భద్రాద్రిలో ఘనంగా కూడారై ఉత్సవం

Sat,January 12, 2019 01:59 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ జనవరి11: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాలలో భాగంగా 27వ రోజు శుక్రవారం కూడారై ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గోదా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. తిరుప్పావై, తిరుపల్లేచి అనే ద్రవిడ ప్రబంధాలను నివేదన సమయంలో అనుసంధానం చేశారు. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథునితో తన వివాహం జరిగితే 108 గంగాళాలతో పాయస్నానం నివేదన చేస్తానని సుందర భూస్వామికి మొక్కుకుంటుంది. ఈ సమయంలో అమ్మవారితో శ్రీరంగనాథుని కళ్యాణం జరగడం, ఆయనలో ఐక్యం కావడం జరిగిందని ప్రతీతి. ఈ క్రమంలో రామానుజుల వారు అమ్మవారి మొక్కులను భక్తి ప్రపత్తులతో తీర్చుతారు. ఏటా ధనుర్మాస మహోత్సవాల సమయంలో కూడారై ఉత్సవాన్ని అమ్మవారిని స్మరించుకుంటూ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా రామాలయంలో 108 గంగాళాలతో పాయస్నానం అమ్మవారికి ఎదురుగా ఏర్పాటు చేసి నివేదన గావించారు. ఈ సమయంలో మహిళా ముత్తుదువులకు గోదాదేవి ప్రతిమలు ఇచ్చి షోడషోపోచారాలతో శ్రీకృష్ణగోద అష్టోత్తరాన్ని భక్తిప్రపత్తులతో పఠించారు. చివరిగా కూడారై అనే పాశురాన్ని నక్షత్ర హారతితో నీరాజనం ఇస్తుండగా పఠించారు. ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్ పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్, స్థానాచార్యులు స్థలసాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాధి విజయరాఘవన్, గోపాలకృష్ణమాచార్యులు, ముఖ్య అర్చకులు అమరవాది శ్రీనివాస రామానుజం తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీసీతారామచంద్రస్వామివారికి శుక్రవారం స్వర్ణకవచలాంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

353
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles