ఇంటింటా సంక్రాంతి కళ..

Sun,January 13, 2019 01:45 AM

-రేపు భోగభాగ్యాల భోగి..
-15న మకర సంక్రాంతి..
-గంగిరెద్దులు.. పతంగులు.. రంగవల్లులతో సంబురాలు
-ఖమ్మంలో నేడు కైట్స్, ఫుడ్ ఫెస్టివల్..
ఖమ్మం కల్చరల్/భద్రాచలం టౌన్: సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర శుభ ఘడియలకు సిద్ధమవడమే భోగి పండుగ.. చెడును తగులబెట్టి మంచిని ఆహ్వానించడమే ఈ పండుగలోని అంతరార్థం. సంక్రాంతి పర్వం ముందురోజు వచ్చే పండుగ కనుకు దీనిని భోగి పండుగగా చెబుతారు. హేమంతపు వణికించే చలిలో.. నులివెచ్చని భోగి మంటలు శరీరానికి, మనసుకు సేదతీరుస్తాయి.. పుష్య బహుళ త్రయోదశి రేపు సోమవారం భోగి పండుగను జరుపుకునేందుకు జిల్లావ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. మూడురోజుల సంక్రాంతి పర్వదినాల్లో భాగంగా మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ పండుగలను జరుపుకోనున్నారు. సోమవారం రాత్రి గం.1.19లకు తెల్లవారితే మంగళవారం సూర్యుడు మకర సంక్రమణం చెందనుండటంతో మంగళవారం 15న మకర సంక్రాంతి పర్వం, 16న కనుమ పండుగను జరుపుకోనున్నారు. దక్షిణాయాన్ని సాగనంపి, ఉత్తరాయణంలోకి కాలగతిని ప్రవేశపెట్టడానికి సన్నద్ధం చేసే మహత్తర పర్వం భోగి.. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ద్వాంక్ష నామధేయుడై ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు నింపనున్నాడు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు మార్మోగనున్నాయి.. రంగవల్లుల పోటీలతో వాడలు, వీధులన్నీ రంగులమయం కానున్నాయి.

భోగ భాగ్యాల భోగి.. సంక్రాంతి.. కనుమ..
భోగ్యమంటే సుఖం, ధనం, ధాన్యం, రక్షణ.. ఆ విధంగా లభించిన భోగ్యాలను అనుభవించేవాడు భోగి.. ఆరోగ్యం, ఆయువు, శాంతి, ఆనందం కలగడానికి భోగి పండుగను జరుపుకుంటారు. దక్షిణయానంలో చేసిన పాపాలన్నీ గుట్టగా పోసి కాలపెడితే, పుణ్యకాలమైన ఉత్తరాయణం మంచి జీవితం ఇస్తుందని నమ్మకం. పాత వ్యవస్థలోని చెడును మంటల్లో కాల్చి, సజీవతత్వాన్ని గ్రహించి, గుణాత్మక పరివర్తనం చేయడమే భోగి మంటలు.. ఈ రోజున ఉదయమే ఇళ్లముందు, కూడళ్లలో మంటలు పెట్టి పాత వస్తువులను అంందులో కాల్చి బూడిద చేస్తారు. ఈ మంటల్లో పాత వస్తువులను కాల్చి, చెడును వదిలించుకుని మంచికి శ్రీకారం చుట్టనున్నారు. ఇండ్లను మామిడితోరణాలతో అలంకరించి, వాకిట్లో సప్తవర్ణాల్లో రథాల ముగ్గులు పెటి,్ట వాటిలో గొబ్బెమ్మలను ఏర్పాటు చేసి సూర్యుడిని మకర రాశిలోకి ఆహ్వానిస్తారు. భోగి రోజున పిల్లలకు రేగిపళ్లు పోసి పెద్దలు ఆశీర్వదిస్తారు.

శాస్త్రీయంగా, ఆధ్యాత్మికతకు ప్రతీకగా ఉండే రేగిపళ్లను నాణేలు, చెరుకు ముక్కలతో కలిపి చిన్నారులకు శాస్త్రోక్తంగా తలపైనుంచి పోసి ఆశీర్వదిస్తారు. సంక్రమణానికి ముందు పిల్లల పొట్టలో వికారాలు లేకుండా ఉండటానికి నువ్వులతో తయారు చేసిన చకిలాలు, అరిసెలు ఆరగింపజేస్తారు. బొమ్మల కొలువులు, పేరంటాలు నిర్వహించి మహిళలు వాయనాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. నెలరోజుల నుంచి పవిత్రంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన భక్తులు, రంగనాథ స్వామికి ప్రతి రోజు చక్కెర పొంగళిని నైవేధ్యాలుగా పెట్టారు. పవిత్ర ధనుర్మాస మహోత్సవంలో ఆండాళ్ తల్లి తిరుప్పావై వ్రతాన్ని ముగించుకోవడంతో భోగి పండుగ రోజున అన్ని వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణం కమనీయంగా జరుగనుంది. హరిదాసులు భగవన్నామ సంకీర్తనలతో సంచరిస్తారు. పిల్లలు గాలి పటాలతో ఆనంద కేళీ చేస్తారు. ఆడపిల్లలు గోరింటాకులు, పట్టువస్ర్తాలతో సంప్రదాయంగా పండుగకు ప్రతిబింబంగా ముస్తాబవుతారు. ఈ పండుగకు పరమాన్నంతో పాటు ప్రతి ఇంటా నోరూరించే పిండి వంటలు ఘుమఘులాడుతాయి.

రైతన్నల పండుగ కనుమ..
సంక్రాంతి వ్యవసాయ ప్రధానమైన పండుగ. ఇది రైతుల జీవన విధానంతో ముడిపడి ఉంది. రైతన్న ప్రకృతిలోని సుఖ దుఃఖాలను పొందుతాడు. పంట వేసి, కలుపు తీసి, కోత కోసి, ధాన్యం ఇంటికి రాగానే ఆనంద పరవశం చెందుతాడు. వరి, కందులు, పెసలు, బొబ్బెర్లు, ఇతర మెట్టపంటల దిగుబడులతో ధాన్యరాశులు ఇండ్లల్లో తులతూగుతాయి.. ఈ సందర్భమే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు.. వీటిని జిల్లా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు.

ఖమ్మంలో నేడు పతంగులు, ఆహార పండుగులు..
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో లకారం ట్యాంక్ కైట్, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నారు. హైద్రాబాద్ కోహినూర్ కైట్ క్లబ్ సభ్యులు ఈ సంబురానికి హాజరై రకరకాల భారీ పతంగులను ఎగురవేయనున్నారు. వీరితో పాటు అనేక మంది పతంగులను ఎగురవేసి సందడి చేయనున్నారు. అదేవిధంగా ట్యాంక్ 30 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసి తెలంగాణ రుచులను ప్రదర్శించనున్నారు. అడ్వెంచర్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ పర్యవేక్షణలోపర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఖిల్లాపై రాక్ ైక్లెంబింగ్ నిర్వహించనున్నారు. ఖిల్లాపై పతంగుల పతాకాలు, రాక్ ైక్లెంబింగ్ సంక్రాంతి పండుగ సంబురాలు అంబరాన్నంటనున్నాయి.

547
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles