=18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలి
=ఈ నెల25లోపు ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలి
=జిల్లా జాయింట్ కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖాన్ల
వైరా, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్ల కోసం అన్ని సౌకర్యాలనూ కల్పించాలని వైరా తహసీల్దార్ కోట రవికుమార్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖాన్ ఆదేశించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ ఆయేషా పరిశీలించారు. అనంతరం వైరాలోని బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను జేసీ పరిశీలించారు. ఈ పోలింగ్ స్టేషన్లలో విద్యుత్ సౌకర్యం, మంచినీటి సౌకర్యంతో పాటు ఓటర్లకు అవసరమయ్యే ఇతర సౌకర్యాలు ఉన్నాయా? లేదా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్‌లలో ఓటర్ల కోసమే సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలింగ్ బూత్‌లలో సౌకర్యాలు లేకపోతే ఆ బూత్‌లను రద్దు చేసి నూతన బూత్‌లను ఎంపిక చేస్తామన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్ల జాబితా సవరణను వేగవంతంగా చేపట్టాలన్నారు.
ఈ నెల10వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేశామన్నారు. ఈ జాబితా సవరణను బీఎల్వోలు ఈ నెల25లోపు చేపట్టాలన్నారు. ప్రధానంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ తమ పరిధిలోని బీఎల్వోను సంప్రదించి ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని సూచించారు. బీఎల్వోలు ఈ నెల25వ తేదీ వరకు పోలింగ్ బూత్‌ల వద్ద ఆయా గ్రామస్తులకు అందుబాటులో ఉండాలన్నారు. అంతేకాకుండా గ్రామాలను శాశ్వతంగా వదిలి వెళ్లిన వారి ఓట్లను బీఎల్వోలు విచారణ నిర్వహించి తొలగించాలన్నారు. ఓటు హక్కుపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, నూతన ఓట్లు నమోదు చేసేందుకు గ్రామాల్లో టమకా, మైక్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి త్వరలో నూతన వీవీ ప్యాట్లతో పాటు ఈవీఎంలు కూడా వస్తాయని చెప్పారు. నూతనంగా వచ్చే వీవీ ప్యాట్లపై ప్రతి నియోజకవర్గంలోని మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైరా తహసీల్దార్ కోట రవికుమార్, గిర్దావర్లు రవికుమార్, శ్రీనివాసరావు, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.