క్లీనర్‌నంటూ వచ్చారు.. సొత్తు దోచుకెళ్లారు..

Sun,November 18, 2018 02:02 AM

-వీ వెంకటాయపాలెంలో ఆర్ధరాత్రి చోరీ
-కత్తులతో వచ్చి బెదిరించిన ముగ్గురు వ్యక్తులు
l ఇంటి దొంగ పనే అని అనుమానిస్తున్న పోలీసులు
-చోరీ స్థలాన్ని పరిశీలించిన రూరల్ ఏసీపీ రామోజు రమేష్
రఘునాథపాలెం, నవంబర్17: ఆ ఇంట్లో తల్లీకొడుకే ఉన్నారు. అర్ధరాత్రి ఇద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి 12.30గంటల సమయం. ఇంటి కాలింగ్ బెల్ ఏకదాటిగా మోగుతూనే ఉంది. నిద్రలోంచి మేల్కొన్న తల్లి ఎవరూ.. అంటూ తలుపు తీయకుండానే అనుమానంతో అడిగింది. స్పందించిన బయటి వ్యక్తి క్లీనర్‌ని మేడం తలుపుతీయమంటూ అడిగాడు. ఈ సమయంలో పనేంటీ అనడిగితే సారు పంపించారు అంటూ బదులిచ్చాడు. నిజంగానే క్లీనర్‌గా భావించి తలుపు తీసిన క్షణాల్లోనే ముగ్గురు వ్యక్తులు కత్తులు పట్టుకొని ఇంట్లోకి ప్రవేశించి అరిస్తే చంపేస్తామంటూ ఆ మహిళ మెడపై కత్తి పెట్టి బెదిరించారు. ఇంట్లో నిద్రిస్తున్న కొడుకూ లేవడంతో అతడి మెడపైనా మరో వ్యక్తి కత్తి ఎక్కుపెట్టి కదలకుండా చేశాడు. మూడో వ్యక్తి ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడుంటాయో కచ్ఛితంగా తెలుసన్నట్లు చకచకా శోధించి కాసేపట్లోనే వచ్చిన పని ముగించుకొని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం గ్రామ పరిధి వందనం రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్సై రాసూరి కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..

మండలంలోని వీ వెంకటాయపాలెంకు చెందిన ధరావత్ నాగేశ్వరరావు లారీ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. కాగా ఇటీవలె వందనం రోడ్డులో ఏకాంత ప్రదేశంలో నూతన ఇంటిని నిర్మించుకొని కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. రెండురోజుల క్రితమే లారీ విధులకు వెళ్లాడు. ఇంట్లో నాగేశ్వరరావు భార్య శాంతి, రెండో కుమారుడు శివాజీ ఉన్నారు. కాగా శుక్రవారం తల్లీ కొడుకులు నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో స్పందించిన శాంతి ఎవరూ.. అని ప్రశ్నించడంతో బయటి వ్యక్తి క్లీనర్‌ని.. సారు పంపారు.. అంటూ సమాధానం ఇవ్వడంతో వెంటనే తలుపు తెరిచింది. ఒక్కసారిగా ఆ ముగ్గురు వ్యక్తులు కత్తులను తల్లీ కొడుకులు శాంతి, శివాజీల మెడపై పెట్టి ఇంట్లో ఉన్న బంగారం, నగదు తెచ్చి ఇవ్వాలంటూ బెదిరించారు. అనంతరం ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడుంటాయో ఎవరో చెప్పినట్లు అక్కడే వెతికి లభించిన 8తులాల బంగారు వస్తువులను పట్టుకొని ఉడాయించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే వచ్చిన ముగ్గురిలో ఓ వ్యక్తి క్లీనర్‌గా పని కోసం వచ్చి శుక్రవారం మధ్యాహ్నం తమ ఇంట్లో భోజనం చేశాడని ఇంటి యజమానురాలు శాంతి చెప్పినట్లు ఎస్సై తెలిపాడు. జరిగిన తీరును బట్టి పక్కాగా ఇంటి దొంగ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్ స్కాడ్, క్లూస్ టీం సహాయంతో పోలీసులు చోరులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఖమ్మం రూరల్ ఏసీపీ రామోజు రమేష్, సీఐ దోమల రమేష్ చోరీ జరిగిన ఇంటి వద్దకు చేరుకొని కుటుంబసభ్యుల ద్వారా చోరీ తీరుపై ఆరా తీశారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

248
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles