కంటి వెలుగు @ 1,02,324


Wed,September 12, 2018 01:42 AM

-114 గ్రామాలు, 8 మున్సిపల్ వార్డుల్లో ప్రక్రియ పూర్తి
ఖమ్మం, నమస్తేతెలంగాణ : అందత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో శరవేగంగా కొనసాగుతున్నది. కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ పర్యవేక్షణ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ కొండల్‌రావు సారథ్యంలో ఏర్పాటు చేసిన 32 వైద్యశిబిరాలకు పరుగులు పెడుతున్న ప్రజానీకం తమను సుధీర్ఘకాలంగా వేధిస్తున్న కంటి సమస్యలకు పరిష్కారం పొందుతున్నరు. తాజాగా అందిన సమాచారం మేరకు జిల్లాలో 114 గ్రామాలు, ఖమ్మం నగరపాలకసంస్థ, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఎనిమిది మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షల ప్రక్రియ వందశాతం విజయవంతంగా పూర్తయ్యింది. కాగా జిల్లావ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 7,203 మందికి వైద్యారోగ్యశాఖ యంత్రాంగం కంటి పరీక్షలు నిర్వహింటం పథకం అమలుతీరుకు అద్దం పడుతున్నది. వారిలో 1,964మందికి దగ్గర చూపు కళ్లద్దాలు అందించగా, మరో 1,405 మందికి దూరపు చూపు అద్దాలు అవసరం ఉన్నాయని ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి నివేదించారు. కండ్ల ఆపరేషన్ నిమిత్తం 698 మందిని గుర్తించిన అధికారులు ఖమ్మం, హైదరాబాద్ నగరాలకు చెందిన ఎంపిక చేసిన వైద్యశాలలకు సిఫారస్ చేశారు. ఆధార్‌కార్డ్ తీసుకెళ్లిన ప్రతిఒక్కరి వివరాలను వైద్యారోగ్యశాఖ సిబ్భంది ఎప్పటికప్పుడు నమోదుచేస్తూ ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి పంపిస్తున్నది.

లక్ష మందికి కంటి పరీక్షలు పూర్తి..
కంటివెలుగులో శిబిరాల ద్వారా ఇప్పటి వరకు మొత్తం 1,02,324 మందికి కంటి పరీక్షలు నిర్వహించటం గమనార్హం. వారిలో దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్న 32,212 మందికి అత్యాధునిక కళ్లద్దాలను, మందులను అక్కడికక్కడే ఉచితంగా అందజేశారు. దూరపు చూపు సమస్యను గుర్తించిన వారికోసం మరో 27,176 కళ్లద్దాలు అవసరం ఉన్నాయని సర్కారుకు నివేదించారు. మరో నెలరోజుల్లోపు కళ్లద్దాలు జిల్లాకు రానున్నాయని, నమోదు చేసుకున్న వారందరి ఇండ్ల వద్దకే వచ్చి అందజేస్తామని అధికారులు తెలియజేస్తున్నరు.

180
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...