పొత్తుల్.. కత్తుల్..

Wed,September 12, 2018 01:43 AM

-ఎన్నికల పొత్తులతో విపక్షాల్లో గందరగోళం
-కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ శ్రేణుల్లో రాజుకున్న అగ్గి
-అధిష్టానం వద్ద ఘొల్లుమంటున్న హస్తం ఆశావహులు
-మూడు సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న సీపీఐ
-సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలంపై సైకిల్ కిరికిరి
-సీట్ల పంపకాలు జరిగితే కాంగ్రెస్‌కు మిగిలేది బూడిదే
-కీలక నాయకులంతా జాతీయ పార్టీని వీడే అవకాశం
-టీఆర్‌ఎస్‌కు కలిసొస్తుందంటున్న రాజకీయ విశ్లేషకులు
ఖమ్మం, నమస్తే తెలంగాణ:ఇంటి పార్టీని ఎదుర్కొనేందుకు అలయ్ బలయ్ అంటున్నరు. సిద్ధాంతాలకు తిలోదకాలిస్తున్నరు. విధానాలకు పాతరేస్తున్నరు. నాయకుల, కార్యకర్తల మనోభావాలను తుంగలో తొక్కాలని చూస్తున్నరు. త్వరలోనే రాబోతున్న సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ ఒంటరిగా బరిలోకి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అధికారం కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీతో అంట కాగేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీంతోపాటు వామపక్షాల్లో ఒకటైన సీపీఐతో సైతం సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు అంగీకారానికి వచ్చింది. తద్వారా దాదాపు 130 ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ.. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు దశాబ్ధాల తరబడి భుజాలు కాయలు కాసేలా జెండాలను మోసిన సొంత నాయకులను వెన్నుపోటు పొడిచేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. కష్టకాలంలోనూ మూడు రంగుల జెండాలనే నమ్ముకున్న కార్యకర్తల మనోభావాలను కించపరిచేందుకు సమాయత్తం అయ్యింది. కాగా.. వచ్చే సాధారణ ఎన్నికల్లో పొత్తులు కాంగ్రెస్‌లో కుంపటి రాజేయగా.. దానికి సహకరించే పార్టీల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నది. మూడు పార్టీల శ్రేణులు ఒకరంటే మరొకరు కత్తులు దూసుకుంటున్నరు.

రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకూ అభ్యర్థులను అందరికంటే ముందు ప్రకటించారు. ఒకరిద్దరు అభ్యంతరం తెలిపినప్పటికీ నేరుగా రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్ అసమ్మతి వాదులను దారిలోకి తీసుకువస్తున్నరు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విషయానికి వస్తే అధిష్టానం టిక్కెట్ ఎవరికి ఇస్తుందో, ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో అన్న సందిగ్ధత నెలకొంది. దీనికితోడు టీడీపీ, సీపీఐతో పొత్తు అంటేనే హస్తం నేతలు భగ్గుమంటున్నరు. వాస్తవికతకు వస్తే తెలంగాణ ఏర్పాటుకు పూర్వం కాంగ్రెస్, టీడీపీల మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. జిల్లాలో సైతం అదే వైఖరి నెలకొంది. అనేక సందర్భాల్లో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలకు జరిగిన ఘర్షణల్లో సర్వస్వం పోగొట్టుకున్న సందర్భాలూ కోకొల్లలు. తెలంగాణ ఏర్పడి, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఓట్లు, సీట్ల కోసం అవే ఇరు పార్టీలు పాత ముచ్చట్లు మరిచిపోయి చేస్తున్న అలయ్ బలయ్ జెండాలు మోసిన వారికి మింగుడుపడటం లేదు. కాంగ్రెస్, టీడీపీలతో సీపీఐ పార్టీది కూడా అదే పరిస్థితి. ఆయా పార్టీలు అధికారంలో ఉన్నంతసేపు ప్రజావ్యతిరేక విధానాలు అని విమర్శలు చేసిన కమ్యునిస్టులు సీట్ల కోసమే సర్ధుబాటు అంటుండటం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది.

హస్తం ఆశావహుల్లో అలజడి..

ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లు. వాటిల్లో మూడు జనరల్, రెండు ఎస్సీ, మిగతా ఐదు ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న టీఆర్‌ఎస్‌లో ఎలాంటి గందరగోళం లేదు. కానీ కాంగ్రెస్‌లో కుంపటి రాజేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎన్నికల పొత్తులు, సీట్ల సర్ధుబాటు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న హస్తం ఆశావహులు టీడీపీ, సీపీఐతో పొత్తు అక్కర్లేదని గగ్గోలు పెడుతున్నరు. నేరుగా ఢిల్లీకి వెళ్లి పొత్తులపై ఫిర్యాదు చేశారు. మంగళవారం కొత్తగూడెం పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ వెళ్లి గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగటం కాంగ్రెస్‌లో సార్వత్రిక ఎన్నికల సెగకు అద్దం పడుతున్నది. ఏఐసీసీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చి పొత్తులు కుదిరితే సీపీఐ ఖమ్మం, వైరా, కొత్తగూడెం సీట్లను కోరుతున్నది. గతంలో వైరా, కొత్తగూడెం సెగ్మెంట్లలో ఆ పార్టీ గెలిచినందున ఈదఫా కూడా వాటిపై గట్టి పట్టుపడుతున్నది. అధిష్టానం నిర్ణయానికి తలొగ్గితే కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ ఆశావహులు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, వైరా నేతలు లావుడ్యా రాములునాయక్, బాణోత్ మంగీలాల్, బదావత్ సైదులు నాయక్ తదితరులకు మొండిచేయి తప్పదు.

నాలుగు సెగ్మెంట్లలో సైకిల్ కిరికిరి..

సార్వత్రిక సమరంలో విధానాలకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్‌తో జట్టు కట్టాలని భావిస్తున్న టీడీపీ సైతం ఉమ్మడి జిల్లాలోని ఐదు స్థానాలపై కన్నేసినట్లు సమాచారం. ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు, అశ్వరావుపేట, భద్రాచలం సెగ్మెంట్లలో బలంగా ఉన్నామని, ఆయా స్థానాలను తమకు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌తో సీట్ల సర్ధుబాటు విషయానికి వస్తే టీడీపీలో ముఖ్య నాయకులుగా కొనసాగుతున్న మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోసం ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలు కావాలని పట్టుపట్టనుంది. దీంతో హస్తం పార్టీ తరుపున సత్తుపల్లి నుంచి క్రితంసారి పోటీచేసి ఓడిన మాజీ మంత్రి సంభానీ చంద్రశేఖర్‌కు ఎసరు పెట్టినట్లే. అశ్వరావుపేట, పినపాక, భద్రాచలం, ఇల్లెందు సెగ్మెంట్లలోనూ ఎన్నికల పొత్తులు మూడు పార్టీల శ్రేణుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించ బోతున్నాయనే వ్యాక్యలు వినిపిస్తున్నవి. దీంతో హస్తం నేతలు ఎవరికి వారే నేరుగా ఢిల్లీ, హైదరాబాద్‌కు వెళ్లి బలప్రదర్శన చేస్తున్నరు. పొత్తుల పేరుతో వచ్చే ఎన్నికల్లో తమ గొంతుకలు కోయవద్దని, అన్యాయం చేయవద్దని అధిష్టానం వద్ద గోడు వెల్లబోసుకుంటున్నరు.

కాంగ్రెస్‌కు మిగిలేది బూడిదే..

వచ్చే సాధారణ ఎన్నికల్లో పొత్తులు ఎవరికి నష్టం, మరెవరికి లాభం..? ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో సర్వత్రా కొనసాగుతున్న చర్చ. ఎలాగైనా అధికార పీఠం ఎక్కాలనే కాంక్షతో రగిలిపోతున్న కాంగ్రెస్, ఇంతకాలం తనకు అండగా నిలబడిన నాయకత్వాన్ని, కార్యకర్తలను ఫణంగా పెట్టి ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తోంది. ఈ విధానం కాంగ్రెస్‌కు ఎంతమేర లాభం చేకూర్చుతుంది..? అంటే నష్టమే అంటున్నరు రాజకీయ విశ్లేషకులు. ఉభయ జిల్లాల పరిధిలోని మొత్తం పది అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో రెండు సీపీఐకు (ఒకటి జరనల్, మరొకటి ఎస్టీ), మరో రెండు లేదా మూడు టీడీపీకి (రెండు జనరల్, ఒకటి రిజర్వుడ్) కేటాయిస్తే మిగిలేవి ఐదు స్థానాలు మాత్రమే. వాటిల్లో కాంగ్రెస్ ఎన్నింట్లో గెలుస్తుందో ఆ పార్టీ అధిష్టానం, లేదా నాయకత్వానికి తెలియాల్సి ఉంది. గత 2014లో సీపీఐతో కుదుర్చుకున్న సీట్ల సర్ధుబాటు ప్రక్రియ వైసీపీకి మేలు చేసింది. ఈదఫా కూడా సీపీఐ, టీడీపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కే ప్రయోజనం చేకూర్చుతుందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దశాబ్ధాల తరబడి క్షేత్రస్థాయిలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు క్షణంలో మాయమైపోయి ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల మద్యన నెలకొన్న మనస్పర్ధలను మర్చిపోయి ఓట్ల మార్పిడి జరగటం అసాద్యమన్నది జగమెరిగిన సత్యం. దీంతో నాలుగేండ్ల మూడు నెలల్లో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేసి ఒంటరిగా బరిలోకి దిగుతున్న టీఆర్‌ఎస్ పది స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేస్తున్నరు.

365
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles