ యాక్ట్ నమోదుచేస్తాం
-సీపీ తఫ్సీర్ ఇక్బాల్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారిన వీరిపై పీడీ యాక్ట్‌ను నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న సీసీఎస్ ఏసీపీ రహమాన్, సీఐలు వసంతరావు, వేణుమాధవ్, 12 మంది కానిస్టేబుళ్ళకు సీపీ రూ.లక్ష క్యాష్ రివార్డులను, ప్రశంసాపత్రాలను అందించి అభినందించారు. ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి డాక్టర్ వినీత్, అడిషనల్ డీసీపీ దాసరి మురళీధర్, ఏసీపీలు ఘంటా వెంకట్రావు, ఎస్‌బీ ఏసీపీ సత్యనారాయణ, రామోజీ రమేష్, ప్రసన్నకుమార్, సీఐలు బరుపాటి రమేష్, రావుల నరేందర్, మహ్మద్ అబ్దుల్ షుకూర్, సాయిరమణ, రూరల్ సీఐ రమేష్, ఎస్సైలు పాల్గొన్నారు.

266
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles