సంబురాల సంక్రాంతి...

Thu,January 17, 2019 01:44 AM

-ఆనందోత్సాహాలతో పర్వదినం
-భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
-స్తంభాద్రి ఆలయంలో గోదా కల్యాణం
ఖమ్మం కల్చరల్: తెనుగింటి ముంగిళ్లలో రంగురంగుల ముత్యాల ముగ్గులు.. ఆకాశంలో ఎగిరిన గాలిపతంగులు.. మైమరిపించిన హరిదాసు కీర్తనలు.. తెనుగింటి సంప్రదాయానికి ప్రతీకగా సంప్రదాయ వస్త్రధారణలు.. వండిన కొత్త చక్కెర పొంగలి, పరమాన్నం.. ప్రాచీన కళకు అద్దంపట్టే గంగిరెద్దుల విన్యాసాలు.. నోరూరించే చకినాలు, బొబ్బట్లు, అప్పాలు, కారప్పూస, పులిహోరల ఘుమఘమలు.. బంధుమిత్రుల కోలాహలం.. ఆలయాల్లో విశేష పూజలు, అర్చనలు.. వెరసి జిల్లా అంతటా సంక్రాంతి సందడితో ఆనందం వెల్లివిరిసింది. ఆనందం, ఆధ్యాత్మికం.. శాస్త్రీయతల మేళవింపుగా సంక్రాంతి పండుగ నూతనశోభను తెచ్చిపెట్టింది. జిల్లాలోని పలు శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లాలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లి, కూసుమంచి, వైరా, ముదిగొండ కేంద్రాలతో పాటు వాడవాడలా పండుగ శోభ సంతరించుకుంది. భక్తులు ఆలయాలకు తరలివెళ్లి తమతమ ఇష్టదైవాలను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యక్షదైవం సూర్య భగవానుడు మంగళవారం మకర రాశిలోకి ప్రవేశించిడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణమే సంక్రాంతి పండుగగా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. సంక్రాంతి పండుగకు ముందు వచ్చే భోగి పండుగను సోమవారం వైభవంగా నిర్వహించుకోగా, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగలను సంతోషాలతో జరుపుకున్నారు.

ప్రతీ ఒక్కరు తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులతో పండుగ ఆనందాన్ని పంచుకునారు. ఈ సందర్భంగా వాడవాడలా పలు సంస్థలు నిర్వహించిన ముగ్గుల పోటీలు నూతన శోభను తెచ్చిపెట్టాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వైష్ణవాలయాల్లో గోదా రంగనాథుల కల్యాణం కమనీయంగా జరిగింది. బ్రహ్మీముహూర్తాన పవిత్ర స్నానాలు ఆచరించి, వాకిట్లలో సూర్య రథంతో రంగురంగుల రంగవల్లులను వేసి, ఇండ్లను మామిడి తోరణాలతో అలంకరించారు. తమతమ ఇష్ట దైవాలను దీపారాధనలతో పూజించారు. కుటుంబసభ్యులు తమ తమ బంధుమిత్రులతో కలిసి రుచికరమైన వంటకాలను ఆరగించి ఆనందోత్సాహాలతో గడిపారు. తమతమ ఇండ్లలో బొమ్మల కొలువులు నిర్వహించి, ముత్తైదువులు పేరంటాలలో వాయనాలను ఇచ్చిపుచ్చుకున్నారు. దేవతల పగటి కాలంగా చెప్పుకునే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య భగవానుడిని ఆరాధించి, లోకబాంధవుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వ్యవసాయ ప్రధానమైన కనుమ పండుగ నాడు రైతులు వ్యవసాయ పనిముట్లు, పశువులకు పసుపు కుంకుమలతో అలంకరించి పూజలుచేశారు.

పాడిపంటలను తెచ్చిపెట్టే పశువులను రైతులు నూతన వస్ర్తాలు, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజలు చేశారు. సంక్రాంతి, కనుమ పండుగలను మంగళ, బుధవారాల్లో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్నాపెద్దా అందరూ పతంగుల ఎగురవేతలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని స్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.. నెలరోజుల పాటు ఆండాళ్ తల్లి తిరుప్పావై వ్రతాన్ని నిష్టతో ఆచరించి రంగనాథుడిని పరిణయమాడే కమనీయ ఘట్టాన్ని ఆలయంలో ప్రధాన అర్చకుడు నరహరి నర్సింహాచార్యుల బృందం అత్యంత శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు, భక్త బృందం ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించిన గోదా రంగానథుల కల్యాణం భక్తులను తరింపజేసింది.

345
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles