యువనేత రాకతో గులాబీలో జోష్..


Fri,November 16, 2018 12:23 AM

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: యువనేత, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ సత్తుపల్లి రాకతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. బుధవారం సత్తుపల్లిలో జరిగిన ర్యాలీకి అశేష జనవాహిని హాజరై పిడమర్తి రవిని ఆశీర్వదించింది. సత్తుపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉద్యమకారుడు పిడమర్తి రవి పోటీచేస్తారని కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గెలుపు బాధ్యతను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నియోజకవర్గ కేడర్‌కు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదే టికెట్‌ను ఆశించిన దిశా జిల్లా కమిటీ సభ్యుడు డా. మట్టా దయానంద్‌ను కేసీఆర్, కేటీఆర్‌లు రెండుసార్లు హైదరాబాద్ పిలిపించి బుజ్జగించడంతో ఆయన కూడా పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించి పిడమర్తికి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దయానంద్‌లు ప్రచారంలో పాల్గొంటున్నారు.

మంత్రి తుమ్మల నియోజకవర్గ బాధ్యతలను డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబుకు అప్పగించడంతో ఆయన నియోజకవర్గంలోని అన్నివర్గాలు, కేడర్‌ను కలుపుకుని ముందుకు సాగుతున్నారు. మాజీ మంత్రి జలగం ప్రసాదరావు కూడా ఇటీవల పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో మరింత జోష్ పెరిగింది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పట్టున్న జలగం కుటుంబ అభిమానులు, శ్రేయోభిలాషులు పిడమర్తికి మద్దతు ప్రకటించారు. ఓ పక్క తుమ్మల, పొంగులేటి, జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావు, మువ్వా విజయ్‌బాబు, మట్టా దయానంద్‌లు పిడమర్తికి బాసటగా నిలిచి గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఎవరికి వారు తమ కేడర్‌ను సమాయత్తం చేసి పిడమర్తి రవిని గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సత్తుపల్లి సీటును కానుకగా ఇవ్వాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.

కేటీఆర్ సభతో పెరిగిన ఉత్సాహం..
మంత్రి కేటీఆర్ బుధవారం సత్తుపల్లిలో జరిగిన ర్యాలీ, బహిరంగసభలో పాల్గొని కేడర్‌లో ఉత్సాహాన్ని నింపారు. కేటీఆర్ సభకు 20వేల మందికి పైగా ప్రజలు హాజరుకాగా, సత్తుపల్లి పట్టణం అంతా గులాబీ మయమైంది. దీంతో కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ పెరిగి పిడమర్తి రవి గెలుపు ధీమా పెంచింది. ఏదేమైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఓవైపు, అగ్రననాయకుల ప్రచారం మరోవైపు ఉండటంతో పిడమర్తి గెలుపు ఖాయమనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. మహాకూటమి అభ్యర్థి సండ్ర ప్రచారంలో ఏమాత్రం పిడమర్తిని అందుకోలేక వెనుకబడి పోయారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించిన పిడమర్తి మరోమారు పర్యటనలకు సిద్ధమవుతున్నారు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...