ఖమ్మం క్రైం, జనవరి 19 : గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ఉద్యోగ విరమణపొందిన హోంగార్డులు ఎస్ సైదులు(కంపెనీ కమాండర్), పీ సత్యనారాయణలకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల 20వేల రూపాయల చెక్కును శనివారం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ చేతుల మీదుగా అందజేశారు. హోంగార్డుల ఒక్కరోజు జీతం నుండి ఈ మొత్తాన్ని పదవీ విరమణ పొందిన హోంగార్డుల అసోసియేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. సుదీర్ఘకాలంగా వివిధ విభాగాల్లో బాధ్యతగా విధులు నిర్వహించి పోలీస్ శాఖలో ఎనలేని సేవలు చేసి అధికారుల మన్ననలు పొందారని సీపీ వారి సేవలను కొనియాడారు. రిటైర్ తమ వృత్తికే కానీ, తమ వ్యక్తిత్వానికి కాదన్నారు. మీ విధి నిర్వాహణకు తోడ్పాటును అందించిన భార్యా, పిల్లలు అభినందనీయులన్నారు. పదవీ విరమణ చేసిన వారు తమ కుటుంబసభ్యులతో భావి జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. మీకు ఎటువంటి సమస్య వచ్చిన నన్ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి డాక్టర్ వినీత్, అడిషనల్ డీసీపీ ఏఆర్ శ్యాం సుందర్, ఆర్ హోంగార్డు అసోసియేషన్ సభ్యులు ఈ వెంకటేశ్వర్లు, కంపెనీ కమాండర్ డి రవి, సుదాకర్, రఫీ, రమేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.