పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం

Thu,January 17, 2019 11:55 PM

ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 17 : రాబోయే మార్చిలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖాధికారులు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలుపరుస్తున్నారు. ఈ తరుణంలో సాయంత్రం 6గంటల వరకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం నుంచి సాయంత్రం అదనపు తరగతుల వరకు చాలాసమయం ఉండటంతో అలసిపోతారు. ప్రత్యేక తరగతుల్లో పాల్గొనే విద్యార్థులకు ఆకలికాకుండా అల్పాహారం అందించనున్నారు. ఇందుకు సంబంధించి రూ.24 లక్షలు మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నేడోరేపో అధికారికంగా ఉత్తర్వులు రానున్నాయి.

ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థులకు...
జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందజేయనున్నారు. దీనికి సంబంధించిన నిధులు మంజూరుకానున్నాయి. ఏడు ఎయిడెడ్ స్కూల్స్‌లో 86మంది, 21 ప్రభుత్వ స్కూల్స్‌లో 1361మంది, రెండు మోడల్ స్కూల్స్‌లో186మంది, జిల్లా పరిషత్ 188 స్కూల్స్‌లో 7175మంది విద్యార్థులున్నారు. వీరికి సాయంత్రం సమయంలో అల్పాహారం అందించనున్నారు. ఉదయం సైతం విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచే అదనపు తరగతులు ఉండటంతో ఆ సమయంలో అల్పాహారం అందించనున్నారు.

రూ.7 కేటాయింపు...
ఉదయం, సాయంత్రం అదనపు తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు రోజుకు రూ.7 కేటాయించనున్నారు. నాణ్యమైన, బలవర్ధకమైన అల్పాహారం అందించేందుకు ఈ నిధులు వినియోగిస్తారు. ఆకలితో ఉంటే చదువుపై దృష్టి సారించే అవకాశం ఉండదని ఆ సమయంలో ఆకలి తెలియకుండా ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించి ఆకలి తీర్చనున్నారు. రోజుకు రూ.7 చొప్పున 42రోజుల పాటు అల్పాహారం అందించనున్నారు. రూ. 24 లక్షలను విడుదల చేసేందుకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ప్రధానోపాధ్యాయుల సమీక్షలో సైతం విద్యార్థులకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి లోటురాకుండా చూడాలని ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని సైతం స్పష్టంచేశారు.

470
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles